సాగు నీటి విషయంలో బీఆర్ఎస్ (BRS) తెలంగాణ (Telangana) కు అన్యాయం చేసిందని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్పటి రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్…. అలయ్… బలయ్ చేసుకొని బిర్యాలు తిని… విందులు చేసుకొని …ఆంధ్రాకు నీళ్ళను అప్పగించారని ఆరోపించారు ఉత్తమ్. రాష్ట్రంలో ఓడిపోతామని తెలిసే ఆంధ్రకు నీళ్ళు ఇచ్చారని మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీలో కృష్ణానది జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power point presentation) ఇచ్చారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy). రెండు రాష్ట్రాల నీటి వాటా తేల్చేందుకే KRMBని ఏర్పాటు చేశారు. నీటి పంపకాల విషయంలో గత ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు మంత్రి. అసెంబ్లీ ఎన్నికల్లో BRS ఓడిపోతుందని తెలిసి… ఎన్నికలకు ఒక్క రోజు ముందు నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) పైకి ఏపీ సీఎం జగన్ పోలీసులను పంపించారని ఉత్తమ్ ఆరోపించారు. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఈ అంశంపై కేసీఆర్ ఎందుకు ఒక్క మాట మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ తో కలసి విందులు, వినోదాలు చేసుకున్న కేసీఆర్… నీళ్ళను ఉదారంగా ఆంధ్రకు అప్పగించారని ఆరోపించారు. BRS ఘనకార్యం వల్ల నాగార్జున సాగర్ డ్యామ్ ఎండిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. దీనికి సంబంధించి… జగన్ ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు ఉత్తమ్.
కృష్ణా ప్రాజెక్టుల (Krishna Projects) ను ఎట్టి పరిస్థితుల్లోనూ KRMBకి అప్పగించేది లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ లీడర్లు తెలంగాణ ప్రజలను అపోహలకు గురిచేస్తున్నారనీ… దానిపై వివరణ ఇస్తున్నామన్నారు. గత 60 ఏళ్ల పాలనలో కన్నా… పదేళ్ల BRS పాలనలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని వివరించారు ఉత్తమ్. శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam project) నుంచి గతం కంటే 50శాతం కన్నా అన్యాయంగా నీటి తరలింపు జరిగిందన్నారు. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్లి…. 299 TMCలకు ఒప్పుకొని కృష్ణానదిలో నీటి వాటాలో తెలంగాణకి శాశ్వత నష్టం చేశారని ఆరోపించారు ఉత్తమ్.
కేసిఆర్ పాలమూరు రంగారెడ్డికి చాలా అన్యాయం చేశారని అన్నారు. ప్రజెంటేషన్ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు మాటలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కరీంనగర్ ప్రజలు వెళ్ళగొడితే… పాలమూరు వచ్చి గెలిచిన కేసీఆర్… ఆ ప్రాంతానికి అన్యాయం చేశారని ఆరోపించారు. ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే… కేసీఆర్ సభకు రాకుండా ఫామ్ హౌజ్ లో ఎందుకు ఉన్నారని నిలదీశారు సీఎం రేవంత్.
కృష్ణా ప్రాజెక్టులను KRMB కి ఎందుకు అప్పగించారని మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. మేం స్పందించిన తర్వాత… ప్రజల నుంచి నిరసన వస్తుందన్న భయంతోనే రెస్పాండ్ అయ్యారు. అంతకుముందు ప్రాజెక్టుల అప్పగింతపై సమావేశాల్లో ఏంజరిగిందో సభకు వివరించారు హరీష్. 13న నల్లగొండలో బీఆర్ఎస్ మీటింగ్ పెడుతోందని భయపడే … అసెంబ్లీలో హడావిడిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ లీడర్లు ఆరోపించారు.