Ongole YCP MP candidate : పూటకో పేరు… ఒంగోలు వైసీపీ ఎంపీ టిక్కెట్ ఎవరికో ?

ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్ది ఎవరు.. ఇప్పుడిదే రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన అంశం.. సిట్టింగ్ ఎంపీ మాగుంటకు సీటు లేదని అధిష్టానం చెప్పేసిందని అంటున్నారు. దాంతో ఎంపీగా అభ్యర్దిగా ఫలానా వాళ్లు ఉంటారంటూ రోజుకో పేరు.. పూటకో ప్రచారం జరుగుతుండటంతో వైసీపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.. ఏ రోజుకారోజు ఇవాళ ఖరారవుతుందని వార్తలు బయటకు రావటం.. తీరా వైసీపీ లిస్ట్ వచ్చేసరికి ఒంగోలు ఎంపీ అభ్యర్ది పేరు లేకపోవటం మరింత గందరగోళం సృష్టిస్తోంది..

  • Written By:
  • Publish Date - February 14, 2024 / 03:24 PM IST

ఏపీలోని  ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ ఎంపీ సీటు వ్యవహారం గత కొన్ని రోజులుగా ఏపీలోనే హాట్ టాపిక్ గా మారింది.. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి అధిష్టానం సీటు లేదని చెప్పినట్టు సంకేతాలు వెలువడ్డాయి. నెల రోజులుగా ఒంగోలు వైసీపీ ఎంపీ సీటు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మాగుంటకు సీటు ఇచ్చేందుకు నిరాకరించడం… జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ అంశాన్ని భుజానికెత్తుకోవటం.. ఓ దశలో ఆయనకే మళ్ళీ సీటు  ఇస్తారన్న ప్రచారం జరిగాయి. అయితే వైసీపీ అధిష్టానం తాజాగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లాతో పాటు కావలి, కందుకూరు నియోజకవర్గాల వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ భాధ్యతలు అప్పగించింది. ఆ పదవిలో వారం రోజుల్లో కుదురుకున్నాక… ఎంపీ సీటు కూడా ఆయనకే ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది..

మాగుంట కూడా ఒంగోలే వైసీపీ అభ్యర్దిపై క్లారిటీ రాగానే మరో పార్టీలోకి వెళ్దామని ఇప్పటికే తమ అనుచర వర్గానికి చెప్పేశారు. రాజకీయ భవితవ్యం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని.. అందరం కలసి నడుద్దామని వారితో చెప్పినట్టుగా సమాచారం.. నాలుగు సార్లు ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచిన మాగుంట గతంలో రెండుసార్లు ఓడారు.. రాబోయే ఎన్నికల్లో తన కొడుకు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని ఆశ పడ్డారు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో రాఘవరెడ్డి అరెస్టు కావటం.. ఈ కేసులో తన కుమారుడితో పాటు ఎంపీ మాగుంట కూడా అప్రూవర్ గా మారడంతో  తలనొప్పిగా మారాయి.

Read Also : Jail to Bandla Ganesh : బండ్ల గణేష్ కు ఏడాది జైలు… చెల్లని చెక్కుల కేసులో శిక్ష

ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అధిష్టానం దాదాపు ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది.. మొదటి నుంచి మాగుంట కోసం పట్టుబడుతున్న బాలినేని మాత్రం ఆయన కాకుంటే జిల్లాలోని కనిగిరి నియోజకవర్గానికి చెందిన రెడ్డి కార్పోరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణరెడ్డికి ఇవ్వాలని కోరారు.. జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఎంపీ సీటు కేటాయిస్తే స్థానికత కలిసి వస్తుందని అధిష్టానానికి తెలిపారు.. మొదటి నుంచి జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గాలు కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం వైసీపీకి కంచుకోటల్లా ఉండటంతో అదే ప్రాంతానికి చెందిన వ్యక్తికి సీటు ఇస్తే… పార్టీ అభ్యర్దులకు మరింత బలం చేకూర్చినట్లు అవుతుందని భావిస్తున్నారు.. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.. ఎంపీ సీటు, రీజనల్ కో ఆర్డినేటర్ భాద్యతలు రెండూ చెవిరెడ్డికే అప్పగించటంపై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు.

రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినేనితో భేటీ అయ్యారు.. బాలినేని నుంచి చెవిరెడ్డికి ఎలాంటి హామీ లభించలేదని సమాచారం.. జిల్లాకు చెందిన వ్యక్తికే ఎంపీ సీటు ఇవ్వాలని బాలినేని అధిష్టానాన్ని గట్టిగా కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.. చింతలచెరువు సత్యనారాయణరెడ్డికి అవకాశం ఇవ్వకపోతే తానే ఎంపీగా పోటీ చేస్తానని బాలినేని అధిష్టానానికి చెప్పవచ్చనీ…. ఇదే విషయాన్ని బాలినేని తన సన్నిహితుల దగ్గర  ప్రస్తావించారని ప్రచారం జరుగుతోంది.. మరోవైపు సీఎం జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డిని ఒంగోలు నుంచి పోటీ చేయించనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కావటంతో వైసీపీ శ్రేణులు మరింత అయోమయంలో పడ్డారు.. హాట్ టాపిక్ గా ఒంగోలు వైసీపీ సీటు వ్యవహారంలో వైసీపీ అధిష్టానం ఏం చేయబోతోంది.. బాలినేనితో ఎలా సర్దుబాటు చేసుకుంటుందో చూడాలి..