ఇంట్లో మనకన్నా పెద్దోళ్లు ఉంటే.. ఉంటే అది మనకు చాలా అడ్వాంటేజ్. ఏ సమస్య వచ్చినా వాళ్లు కచ్చితంగా మనకు అండగా నిలబడతారు. సలహా ఇస్తారు. కానీ పవన్ కల్యాణ్‌కి మాత్రం… నాగబాబు పెద్ద గుదిబండగా తయారయ్యాడు. బాబు ఫ్రస్టేషన్, ఓవరాక్షన్.. చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు నిత్యం ఏదో ఒక సంక్షోభం సృష్టిస్తూనే ఉంది. వయసుకు తగ్గట్లు మెచ్యూరిటీ రాకపోవడంతో.. నాగబాబు చేసే పనులు పవన్ కల్యాణ్, చిరంజీవికి ఇంట్లోనూ వీధిలోనూ తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయ్.
అల్లు అర్జున్, నాగబాబు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్… మెగా కుటుంబానికి, జనసేన పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చింది. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య క్లోజ్ రిలేషన్స్ పెద్దగా ఏమీ లేవు. అలాగే అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీకి కాస్త దూరంగా ఉంటూ… ఆ నీడ నుంచి బయట పడే ప్రయత్నం చేస్తున్నాడు. సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నాడు. కళ్యాణ్‌తో అయితే అంటీ ముట్టనట్టుగానే ఉంటాడు. ఎన్నికల సందర్భంగా తన మిత్రుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా… నంద్యాలలో ప్రచారం చేశాడు బన్నీ. చిరంజీవి కుటుంబం మొత్తం పవన్ కోసం పిఠాపురం వెళ్లి ప్రచారం చేస్తే… అల్లు అర్జున్ మాత్రం జనసేనకు ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల వెళ్లి ప్రచారం చేశాడు. పైగా తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని.. ఇన్‌డైరెక్ట్‌గా జనసేనతో కూడా ఏ సంబంధం లేదని చెప్పకనే చెప్పేశాడు.
దీనిపై నాగబాబు వదిలిన పగవాడు మనవాడు ట్వీట్… పెద్ద రచ్చకే దారి తీసింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో నాగబాబుని నానా యాగి చేశారు. ఈ దెబ్బకు నాగబాబు ట్విట్టర్ నుంచి తప్పుకున్నాడు కూడా! ఈ సందర్భంగా నాగబాబుకి చిరంజీవి చివాట్లు వేసినట్లు… అన్నదమ్ములు ఇద్దరు మాట మాట అనుకున్నట్లు ఓ వదంతి కూడా నడుస్తోంది. నాగబాబు వ్యవహారం.. చివరకు రెండు కుటుంబాల మధ్య పెద్ద విభేదాలకు దారి తీసేట్లు కనిపిస్తోంది. నిజానికి నాగబాబుతో ఇలాంటి తలనొప్పులు.. పవన్ కళ్యాణ్, చిరంజీవికి కొత్తేం కాదు. 2019 ఎన్నికల సమయంలో.. జనసేన ఒంటరిగా పోటీ చేస్తుంటే… నాగబాబు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. టీడీపీకి వ్యతిరేకంగా ట్వీట్లు పెడుతూ… సైకిల్ షెడ్‌కి వచ్చేసిందని చెప్తూ… సైకిల్‌కి అన్ని పార్ట్‌లు ఊడిపోయాయని సెటైర్లు వేస్తూ… తన అతి తెలివిని బయట పెట్టుకుంటూ ఉండేవాడు. పవన్ చాలా సమయమనంతో ఉంటాడు.
ఇక చిరంజీవి గురించి అయితే చెప్పనక్కర్లేదు… ఎలాంటి వారితో అయినా మర్యాద ఇచ్చి మాట్లాడతాడు. నాగబాబు మాత్రం తన స్థాయికి మించి, పరిధి దాటి… ఓవరాక్షన్ చేస్తుంటాడు. 2019లో తనకు గెలిచే శక్తి లేకపోయినా… నర్సాపురం ఎంపీగా టికెట్ ఇస్తావా చస్తావా అని పవన్‌ని బెదిరించి మరీ పోటీ చేసి.. దారుణంగా ఓడిపోయాడు. కుటుంబ సభ్యుల్ని పార్టీకి దూరంగా ఉంచుతానని చెప్పుకునే పవన్… నాగబాబు ఒత్తిడితో తప్పనిసరిగా పార్టీలో పొజిషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఈసారి కూడా అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తానని కూర్చున్నాడు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అక్కడికి వెళ్లి హడావుడి మొదలుపెట్టాడు. అనకాపల్లి చుట్టుపక్కల ఒకటి అరా.. స్కాములు కూడా చేశాడని జనం మాట్లాడుకున్నారు. మొత్తానికి కూటమి పొత్తుల్లో నాగబాబుకు అనకాపల్లి సీటు దక్కలేదు. 2019లో చంద్రబాబుని, టీడీపీని నానా తిట్లు తిట్టిన నాగబాబు… 2024కి వచ్చేటప్పటికి వైసీపీని, జగన్‌ని తిట్టడం మొదలెట్టాడు. అభిప్రాయాలు ఆయన మార్చుకున్నంతగా ఈజీగా.. జనం మార్చుకోవాలి కదా ! నాగబాబు కంఠశోష మామూలుగా ఉండదు. చిరంజీవి చాలా అమాయకుడని, పవన్ ఇంకా అమాయకుడని… అందరూ వాళ్లిద్దరినీ మోసం చేస్తున్నారని.. నిత్యం తన ఇంటర్వ్యూలో, ట్వీట్‌లలో వాపోతూ ఉంటాడు. తన కుటుంబం జనాల కోసం చాలా త్యాగాలు చేసినట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు.
ఇక జనంలోకి వస్తే.. నాగబాబు చేసే ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినా.. పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినా.. అది అధికారం కోసమే ! ఆ విషయం నాగబాబు మర్చిపోయి చాలా ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాడు. తమ కుటుంబం అంతా.. జనం కోసం చాలా త్యాగాలు చేసేసినట్టుగా చెప్పుకుంటాడు. అప్పుడప్పుడు కార్యకర్తల మీద, మెగా ఫాన్స్ మీద విరుచుకుపడుతూ ఉంటాడు. నాగబాబు పుణ్యమా అని.. మెగా ఫ్యామిలీ వారానికో కొత్త వివాదం ఎదుర్కొంటోంది. ఇప్పుడు కొత్తగా సొంత ఇంట్లోనే అగ్గి రాజేశాడు నాగబాబు. అన్నని, తమ్ముడిని చూసయినా.. ఓపిక, సహనం మనిషికి ఎంత అవసరమో నాగబాబు నేర్చుకోలేదు. దాని పుణ్యమే మెగా కుటుంబానికి నిత్యం ఏదో ఒక వివాదం.