కూటమి పార్టీల గెలుపులో జనసేనాని (Janasena) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రోల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రధాని నరేంద్రమోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ కూడా పవనిజం పవరేంటో గుర్తించారు. అందుకే పవన్ కు సముచితమైన గౌరవం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు. కూటమి సర్కారు లో పవన్ కళ్యాణ్ ఏ పదవి తీసుకుంటారని దానిపై జనంలో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం (Deputy CM) పదవి తీసుకుంటారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.
10యేళ్ళ నిరీక్షణ తర్వాత పవన్ తాను ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు… జనసేన 21 మంది ఎమ్మెల్యేలు, రెండు ఎంపీలను గెలిపించారు. అందుకే పవన్ కళ్యాణ్ కచ్చితంగా మంత్రి పదవి తీసుకోవాలని కోరుతోంది జనసేనలోని ఒక వర్గం. తమ నాయకుడిని ఉన్నత పదవిలో చూడాలని ఆశపడుతున్నారు జనసైనికులు. అటు కాపులు కూడా… పవన్ ఇంత కష్టపడి… మంత్రి పదవి తీసుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తోంది. అయితే జనసేనలోని మరికొందరు మాత్రం… పవన్ తీసుకుంటే సీఎం పోస్ట్ తీసుకోవాలి… లేదంటే గౌరవంగా ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలి. అంతే తప్ప పవన్ కి మంత్రి మంత్రి పదవి చాలా చిన్నది అని వాదిస్తున్నారు. అయితే పవన్ తనకు మంత్రి పదవి వద్దని, నాదెండ్ల మనోహర్ తో పాటు మరో ఇద్దరికి కేబినెట్ లో అవకాశం కల్పించాలనీ, తాను కేవలం సలహాదారుడిగానే ఉంటానని పవన్ సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం.
అయితే ప్రభుత్వంలో తన పదవిపై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మాత్రం పెదవి విప్పలేదు. బాబు, పవన్ ఇద్దరూ ఎన్డీఏ మీటింగ్ హడావిడిలో ఉన్నారు. ఈనెల 12న చంద్రబాబు ఏపీ సీఎం గా ప్రమాణం చేయబోతున్నారు. ఈ లోగా కేబినెట్ కూర్పుపై బాబు, పవన్ డిస్కస్ చేసే అవకాశముంది. అటు బీజేపీ పెద్దలతోనూ కేబినెట్ పై చర్చిస్తారని టాక్ నడుస్తోంది.