ఎన్నికలు ఎప్పుడు వస్తాయా… ఎప్పుడెప్పుడు కొందరు వైసిపి (YCP) నాయకులని ఓటుతో వేటాడుదామా అన్నంత కసిగా ఉన్నారు జనసేన (Janasena ) కార్యకర్తలు. జగన్ని సంతోష పెట్టడానికి తిట్టారో…. రాజకీయంగా విమర్శించడానికి దూషించారో కానీ… మొత్తానికి ఈ పదిమంది నేతలు జనసేనకు మెయిన్ టార్గెట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషించడం, వెక్కిరించడం, కుటుంబాన్ని అభాసుపాలు చేయడం ఇవన్నీ లెక్క పెట్టుకునే ఉన్నారు జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. రాబోయే ఎన్నికల్లో ఆ లెక్క సరి చేస్తామని ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. వైసీపీ నాయకుల్లో ప్రధానంగా పది మందిని టార్గెట్ గా పెట్టుకున్నారు జనసేన నాయకులు. ఆ పది మంది పోటీ చేసే చోట వీలైతే నేరుగా బరిలోకి దిగడం, లేదా అక్కడ టీడీపీ అభ్యర్థులకి పూర్తిగా సహకరించి.. వీళ్ళని ఓడించి తీరాల్సిందేనని కసిగా ఉన్నారు.
జనసేన టార్గెట్ లో మొదటి నేత మంత్రి రోజా (Minister Roja). చిత్తూరు జిల్లా నగరి నుంచి రోజా బరిలో ఉన్నారు. మొదట ఆమెకు టికెట్ రాదని అన్నారు గానీ మొత్తానికి సాధించుకున్నారు. ఇక్కడ జనసేన నేరుగా పోటీ చేయదు. టిడిపి అభ్యర్థి ఉంటారు. కానీ నగరిలో రోజాను ఓడించడమే లక్ష్యంగా జనసేన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. గత 15 యేళ్ళుగా పవన్ కళ్యాణ్ ను రోజా తిట్టిన తిట్టు మళ్లీ తిట్టకుండా తిడుతున్నారు. పవన్ భార్యల గురించి, సినిమాలు గురించి, ఆయన కుటుంబం గురించి అవహేళనగా మాట్లాడటం రోజా రోజువారి పనుల్లో ఒకటి. అందుకే ఈసారి రోజాని స్పెషల్ గా టార్గెట్ చేశారు జనసేన నాయకులు. కేవలం పార్టీయే కాదు, అక్కడి బలిజ సామాజిక వర్గం కూడా రోజాకు వ్యతిరేకంగా ఈసారి ఓటు వేయబోతోంది.
కాపుల్ని కాపులతోనే తిట్టించడం జగన్ వ్యూహం. అందులోభాగంగానే పవన్ కళ్యాణ్ ని అర్ధరాత్రి అయినా సరే తిట్టడానికి సిద్ధంగా ఉండే నాయకుడు పేర్నినాని (Perni Nani). ఈసారి పేర్ని నాని పోటీ చేయట్లేదు. ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని బందరు నుంచి రంగంలోకి దింపుతున్నారు. పేర్నిపై నియోజకవర్గంలోనే బాగా వ్యతిరేకత ఉంది. దాన్ని ఆసరా చేసుకుని టిడిపి సహకారంతో పేర్ని నాని కుమారుని ఓడించడానికి జనసేన రంగం సిద్ధం చేసుకుంది.
ఇక ఆ తర్వాత జాబితాలో ఉన్నది కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ గుడివాడ నాని (Gudivada Nani). పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) ని మాటలతో చెడుగుడు ఆడుకోవడంలో నాని ముందుంటారు. గుడివాడలో ఇప్పుడు నానికి ప్రత్యర్థిగా టిడిపి నేత వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు. అక్కడ కాపుల ప్రాబల్యం చాలా ఉంది. గుడివాడలో కాపుల్ని నానికి వ్యతిరేకంగా కూడగట్టే పనిలో ఉంది జనసేన. ఎట్టి పరిస్థితుల్లోనూ గుడివాడ నానిని ఓడించాలని జనసేన లక్ష్యం.
సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్న అంబటి రాంబాబు(Ambati Rambabu)… పవన్ కళ్యాణ్ తో ఎప్పటి నుంచో ఫేస్ టు ఫేస్ వార్ చేస్తున్నారు. అంబటి – పవన్ కళ్యాణ్ ఒకరినొకరు విమర్శించుకోవడమే కాదు… పవన్ తన బ్రో సినిమాలో ఏకంగా అంబటి రాంబాబుని శ్యాంబాబు అనే పాత్రగా పెట్టి ఆడుకున్నారు కూడా. పవన్ కళ్యాణ్ ని నిత్యం తిట్టడం ద్వారానే అంబటి వార్తల్లో ఉంటారు. సత్తెనపల్లిలో మరో కాపు అగ్రనేత, టిడిపి లీడర్ కన్నా లక్ష్మీనారాయణతో పోటీ పడుతున్నారు అంబటి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అంబటిని ఓడించి తీరాలని జనసేన, కాపు నేతలు టార్గెట్ గా పెట్టుకున్నారు.
నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ కూడా పవన్ కళ్యాణ్ ని సెటైర్లతో అలా ఇలా ఆడుకోలేదు. పవన్ స్టైల్ ని వెటకారంగా ఇమిటేట్ చేస్తూ ఉంటారు అనిల్. ఇప్పుడు అదే ఆయన్ను దెబ్బతీయబోతోంది. నెల్లూరు సిటీలో మాజీ మంత్రి నారాయణతో పోటీ పడుతున్నారు అనిల్ యాదవ్. ఇక్కడ కూడా నారాయణని భారీ మెజార్టీతో గెలిపించి… అనిల్ ని దెబ్బ కొట్టాలనేది జనసేన ప్లాన్. ఇక కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి. ఎందుకో తెలియదు గానీ చంద్రశేఖర్ రెడ్డికీ పవన్ కళ్యాణ్ కీ మధ్య పొలిటికల్ వార్ కంటే పర్సనల్ వార్ పెరిగిపోయింది. ఒకరినొకరు మామూలుగా తిట్టిపోసుకోలేదు. పవన్ కళ్యాణ్ దమ్ముంటే తనపై పోటీ చేయాలని చంద్రశేఖర్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఈసారి కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డికి పరిస్థితి కష్టంగానే ఉంది. పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా తిట్టిన నాయకులందరినీ కాపు సామాజిక వర్గంలో యువత కూడా టార్గెట్ చేయబోతోంది. కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి ఈసారి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటారు.
జోగి రమేష్ కూడా జనసేన టార్గెట్ జాబితాలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ని మాటలతో చీల్చి చెండాడటానికి జోగి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అందుకనే జోగిని టార్గెట్ చేశారు జన సైనికులు. విశాఖ ఎంపీ MVV సత్యనారాయణ…. ఇప్పుడు విశాఖ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. అక్రమ నిర్మాణాల విషయంలో పవన్ కళ్యాణ్ ఈయన్ని అడ్డుకున్నందుకు తన నోటికి పని చెప్పారు MVV. పవన్ ని ప్యాకేజ్ స్టార్ గా అభివర్ణిస్తూ నానా యాగి చేశారు. అందుకే జనసేన జాబితాలో MVV కూడా ఉన్నారు. చివరగా అవంతి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ తో మాటల యుద్ధం చేశారు. పవన్ కూడా ఆయన్ని అవంతి, చామంతి, పూబంతి అంటూ సెటైర్లు వేసేవారు. ఎందుకో తెలియదు కానీ అవంతి ఇప్పుడు బాగా తగ్గిపోయారు. పవన్ జోలికి రావడం మానుకున్నారు…. అయినా సరే జనసైనికులు వదిలిపెట్టేటట్లు కనిపించడం లేదు. వైసీపీలో కాపు నేతలు చాలామంది ముఖ్యంగా బొత్స సత్యనారాయణ లాంటి వాళ్లు ముందు జాగ్రత్తగా పవన్ నీ ఎన్నడూ వ్యక్తిగతంగా విమర్శించకుండా ఉన్నారు. కేవలం రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమయ్యారు. వీళ్లంతా ఈసారి బతికిపోయినట్లే. ఈ పదిమంది వైసీపీ నేతలను మాత్రం ప్రత్యక్షంగా… పరోక్షంగా ఎన్నికల్లో చీల్చి చెండాడాలని జనసేన నాయకులు, పవన్ ఫ్యాన్స్, కాపు, బలిజ నేతలు అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నారు. ఈ పదిమందిలో కనీసం 8 మంది కచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉందంటున్నారు.