Kapu Ramachandra Reddy: వైసీపీ అధినేత జగన్‌ను గుడ్డిగా నమ్మితే.. నమ్మించి గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. సర్వేల పేరుతో తనకు టిక్కెట్ లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా.. జగన్.. కాపు రామచంద్రారెడ్డికి టిక్కెట్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆయన తాడేపల్లిలో జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, జగన్ అంగీకరించకపోవడంతో ఆగ్రహంగా బయటకు వచ్చేశారు.
KA PAUL: కేఏ పాల్‌పై విష ప్రయోగం జరిగిందా.. వైరల్ ఆడియోలో ఏముంది..?
ఈ సందర్భంగా జగన్‌పై విమర్శలు చేశారు. “జగన్ మోహన్ రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీనీ, పదవిని వదులుకుని వచ్చాం. గతంలో మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి, తర్వాత పదవి ఇవ్వలేదు. ఇప్పుడేమో సర్వే పేరుతో టికెట్ లేదని చెప్పారు. దరిద్రపు సర్వేలు చేశారు. సర్వే ద్వారా టిక్కెట్ లేదని చెప్పారు. దీనిపై మాట్లాడుదామంటే జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇంత కన్నా ఇంకేం అవమానం ఉండదు. అవకాశం ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా. నేను రాయదుర్గం, నా భార్య కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తాం” అని కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలో జగన్ నివాసం ముందు సెల్యూట్ చేసి, గుడ్‌బై చెప్పి వెనుదిరిగారు. ప్రస్తుతం వైసీపీలో మూడో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. దీనిలో భాగంగా టిక్కెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. కాపు రామచంద్రారెడ్డిని కూడా అలాగే పిలిపించుకుని ఈ విషయం చెప్పారు.
సర్వేల్లో ఆయనకు అనుకూలంగా లేదని, టిక్కెట్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో ఎమ్మెల్యే కాపు.. జగన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. నిజానికి.. కాపు రామచంద్రారెడ్డి సీఎం జగన్‌కు సన్నిహితంగా ఉన్న నేత. జగన్‌తోపాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన నేతల్లో కాపు ఒకరు. అయితే, ఇప్పుడు ఆయనకు టిక్కెట్ నిరాకరించారు. ప్రస్తుతం రాయదుర్గంలో టీడీపీ నుంచి కాల్వ శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో తెలియాలి.