ఏపీలో అధికార వైసీపీ (YCP) మరి కాసేపట్లో తమ ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతోంది. రెండు రోజులుగా మేనిఫెస్టో ముసాయిదాపై కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్ (CM Jagan). గత ఎన్నికల్లో నవరత్నాల (Navaratna) పేరుతో జనంలోకి వెళ్ళిన వైసీపీ (ycp)…ఈసారి అంతకుమించి ఉంటాయని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కూటమి పార్టీలను ఎదుర్కోవాలంటే నవరత్నాలను అప్ గ్రేడ్ చేయాలని డిసైడ్ అయ్యారట. వీటితో పాటు కొన్ని కొత్త పథకాలపైనా సీఎం జగన్ హామీ ఇస్తారని చెబుతున్నారు.
ఎన్నిల ప్రచారంలో బిజీగా ఉన్న అభ్యర్థులు, వైసీపీ కేడర్ ఇప్పుడు తమ పార్టీ మేనిఫెస్టో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేనిఫెస్టోలో ఏమేమి ఉండబోతున్నాయోనని అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా ఆసక్తిగా గమనిస్తోంది. జగన్ మళ్లీ ఎలాంటి పథకాలు ప్రవేశపెడతారు… ఎలాంటి సంచలన నిర్ణయాలు ప్రకటిస్తారో అని జనంలో, పార్టీల్లో చర్చ నడుస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే… రైతు రుణమాఫీ చేస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వృద్ధాప్య పెన్షన్ 4 వేల రూపాయలకు పెంచుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇంట్లో వృద్ధులు ఇద్దరికీ పెన్షన్ ఇచ్చేలా ప్రకటన ఉంటుందని ప్రచారం జరుగుతోంది. పారిశ్రామీకరణ, ఉద్యోగాలపైనా మేనిఫెస్టోలో హామీ ఇస్తారని తెలుస్తోంది. మహిళలు, రైతులు, యువకులు, కార్మికం సంక్షేమంపై దృష్టి పెడతారని అంటున్నారు. అడ్డగోలు హామీలు కాకుండా… నెరవేర్చగలిగిన హామీలనే తమ మేనిఫెస్టోలో ఉంటాయని కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు. అదనపు ఆకర్షణలు ఏవీ ఉండవనీ… ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథాలను మరింత సమర్థంగా అమలు చేస్తామని అంటున్నారు. అయితే రైతు రుణమాఫీపై సీఎం జగన్ అంతగా ఆసక్తి లేరని వైసీపీ ముఖ్యనేతల టాక్. తాడేపల్లి పార్టీ హెడ్డాఫీసులో సీఎం జగన్ కొన్ని గంటల్లోనే వైసీపీ మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతున్నారు.