Mudragada : ముద్రగడ ఇక కాపులను వదిలేసినట్లేనా.. ఆయనకు ఇంత మూర్ఖత్వం ఎందుకు ?

సవాళ్లు విసరడం రాజకీయాల్లో ఎంత తెలివిగల నిర్ణయమో.. విసిరిన ప్రతీ సవాల్‌ను నిజం చేయాలి అనుకోవడం అప్పుడప్పుడు మూర్ఖత్వంగా మారుతుంటుంది.

సవాళ్లు విసరడం రాజకీయాల్లో ఎంత తెలివిగల నిర్ణయమో.. విసిరిన ప్రతీ సవాల్‌ను నిజం చేయాలి అనుకోవడం అప్పుడప్పుడు మూర్ఖత్వంగా మారుతుంటుంది. ముద్రగడ విషయంలో ఇప్పుడు వినిపిస్తున్న మాట ఇదే. ఎన్నికలు వస్తే చాలు.. రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు, చేసే వాగ్దానాలు.. విసిరే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ఎదుటోడు గెలిస్తే ముక్కు నేలకు రాస్తా అనే వాళ్లు కొందరు అయితే.. ముక్కు కోసుకంటా, రాజకీయ సన్యాసం చేస్తా అని సవాల్ విసిరేవాళ్లు ఇంకొందరు.

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇదంతా కామన్. పోనీ ఇంత సవాల్ చేసి మాట నిలబెట్టుకుంటారా అంటే.. అదీ ఉండదు. ఐతే కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ మాత్రం.. విసిరిన సవాల్‌ను నిజం చేశారు. పేరు మార్చుకున్నారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే రెడ్డిగా పేరు మార్చుకుంటానని ఎన్నికల సమయంలో చేసిన చాలెంజ్‌కు కట్టుబడి… పేరు మార్చుకున్నారు. ముద్రగడ ఇప్పుడు పద్మనాభరెడ్డిగా మారిపోయారు. నిజానికి పవన్‌ ఇలా గెలిచాడో లేదో.. జనసైనికులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ముద్రగడ నామకరణ మహోత్సవం అంటూ కరపత్రాలు కొట్టించి.. ఫంక్షన్‌లు నిర్వహించి.. ఘోరంగా ట్రోల్ చేశారు. ఇలాంటి పరిణమాల మధ్య పేరు మార్పునకు ముద్రగడ దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం నుంచి గెజిట్ కూడా రిలీజ్ అయింది.
ముద్రగడ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. పవన్ కల్యాణ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే.. వైసీపీ వాళ్లు మాత్రం మాట మీద నిలబడిన ముద్రగడ.. నిజమైన కాపు అంటూ సపోర్టుగా నిలుస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. కాపుల హక్కుల కోసం పోరాటం అనే మాట వచ్చిన ప్రతీసారి మొదటగా వినిపించే పేరు.. ముద్రగడ పద్మనాభం. అలాంటిది ఇప్పుడు ఆయన కులం మార్చుకున్నారు. రెడ్డి అయిపోయారు. పద్మనాభ రెడ్డిగా మిగిలిపోయారు. కాపు ఉద్యమ నేత పోరాటం.. ఇప్పుడు కాపుల తరఫునే ఉంటుందా.. రెడ్డిగా పేరు మార్చుకున్నారు కాబట్టి.. రెడ్డి సమస్యలపై పోరాడుతారా.. అసలు ముద్రగడ మనసులో ఏముంది.. ఎన్నికల్లో వాగ్దానాలను పట్టించుకునే తీరిక లేని జనాల కోసం ఆయన పేరు మార్చుకున్నారా.. ఇంత మూర్ఖంగా ఎలా వ్యవహరించారు అనే చర్చ జరుగుతోంది. ఏమైనా 2019 ఎన్నికలు ముద్రగడ జీవితాన్ని పూర్తిగా మార్చేశాయ్.

పవన్ కల్యాణ్ కోసం ముద్రగడకు సొంత కూతురే ఎదురు తిరిగింది. ఎన్నికల టైమ్‌లో ఘాటు విమర్శలు చేసింది. అసలు ఆమె తన కూతురే కాదని ముద్రగడ నోటి నుంచి ఓ మాట వచ్చిందంటే.. ఇద్దరి మధ్య దూరం ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక పవన్‌ను టార్గెట్ చేస్తూ.. సొంత సామాజికవర్గానికే చెడు అయ్యారు. వైసీపీకి మద్దతుగా నిలుస్తూ.. ఏ కాపు హక్కుల కోసం తాను ఉద్యమాలు చేశాడో.. అదే కాపులకు విలన్‌గా మారాడు ముద్రగడ. పవన్ కల్యాణ్‌తో ముద్రగడ గొడవ పెట్టుకోవడాన్ని.. సొంత సామాజికవర్గమే కాదు సొంత కుటుంబం కూడా అంగీకరించలేకపోయింది. కూతురు దూరం అయింది.. కులం దూరం అయింది. పేరు కూడా మారిపోయింది. డిప్యూటీ సీఎం పవన్‌తో గొడవే మిగిలింది. ఇంత చేసి.. ఇన్ని మార్చుకొని.. రెడ్డిగారండీ ఏం సాధించారు మీరు.. ఏం మిగిలింది మీరు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయ్ సోషల్ మీడియాలో…