ఏపీలో వచ్చే ఎన్నికల్లో (AP Assembly Elections) వైసీపీ (YCP) అభ్యర్థులపై వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఏడు విడతల్లో 64 మంది ఇంఛార్జులను ప్రకటించారు. ఫైనల్ లిస్టు దాదాపు ఖరారైనట్లు తెలిపారు. 99 శాతం మార్పులు పూర్తయ్యాయనీ.. ఇకపై పెద్దగా మార్పులు ఉండబోవన్నారు. తాడేపల్లిలో మేం సిద్ధం- మా బూత్ సిద్ధం పేరుతో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ మాట చెప్పేశారు జగన్. టిక్కెట్ల గురించి ఏమీ ఆలోచించకుండా మీ ప్రచారం స్టార్ట్ చేయండని… అభ్యర్థులు, వైసీపీ (YCP) నేతలకు తెలిపారు జగన్. మిగిలిన నియోజకవర్గాల్లో ఒకరిద్దరు మినహా సిట్టింగ్స్ అందరికీ మళ్ళీ టిక్కెట్లు ఇస్తున్నట్టు పరోక్షంగా సంకేతాలిచ్చారు జగన్.
ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలుంటే వాటిల్లో 64 చోట్ల అభ్యర్థులను మారుస్తూ వచ్చారు జగన్. ఇప్పటిదాకా 7 లిస్టులు రిలీజ్ అవగా… 34 నియోజకవర్గాల్లో కొత్తవాళ్ళకి ఛాన్స్ దక్కింది. మొత్తం 29 SC రిజర్వుడ్ స్థానాల్లో… 20మంది కొత్తవాళ్ళకి ఛాన్సిచ్చారు. 30 మంది సిట్టింగ్స్ ని పక్కనపెట్టేసింది వైసీపీ అధిష్టానం. మిగతా నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాలు ఎప్పుడొస్తాయా అని సిట్టింగ్స్, వైసీపీ లీడర్లు ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే జగన్ తాడేపల్లి సమావేశంలో ఆ శుభవార్త కూడా చెప్పేశారు. దాదాపు అభ్యర్థుల జాబితాలు ఫైనల్ అయ్యాయన్నారు. అంటే ఇప్పటిదాకా ప్రకటించిన 64 మంది ఇంఛార్జులు… వైసీపీ అభ్యర్థులుగా కంటిన్యూ అవుతారు. ఇంఛార్జులంతా అభ్యర్థులు కారు అంటూ… మధ్యలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) కన్ ఫ్యూజ్ చేసి టెన్షన్ లో పెట్టారు. కానీ దాదాపు మార్పులు చేర్పులు ఉండకపోవచ్చని జగన్ చెప్పడంతో… మిగిలిన నియోజకవర్గాల్లో సిట్టింగ్స్ అందరికీ టిక్కెట్లు దక్కినట్టే. అధికారికంగా ఆ లిస్టులను కూడా తొందర్లోనే వైసీపీ రిలీజ్ చేసే ఛాన్సుంది. జగన్ తాజా ప్రకటనతో ఇంఛార్జులుగా నియమితులైనవారు, సిట్టింగ్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
అటు ఎంపీల విషయంలో దాదాపు 10 నుంచి 15 మంది దాకా క్లారిటీ వచ్చింది. మిగిలిన ఇంఛార్జుల సంగతి కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సిద్ధం నాలుగో సభ పూర్తయ్యాక… మొత్తం 175 ఎమ్మెల్యే సీట్లకు, పాతిక ఎంపీ అభ్యర్థుల జాబితాను వైసీపీ రిలీజ్ చేసే ఛాన్సుంది. మార్చి మొదటివారంలో ఈ లిస్ట్ రిలీజ్ అయితే ఇక తమ పార్టీ అభ్యర్థులు… ఎన్నికల యుద్ధానికి రెడీ అయిపోయినట్టే అంటున్నారు వైసీపీ నేతలు.