ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన నుంచి ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా సస్పెన్స్ గా ఉంది. బీజేపీతో పొత్తు సంగతి తేలాక… 10 రోజుల్లో జనసేన అభ్యర్థులను పవన్ ప్రకటిస్తారని అంటున్నారు నాగబాబు. మొన్నటిదాకా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనను…జనసేన పార్టీ వ్యవహారాలు మాత్రమే చూస్తానని చెప్పిన నాగబాబు… ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఆ నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో రివ్యూలు నిర్వహిస్తుండటంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది.
నటుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ సేవకే పరిమితం అవుతానని గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని నాగబాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన బావమరిది, నిర్మాత అల్లు అరవింద్… అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి సబ్బం హరి చేతిలో 52 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అరవింద్ మూడో స్థానంలో నిలిచారు. 2019లో అనకాపల్లి నుంచి జనసేన తరపున చింతల పార్థసారధి పోటీ చేసి 82 వేల ఓట్లు మాత్రమే సాధించారు. ఇప్పుడు టీడీపీ తరపున అనకాపల్లి ఎంపీ టికెట్ ను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కొడుకు చింతకాయల విజయ్‌తోపాటు గుంటూరుకు చెందిన వ్యాపారవేత్త బైరా దిలీప్ చక్రవర్తి ఆశిస్తున్నారు. తమకు టీడీపీ హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయంటూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీళ్ళు పర్యటన చేస్తున్నారు. జనసేనలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా ఇదే సీటుపై కన్నేశారు. వీళ్ళందరికీ చెక్ పెట్టడానికి.. అనకాపల్లి నుంచి నాగబాబు పోటీకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఏంపీగా నిలబడితే ఎలా ఉంటుందనే దానిపై గ్రౌండ్ లెవల్లో పర్యటిస్తూ పరిస్థితిని తెలుసుకుంటున్నారు నాగబాబు.
టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన మూడు ఎంపీ టిక్కెట్లు కోరుతోంది. అందులో ఒకటి కాకినాడ, రెండోది మచిలీపట్నం… మూడోదిగా అనకాపల్లిని పవన్ కల్యాణ్ అడిగినట్టు సమాచారం. నాగబాబుని దింపడానికే ఈ సీటు కోరినట్టు తెలుస్తోంది. ఆయన అనకాపల్లిలో నిలబడితే జనసేనతో పాటు టీడీపీ కేడర్ కూడా సపోర్ట్ చేస్తుందని నమ్ముతున్నారు. ఇక్కడ కూడా కాపుల ఓట్లు కూడా బలంగా ఉన్నాయి. సాధారణంగా అనకాపల్లిలో లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారన్న టాక్ ఉంది. అందుకే గతంలో అల్లు అరవింద్ ను కాదని సబ్బం హరిని జనం గెలిపించారు. స్థానికంగా స్థిరపడిన వారికే ప్రియారిటీ ఇస్తారు. నాన్ లోకల్స్ అయితే తమకు అందుబాటులో ఉండరన్నది అనకాపల్లి జనం ఒపీనియన్. అయితే తెలంగాణ నుంచి మంగళగిరికి ఈమధ్యే తన ఓటును మార్చుకున్నారు నాగబాబు. ఇప్పుడు అనకాపల్లికి మకాం మారుస్తారా అన్నది చూడాలి. తాను ఇక్కడే ఉంటానని జనాన్ని నమ్మిస్తే… కుల, రాజకీయ, సామాజిక సమీకరణాలు కూడా కలసి రావడంతో నాగబాబు గెలవడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.