ఏపీ సీఎం జగన్ తో పాటు లండన్ పర్యటనకు వెళ్ళారు ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. జగన్ ప్రమాదంలో ఉన్నారనీ… ఎవర్నీ నమ్మే పరిస్థితుల్లో లేరంటూ ఆయన కన్నీరు మున్నీరవడం ఇప్పుడు సెన్షేషనల్ గా మారింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4 రిలీజ్ అవబోతున్నాయి. వైసీపీ, టీడీపీ కూటముల్లో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి టైమ్ లో అడ్వకేట్ జనరల్ పొన్నవోలు చేసిన కామెంట్స్ పై చర్చ జరుగుతోంది. ప్రభుత్వాలు మారితే పాత సర్కార్ హయాంలో పనిచేసిన వాళ్ళని తప్పిస్తారు. అధికారులైతే బదిలీలు తప్పవు. గత ప్రభుత్వ టైమ్ లో కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయిన వాళ్ళకైతే న్యాయపరంగా కూడా చిక్కులు ఎదురయ్యే ఛాన్సుంది. పొన్నవోలుకి ఇలాంటి పరిస్థితే ఎదురయ్యే ఛాన్సుంది. చంద్రబాబు నాయుడు జైలు కెళ్ళి 52 రోజు పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ విషయంలో జగన్ పగకు పొన్నవోలు కూడా తోడయ్యారు. దాంతో ఆయనంటే టీడీపీ శ్రేణులకు మండిపోతోంది. జగన్ అవినీతి కేసుల్లో వైఎస్ పేరు ఇరికించింది పొన్నవోలేనని షర్మిల ఆరోపణలు చేశారు. దాంతో వైఎస్ అభిమానులు కూడా ఆయనపై మండిపడుతున్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి NRIలతో మాట్లాడినప్పుడు… కన్నీళ్ళు పెట్టుకున్నారు. సీఎం జగన్ ప్రమాదంలో ఉన్నారనీ… ఆయన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ ఎన్నో అవమానాలు పడ్డారని ఆవేదన చెందారు. ఎవర్ని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదని పొన్నవోలు బాధపడ్డారు.
నిజంగా జగన్ కి ఇప్పటికప్పుడు ముంచుకొచ్చిన ప్రమాదం ఏంటి ? ఒకవేళ ప్రభుత్వం మారితే మాత్రం… జగన్ పై ఉన్న పాత అవినీతి కేసులను తవ్వడంతో పాటు… కొత్తవి బుక్ అయ్యే అవకాశాలూ ఉన్నాయి. వాటి గురించి పొన్నవోలు భయపడుతున్నారా లేదంటే… కొత్త ప్రభుత్వం తనపైనా కక్ష తీర్చుకుంటుందని భయపడుతున్నారా అన్నది అర్థం కావట్లేదు. ఎన్నికల ఫలితాలకు ముందు పొన్నవోలులో కనిపిస్తున్న భయంపై ఏపీలో చర్చ జరుగుతోంది.