ఏపీలో పోలింగ్ (AP Polling) తర్వాత జరుగుతున్న గొడవలు అన్నీ ఇన్నీ కావు. గ్రౌండ్ లెవల్‌లో మాత్రమే కాదు.. సోషల్ మీడియా (Social Media) కూడా ఈ వ్యవహారంలో రగిలిపోతోంది. దాడులు జరుగుతున్నాయని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇలా వార్తలు వచ్చాయో లేదో.. లక్షల ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయ్. నిజమైన దాడులవి గోరంత అయితే.. ఫేక్ దాడులు కొండంత. అలాంటి ఫేక్ వార్త ఒకటి.. టీడీపీ (TDP) నేత నారా లోకేశ్ (Nara Lokesh) ను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఓ ఫేక్ పోస్ట్‌తో పరువు పోగొట్టుకోవాల్సి వచ్చింది. వ్యక్తిగత గొడవల్లో గాయాలైన మహిళల ఫొటోలను.. పోలింగ్ తర్వాత జరిగాయ్ అన్నట్లు లోకేశ్ పోస్ట్ చేశారు.
ఇది ఫేక్ అని పోలీసులు రియాక్ట్ అయ్యారు. దీంతో లోకేశ్ పరువు పోయినట్లు అయిందని వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయ్. ఎన్నికల రోజు వైజాగ్‌లోని అక్కిరెడ్డిపాలెంలో గొడవ జరిగింది. వైసీపీకి ఓటు వేయలేదని, ఓ కుటుంబంపై దాడి చేశారని, వాళ్లను గాయపరిచారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. బాధితులు కూడా తమపై పొలిటికల్ అటాక్ జరిగిందని ఆరోపించారు. దీంతో లోకేష్ కూడా ఇది పొలిటికల్ దాడి అని షేర్ చేశారు. తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో వైసీపీని విమర్శిస్తూ పోస్టింగ్ పెట్టారు. ప్రజాస్వామ్యంపై వైసీపీ నేతలు దాడి చేశారని మండిపడ్డారు. అమానవీయ ఘటన, అనాగరిక చర్య అంటూ దుమ్మెత్తిపోశారు. టీడీపీ సానుభూతిపరులంతా సోషల్ మీడియాలో ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ రెచ్చిపోతున్నారు.
ఐతే విశాఖ పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. అది అసలు పొలిటికల్ దాడి కాదని వివరణ ఇచ్చారు. కేవలం వ్యక్తిగత తగాదాల వల్ల ఇరుగు పొరుగు వారు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారని చెప్పారు. పాత గొడవలు ఉన్నాయని.. ఈ గొడవలకు రాజకీయాలకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. సోషల్ మీడియాలోని ఫేక్ పోస్టులను నమ్మొద్దని అన్నారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా విభాగం.. ఈ వివరణను హైలైట్ చేసింది. లోకేష్ సిగ్గుతో తలదించుకోవాలని ఘాటుగా ఓ పోస్ట్ చేసింది. ఓ పోస్టింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.