ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం జరగబోతోంది. త్వరలో జనసేనలో చేరబోతున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ముద్రగడను కలసి పార్టీలోకి ఆహ్వానించనున్నారు పవన్ కల్యాణ్. ఈనెల 14 లేదా 15లో జనసేనలో ఆయన జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ ఎంపీగా పోటీచేయమని జనసేన కోరునున్నట్టు తెలిసింది. కూటమి పొత్తులో భాగంగా గుంటూరు, కాకినాడ ఎంపీ సీట్లు గ్లాసు పార్టీకే కేటాయించబోతున్నారు. ఇవాళ కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంతో… టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ భేటీ అవుతున్నారు. టీడీపీ-జనసేన కూటమితో కలసి పనిచేయాలని ఆయన కోరతారు. మరోవైపు – ముద్రగడను జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కలిశారు. గతవారం పవన్ కళ్యాణ్ రాసిన లేఖలు ఆయన దగ్గర ప్రస్తావించారు. కాపులంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పద్మనాభం కూడా అభిప్రాయపడ్డారు. పవన్ కలసి వస్తే… కచ్చితంగా ఆహ్వానిస్తానని ముద్రగడ అన్నారు.
అలాగే టీడీపీ కాపు నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడతో ఇవాళ భేటీ అవుతుండటం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది. తమ కూటమితో కలిసి పని చేయాలని ఆయన కోరనున్నారు.. ఇప్పటివరకూ ముద్రగడ వైసీపీలో చేరతారని డిస్కషన్ జరిగాయి.. అయితే వైసీపీ అధిష్టానం నుంచి అనుకూల వాతావరణం లేదని ముద్రగడ అభిప్రాయపడుతున్నారు. సీట్లు ప్రకటించినప్పుడు కూడా కనీసం పరిగణనలోకి తీసుకోలేదని అనుచరులతో చెబుతున్నారు. ఈలోగా కాపులంతా కలిసి పోరాడాలని పవన్ లేఖ రాయడం, తర్వాత పార్టీ నేతలు వచ్చి కలవడంతో… ముద్రగడ జనసేనలో చేరడం దాదాపు ఖాయమనే టాక్ నడుస్తోంది. మొదటి నుంచి టీడీపీ అంటే అగ్గి మీద గుగ్గిలం అయ్యే పద్మనాభం ఆ కూటమిలో కలుస్తారా… అనే చర్చ కూడా జరుగుతోంది. అందుకే ముందుగానే టీడీపీ నేత జ్యోతుల నెహ్రు వెళ్లి… కలిసి పని చేద్దామని ముద్రగడను ఆహ్వానిస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.