మరో 6 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu). జగన్ ప్రభుత్వంలో విధేయులుగా పనిచేసిన అధికారులను పీకేసే పనిలో ఉన్నారు. అలాగే పాలనలో తన మార్కు చూపించేందుకు కొత్త అధికారులను నియమించుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే జగన్ విధేయ అధికారులకు చంద్రబాబు ఇంట్లోకి ఎంట్రీ దొరకటంలేదు. బాబును కలిసేందుకు వచ్చిన CID చీఫ్ సంజయ్ (CBI Sanjay) కి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఎన్నికల రిజల్ట్స్ రాగానే విదేశాలకు వెళ్ళేందుకు సంజయ్ సెలవు పెట్టారు. ఆ తర్వాత రద్దు చేశారు సీఎస్. స్కిల్ స్కామ్ (Skill Scam) కేసులో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో సంజయ్ కీలకంగా వ్యవహరించారు. హైదరాబాద్, ఢిల్లీల్లో ప్రెస్ మీట్స్ పెట్టి ఓవరాక్షన్ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుకి (PSR Anjaneyu) బాబు అపాయింటెమెంట్ ఇవ్వలేదు. కారులో వచ్చిన psr ను బయట నుంచే పంపేశారు పోలీసులు. అలాగే చంద్రబాబు కలిసేందుకు ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి ప్రయత్నించారు. మర్యాద పూర్వక భేటీ పేరుతో కలిసేందుకు బాబు ఇంటికి వచ్చారు. ఆయనకు అనుమతి నిరాకరించారు సెక్యూరిటీ సిబ్బంది. బాబుకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం పెట్టిన కేసుల్లో సిట్ అధికారిగా ఉన్నారాయన. నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో కీలకంగా వ్యవహరించారు కొల్లి రఘురామిరెడ్డి. అంతేకాదు… NSG నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నిద్రిస్తున్న బస్సు డోర్ పగలగొట్టారు. ఎన్నికల్లో వైసీపీకి విధేయుడుగా ఉన్నాడని రఘురామిరెడ్డిని ఈసీ తప్పించింది. ఆయన్ని అన్ని శాఖల భాధ్యతల నుంచి తొలగించి… డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి కూడా అపాయింట్మెంట్ నిరాకరించారు చంద్రబాబు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్ళాలని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీచేశారు. ఆయన స్థానంలో ఏపీ కొత్త సీఎస్ గా విజయానంద్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐఏఎస్ ఆయన. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా సీనియర్ IPS బాల సబ్రమణ్యంను నియమించే ఛాన్సుంది. మూడేళ్ళుగా ఆయన సెలవులో ఉన్నారు. బాబు ఆఫీసులోకి సీనియర్ ఐఏఎస్ లు సాయి ప్రసాద్, గిరిజా శంకర్, సిద్దార్ధ జైన్ కూడా జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. YSRCPకి బానిసలుగా పని చేసిన IAS, IPSల విషయంలో చంద్రబాబు నాయుడు పూర్తి స్పష్టతతో ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళందర్నీ ప్రాధాన్యత లేని పోస్టులకు పంపి… కొత్త టీమ్ ను తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు.