ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) విడుదలైనా… ఉమ్మడి కృష్ణాజిల్లాలో అభ్యర్థులను ఫైనల్ చేయటంలో జనసేన (Janasena) మీన మేషాలు లెక్కిస్తోంది. ఈ వాయిదాల పర్వంతో పార్టీ నేతలు తీవ్రంగా నిరుత్సాహపడుతున్నట్టు తెలిసింది. జిల్లా నుంచి మొదట మూడు ఎమ్మెల్యే సీట్లు ఆశించిన జనసేనకు చివరికి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. వాటిని కూడా ప్రకటించుకోలేకపోతే ఎలాగంటూ నిట్టూరుస్తున్నారట పార్టీ లీడర్స్. బెజవాడ పశ్చిమ, అవనిగడ్డ, పెడన స్థానాలు తమ కోటాలో వస్తాయని మొదట్లో భావించింది పార్టీ క్యాడర్. కానీ… పెడనకు టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. రెండు సీట్లతో సరిపెట్టుకుందామని భావిస్తున్న టైంలో బెజవాడ పశ్చిమ సీటు అనూహ్యంగా బీజేపీ (BJP) కి వెళ్లింది.
ఇక ఫైనల్ గా అవనిగడ్డ (Avanigadda) ఎమ్మెల్యే, బందరు ఎంపీ స్థానం మిగిలాయి. మచిలీపట్నం ఎంపీ సీట్లో వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన సిట్టింగ్ ఎంపీ బాలశౌరి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. ఆయన కూడా తాను ఎంపీగా బందరు నుంచే మరోమారు పోటీ చేస్తున్నానని చెప్పకనే చెప్పారు.
దీంతో ఆ పేరు ఫైనల్ అయినట్టేనని అనుకున్నారు. కానీ… కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ అంటూ కన్ఫామ్ చేసిన పవన్ (Pawan)… మచిలీపట్నం (Machilipatnam) విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. బాలశౌరి పేరు కన్ఫార్మ్ అనుకుంటున్న టైంలోఎందుకు పెండింగ్ లో పెట్టారో పార్టీ నేతలకు అర్థం కావటంలేదట. ఇక అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా పలువురి పేర్లను పరిశీలించిన పవన్… విక్కుర్తి శ్రీనివాస్‌ను ఖరారు చేస్తున్నారనే ప్రచారం పార్టీలో జరిగింది. ఆ తర్వాత జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పేరు ప్రచారమైంది. కానీ… ఎంపీ బాలశౌరిని అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించబోతున్నారంటూ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేస్తోందని అంటున్నారు. అయితే దీనిపై పార్టీ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. బాలశౌరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేస్తే… ఎంపీ అభ్యర్థి ఎవరనే చర్చ కూడా స్థానికంగా మొదలైంది. అసలాయన ఎమ్మెల్యే స్థానానికి పోటీ పడతారా అన్నది మరో చర్చ. అటు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కు మళ్ళీ టికెట్ ఖరారు చేసేసింది. దీంతో రమేష్ ఎన్నికల నిర్వహణపై ఫోకస్ పెట్టారట.
ఇక పొత్తులో భాగంగా టికెట్ దక్కని మాజీ డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్ వర్గం నుంచి అవనిగడ్డ టికెట్ తిరిగి బుద్ధప్రసాద్ కు కేటాయించాలనే డిమాండ్ మొదలైందట. వైసీపీ స్పీడు, టీడీపీ నిరసన గళాలతో అభ్యర్థిని ఫైనల్ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న డౌట్స్ కూడా పెరుగుతున్నట్టు తెలిసింది. మొత్తంగా ఎవరు పోటీ చేసినా… ఉన్న రెండు సీట్లలో కూడా క్లారిటీ ఇవ్వకుండా పవన్ పెండింగ్‌లో పెట్టడం ఏంటన్న అసహనం మాత్రం జనసేన కేడర్‌లో పెరుగుతోందన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ.