ఏపీలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మళ్ళీ వైసీపీ గూటికి చేరుకుంటున్నారు. ఈనెల 12న ఫ్యాన్ కిందకు చేరిపోతారని తెలుస్తోంది. ముద్రగడతో వైసీపీ నేత జక్కంపూడి గణేష్ మంతనాలు జరిపారు. పార్టీ సీనియర్ నేత మిథున్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించారు మిథున్ రెడ్డి. ఆ పార్టీలోకి వెళ్ళడం ఖాయమే గానీ… ముద్రగడకు, ఆయన కొడుక్కి టిక్కెట్ ఇస్తామన్న హామీ మాత్రం దక్కలేదని తెలుస్తోంది.
ముద్రగడ పద్మనాభంకు పాలిటిక్స్ అచ్చి రావట్లేదు. కాపు ఉద్యమంలో బాగానే పేరు వచ్చినా…పాలిటిక్స్ లో ఆయనకు ప్లేస్ ఇవ్వడానికి పార్టీలు ముందుకు రావట్లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ను ఓ రేంజ్ లోకి తీసుకెళ్ళారు. రైలు విధ్వంసం… కేసులు నమోదు కావడం… చంద్రబాబు సర్కార్ పై కాపుల్లో తీవ్ర ఆగ్రహం ఇవన్నీ అప్పట్లో జరిగాయి. ఆ తర్వాత వైసీపీకి దగ్గరైన పద్మనాభం… ఆ పార్టీలో చేరడానికి చాన్నాళ్ళు వెయిట్ చేశారు. కానీ జగన్ పెద్దగా పట్టించుకోలేదు. తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న కోపంతో జనసేనలో చేరాలనుకున్నారు. పవన్ కల్యాణ్ కూడా … ఇదుగో వస్తా… అదుగో వస్తా అంటూ ముఖం చాటేశారు. పైగా నాకు ఎవరి సలహాలు అక్కర్లేదంటూ పరోక్షంగా ముద్రగడకు చెప్పేశారు. దాంతో ఆయన మళ్ళీ వైసీపీలోకి చేరాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
గతంలో వైసీపీలో ముద్రగడను చేర్చుకోకపోవడానికి ఆయన పెట్టిన డిమాండ్లే కారణమని తెలుస్తోంది.
తనతో పాటు తన కొడుకు గిరికి ఎమ్మెల్యే టిక్కెట్లు అడిగినట్టు సమాచారం. అందుకు జగన్ ఒప్పుకోకపోవడం వల్లే వైసీపీలో ముద్రగడ చేరిక ఆగిపోయింది. పైగా సర్వేలు కూడా అనుకూలంగా లేకపోవడంతో లైట్ తీసుకున్నారు జగన్. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ తో విభేదించడం వల్ల ముద్రగడకు మళ్ళీ వైసీపీ ఆహ్వానం పలుకుతోంది. ఆయన కూడా మరో వారం రోజుల్లో చేరడం కూడా ఖాయం.ప అయితే ఈసారి ముద్రగడను బేషరతుగా చేర్చుకుంటోంది ఫ్యాన్ పార్టీ. ఆ టిక్కెట్టు… ఈ టిక్కెట్టు అని డిమాండ్ చేసే పరిస్థితి కూడా ముద్రగడకు లేకుండా పోయింది. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే… అప్పుడు ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి తన కొడుకుని దించాలనుకున్న ముద్రగడ ఆశలు మాత్రం నెరవేరట్లేదు. ఇప్పుడు ఏ హామీలు కూడా లేకుండానే వైసీపీలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముద్రగడ పద్మనాభం చివరకు అలా ఫిక్సయ్యారు.