AP TDP Problems : వలసలతో టీడీపీలో కొత్త సమస్యలు !

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్నాయి. పక్క పార్టీల నుంచి... వివిధ వేదికల మీద పని చేసిన వారు టీడీపీ (TDP) లో చేరుతున్నారు. ఇలా చేరడం వల్ల పార్టీకి బలమేననే భావన కొంతమేర వస్తున్నా.. కొత్త వారి చేరికతో పార్టీలో ఉన్న వారికి నష్టం కలుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీన్ని బ్యాలెన్స్‌ చేసుకోకుంటే తిప్పలు తప్పవనే సొంత పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారట.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్నాయి. పక్క పార్టీల నుంచి… వివిధ వేదికల మీద పని చేసిన వారు టీడీపీ (TDP) లో చేరుతున్నారు. ఇలా చేరడం వల్ల పార్టీకి బలమేననే భావన కొంతమేర వస్తున్నా.. కొత్త వారి చేరికతో పార్టీలో ఉన్న వారికి నష్టం కలుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీన్ని బ్యాలెన్స్‌ చేసుకోకుంటే తిప్పలు తప్పవనే సొంత పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారట. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పాత వారిని పక్కన పెట్టేసి…కొత్త వారికి కట్టబెడుతోంది టీడీపీ అధిష్టానం. ఇది మరింత ముదరకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే భావన పార్టీ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోందట.

నెల్లూరు జిల్లాలో ఈ తాకిడి ఎక్కువగా కన్పిస్తోంది. ప్రస్తుతం ఈ జిల్లాలో వైసీపీ (YCP) నుంచి భారీగానే వలసలు వచ్చే అవకాశం ఉంది. ఈ జిల్లాలో కీలక పరిణామాలు చోటుచేసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ జిల్లాలో ఇప్పటికే కోటంరెడ్డికి నెల్లూరు రూరల్‌ స్థానం కేటాయించారు. మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి (Anam Rannarayana Reddy) ఆత్మకూరు సీటు కేటాయిస్తుంటే… తనకు ఆ సీటు వద్దని.. వెంకటగిరి కావాలని పట్టుపడుతున్నారట. దీంతో వెంకటగిరి టిక్కెట్‌ ఆశిస్తున్న టీడీపీ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ఇబ్బంది పడుతున్నారట.

తాజాగా ఆనం పేరుతో సర్వేపల్లి సెగ్మెంటులో సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది స్థానికంగా అలజడి రేకెత్తిస్తోంది. ఆ స్థానం నుంచి ఎలాగైనా గెలుపొందాలని పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇంతలోనే సర్వేపల్లి టీడీపీలో చేపట్టిన సర్వే మొదలైంది. వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) టీడీపీలో చేరే సూచనలున్నాయి. వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోందట. ఆయన ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే పాత నేతలెవరికీ ఇబ్బంది రాకున్నా…ఆయన వెంట పార్టీలో చేరే ఇంకొందరికి సీట్లు ఇస్తారేమోననే చర్చ జరుగుతోంది. నెల్లూరు నుంచే మరో కీలక నేత టీడీపీలో చేరతారట. ఆ నేత వస్తే…పాత వారిలో ఒకరిద్దరికి సెగ తప్పదనే భయం టీడీపీ నేతలను వెంటాడుతోంది.

మరోవైపు కృష్ణా జిల్లాలో పాత-కొత్త పంచాయతీ జోరుగా నడుస్తోంది పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ సీటే ఏకంగా డైలమాలో పడిపోయిందట. వసంత కృష్ణ ప్రసాద్‌ టీడీపీలో చేరుతుండడంతో మైలవరం టిక్కెట్‌ దేవినేని ఉమకు ఉంటుందా..? ఊడుతుందా..? అన్నది సస్పెన్స్‌గా మారింది. టీడీపీలో తిరుగులేదనుకున్నా దేవినేని ఉమ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధి టీడీపీలో చేరుతుండడంతో…ఇటు పార్టీ సీనియర్ నేతలైన బోడె ప్రసాద్‌, ముద్రబోయిన వెంకటేశ్వరరావులకు టిక్కెట్లు ఇచ్చే ఛాన్స్‌ లేదట. కేశినేని నాని పార్టీ నుంచి బయటకు వెళ్లడానికి కారణమైన తిరువూరు సిట్టింగ్‌ ఇన్‌చార్జ్‌…శ్యావల దేవదత్‌కూ కొత్త వారి ఎఫెక్ట్‌ తప్పడం లేదట. తిరువూరు స్థానానికి ఇటీవలే పార్టీలో చేరిన అమరావతి ఉద్యమకారుడు కొలికపూడి శ్రీనివాస్‌ టికెట్‌ ఆశిస్తున్నారట. కొలికపూడికే తిరువూరు సీటు దాదాపు కన్ఫామ్‌ అయిందనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో దేవదత్‌ సర్దుకోక తప్పనిసరి పరిస్థితులు ఏర్పాడ్డాయట. గుడివాడలో రావి వెంకటేశ్వరరావుకు నచ్చచెప్పి వెనిగండ్ల రాముకు టిక్కెట్‌ ఖరారు చేసింది అధిష్టానం. చిత్తూరు జిల్లా సత్యవేడు సెగ్మెంట్‌ నుంచి టీడీపీలో చేరబోయే సిట్టింగ్‌ వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం పేరును టీడీపీ అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తోందట.

ఇదే జరిగితే… టిక్కెట్‌ కన్ఫామ్‌ అనే నమ్మకంతో ఉన్న డాక్టర్‌ హెలెన్‌కు ఆశాభంగం తప్పదనే చర్చ నడుస్తోంది. చంద్రబాబుతో పార్టీ ముఖ్య నేతల భేటీలో ఇదే అంశంపై చర్చకు వచ్చింది. పార్టీకి సేవ చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండానే చేరికలు ఉంటాయనే విషయాన్ని టీడీపీ అధినేత క్లారిటీ ఇచ్చారట. వైసీపీలో అసంతృప్తిగా ఉన్నవారు టీడీపీలోకి వచ్చినంత మాత్రాన వారందరికీ టిక్కెట్లు ఉంటాయనే గ్యారెంటీ లేదని స్పష్టం చేశారట. అయితే పార్టీ అవసరాలు, ఆయా నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా చేరిన వారికి బాధ్యతలు అప్పజెప్పాలనే చంద్రబాబు భావిస్తున్నారట. పార్టీ అధిష్టానం వైపు నుంచి ఈ రకమైన క్లారిటీ వస్తున్నా…ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోననే ఆందోళన మాత్రం పార్టీలోని పాత లీడర్లకు.. టీడీపీ కేడర్‌కు ఉందట.