హరి రామజోగయ్య(Harirama Jogaiah)… మాజీ మంత్రి… కాపు సామాజిక వర్గం పెద్దాయనగా పిలుచుకునే నాయకుడు. కాపుల కోసం ఓ వైపు ముద్రగడ పద్మనాభం తనదైన స్టైల్లో ఉద్యమాలు చేపడితే.. హరి రామజోగయ్య మరో స్టైల్లో రాజకీయ వ్యవహారాలు నడిపిస్తుంటారు. పొలిటికల్ కామెంట్స్ చేస్తూ.. తనకున్న ఇమేజీతో కాస్తో కూస్తో ప్రభావితం చూసే ప్రయత్నం చేస్తారాయన. ఈ క్రమంలోనే జనసేనకు, ఆ పార్టీ అధినాయకత్వానికి తన వైపు నుంచి.. అప్పడప్పుడు అడక్కుండానే.. సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. జనసేన అలా చేయాలి.. ఇలా చేయాలి.. లేదంటే చాలా కష్టం.. కాపు ఓట్లు ట్రాన్సఫర్ కావు అంటూ… రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. అంతే కాకుండా.. కొన్ని సందర్భాల్లో జనసేన ఏ రకమైన వ్యూహాలను అవలంభిస్తే బాగుంటుందనే సూచనలు కూడా చేస్తుంటారు హరి రామజోగయ్య.
ఇప్పుడు టీడీపీ(TDP) తో సీట్ల సర్దుబాటు మీద జరుగుతున్న చర్చలు.. జనసేనకు కేటాయించే స్థానాలపై ప్రచారం లాంటి పరిణామాలతో తాజాగా మరో లేఖాస్త్రాన్ని సంధించారు జోగయ్య. అందులో ప్రస్తావించిన అంశాలు, చేసిన సూచనలు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తోపాటు జనసేన (Jana Sena) అగ్ర నాయకత్వాన్ని కాస్త తత్తరపాటుకు గురిచేశాయన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. పొత్తులన్నాక కొంత మేర సర్దుబాట్లు తప్పవనీ… కొంతమంది బాధ పడతారనీ… అయినా విశాల ధృక్పధంతో ఆలోచించి 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండేలా చూసుకోవాలని తన కేడర్‌ని ఉద్దేశించి అన్నారు పవన్. దీంతో ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విధంగా జనసేనకు 25 నుంచి 30 స్థానాలకు మించి దక్కవన్న వాదనకు మరింత బలం చేకూరినట్టయింది. కానీ… కనీసం… తక్కువలో తక్కువ 40 నుంచి 60 స్థానాలు జనసేనకు ఉండాల్సిందేననీ… లేకుంటే పొత్తుకు అర్థం లేకుండా పోతుందని జోగయ్య తన లేఖలో రాయడం సంచలనంగా మారింది. అలాగే తగిన ప్రాధాన్యం దక్కకుంటే కాపు సామాజికవర్గం ఓట్లు ట్రాన్సఫర్ కావనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారాయన. దీంతో చర్చ అంతా ఓట్ ట్రాన్సఫర్ మీదకు మళ్లింది.
ఈ లెటర్ తో కచ్చితంగా గౌరవ ప్రదమైన స్థానాలు తీసుకోవాల్సిందేనంటూ జనసేన అధినాయకత్వం మీద వత్తిడి పెరుగుతోందని అంటున్నారు. ఆ లేఖ, దాని తర్వాత పెరిగిన వాదన జనసేన అధినాయకత్వానికి తలనొప్పిగా మారుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే తాను గెలిచి.. తనతో పాటు ఇంకొందర్ని జనసేన ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి తీసుకెళ్లడమే టార్గెట్‌గా పని చేస్తున్నారు పవన్‌కళ్యాణ్. ఈ క్రమంలోనే వాస్తవాలకు అతి దగ్గరగా ఆలోచనలు చేస్తూ.. ఎమోషన్స్‌కు దూరంగా ఉండి సీట్ల సర్దుబాటు.. అభ్యర్థుల ఖరారు మీద పవన్ కసరత్తు చేస్తున్నారన్నది ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. ఓట్ షేరింగ్ విషయంలో కూడా తేడాలు రాకుండా ఉండేలా తన అభిమానులు.. కేడర్ మైండ్ సెట్‌ను సిద్ధం చేసుకుంటుంటే… అందుకోసం నానా తంటాలు పడుతుంటే… జోగయ్య లేఖల పేరుతో చెవిలో జోరీగలా మారారన్నది జనసేన ముఖ్యుల అభిప్రాయంగా తెలిసింది. అసలా లేఖల ద్వారా చర్చ వేరే రకంగా పోతోందని పార్టీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోందట. ఓవైపు సానుకూలంగా వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవడం కోసం పవన్ కసరత్తు చేస్తుంటే..
ఇదే టైంలో ఈ లేఖల గోలేంటన్న అసహనం కూడా గ్లాస్ పార్టీ నాయకుల్లో ఉన్నట్టు తెలిసింది. లేఖల పేరుతో అసలాయన మంచి చేస్తున్నారా? లేక చెడు చేస్తున్నారా అన్న ప్రశ్నలు సైతం పార్టీ వర్గాల్లో ఉన్నట్టు తెలిసింది. పెద్ద మనిషి కాబట్టి జోగయ్యను ఏ విధంగా కంట్రోల్ చేయాలో అర్థం కాక తికమక పడుతున్న పరిస్థితి ఉంది పార్టీలో. రాసింది చాలు… ఇక లేఖలు వద్దని నేరుగా ఆయనకు చెప్పలేని పరిస్థితి. అలాగని సైలెంటుగా ఉంటే ఈ పరిణామాలు ఎట్నుంచి ఎటు పోతాయో తెలియని భయం. దాంతో ఇప్పుడేం చేయాలంటూ మల్లగుల్లాలు పడుతోందట జనసేన అగ్ర నాయకత్వం. మొత్తంగా హరిరామ జోగయ్య తన లేఖలతో తమకు గోగయ్యగా మారారన్నది జనసేన పెద్దల అభిప్రాయమట. మరి పార్టీ బాధను పెద్దాయన అర్ధం చేసుకుంటారా? లేక నాదారి నాదే డోంట్ కేర్ అంటారో చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు.