ఏపీలో జనం ఎవరికి పట్టం కడతారన్నదానిపై పదుల సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. జాతీయ సర్వేలు NDA కూటమి వైపు మొగ్గితే… ప్రాంతీయ సర్వేలు మాత్రం జగన్ కే ఓటేశాయి. కానీ కేకే సర్వే మాత్రం కూటమి విజయాన్ని హండ్రెడ్ పర్సెంట్ అంచనా వేసింది. ఎవరూ ఊహించని విధంగా కూటమికి 160 సీట్లు వస్తాయని కేకే సర్వే తమ అంచనాలను బయటపెట్టింది. కొన్ని నేషనల్, లోకల్ సర్వేలకు భిన్నంగా ఇచ్చిన ఈ ఫలితాలు ఇప్పుడు అక్షరాలా నిజమయ్యాయి.
ఈసారి ఏపీలో జనం ఓట్లు ఎటు వేశారన్నది ఊహించడం చాలా కష్టమైంది. వైసీపీతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలంగా ఢీకొన్నది. అందుకే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా గందరగోళంగానే వచ్చాయి. గతంలో కచ్చితమైన ఫలితాలు ఇచ్చిన ఆరా మస్తాన్ లాంటి వారు ఈసారి వైసీపీ ఘన విజయం సాధిస్తుందని అంచనా వేశారు. ఈ టైమ్ లో చాలా పకడ్బందీగా, నియోజకవర్గాల వారీగా అనాలసిస్ చేసిన కేకే సర్వే… ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్ ను ఇచ్చింది.
ఈ ఎన్నికల్లో టీడీపీ ఆధ్వర్యంలోని NDA కూటమిదే భారీ విజయం అని కేకే సర్వే తేల్చి చెప్పింది. అంతేకాదు… మొత్తం 175 స్థానాల్లో వైసీపీ 14 సీట్లకు పరిమితం అవుతుందని చెప్పడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 133, జనసేనకు 21 కి 21, బీజేపీ 10కి ఏడు సీట్లు వస్తాయని కేకే సర్వే తెలిపింది. ఈ అంచనాలు దాదాపు 95శాతం దాకా కరెక్ట్ అవడం విశేషం.
ఏపీలో మరోసారి వైసీపీదే విజయం అని చెప్పిన ఆరా మస్తాన్… ఇప్పుడు ఎక్కడున్నారో తెలియడం లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. రిజల్ట్స్ మొదట్లో ఓ టీవీ ఛానెల్ లో విశ్లేషణ చేస్తూ కనిపించిన ఆరా మస్తాన్… తర్వాత కూటమికి అనుకూలంగా ఫలితాలు వస్తుండటంతో ఉన్నట్టుండి మాయమయ్యారు. అసలు ఎలాంటి సైంటిఫిక్ మెథడ్ పాటించకుండా… సర్వేకి సంబంధించిన విధివిధానాలను ఏవీ పాటించకుండా కేవలం నోటి లెక్కలతో మభ్యపెట్టారని ఆయనపై విమర్శలు ఉన్నాయి. వైసీపీ బెట్టింగ్ రాయుళ్ళ కోసమే ఆరా మస్తాన్ తప్పుడు సర్వేలు చెప్పారని జనం మండిపడుతున్నారు. అదే టైమ్ లో ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చిన కేకే సర్వేని టీడీపీ శ్రేణులే కాదు… జనం కూడా మెచ్చుకుంటున్నారు.