ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి భారీ భద్రత కల్పించింది ప్రభుత్వం. వై ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును ఏర్పాటు చేసింది. పవన్ కల్యాణ్ గ్రామీణ, పంచాయతీ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతున్నారు. బాధ్యతలు తీసుకోడానికి ముందే గన్నవరం చేరుకున్న పవన్ కు వైప్లస్ సెక్యూరిటీ కల్పించారు.
వై ప్లస్ సెక్యూరిటీలో మొత్తం 11 మంది జవాన్లు కాపాలాగా ఉంటారు. వీళ్ళల్లో CRPF లేదా CISF కు చెందిన ఇద్దరు నుంచి నలుగురు కమాండోస్ తో పాటు పోలీసుల సెక్యూరిటీ కూడా ఉంటుంది. X కేటగిరీ భద్రతలో పోలీసులు మాత్రమే ఉంటారు. కమెండోస్ ఉండరు. పవన్ కి వై ప్లస్ కేటగిరీ కావడంతో… 8మంది పోలీసులతో పాటు ఒకరిద్దరు కమెండోస్ రక్షణ కల్పిస్తారు.
ఏపీ సెక్రటేరియట్ లో పవన్ ఆఫీస్ ఛాంబర్ రెడీ అయింది. బుధవారం ఆయన బాధ్యతలు చేపడుతుండటంతో… ఒక్క రోజు ముందు తన ఆఫీస్ ను పరిశీలించారు. రెండో బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ లో 212 గదిని కేటాయించారు. ఏపీ మంత్రిగా పవన్ కల్యాణ్ ఈ ఛాంబర్ లోనే బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఛాంబర్ పరిశీలన తర్వాత సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు.
పవన్ తన శాఖలను ఏరికోరి ఎంచుకున్నారు. అయితే వీటిల్లో ఏ శాఖ ఫైల్ మీద ఆయన మొదటి సంతకం పెడతారన్న దానిపై చర్చనడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో కూటమి ఇచ్చిన హామీల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఐదు ఫైళ్ళపై సంతకం చేశారు. మరి పవన్ కల్యాణ్ ఏ ఫైల్ పై చేస్తారని జనసైనికులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. అది కూడా వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్నుతోనే చేస్తారా అన్న టాక్ కూడా నడుస్తోంది. ఇది డిస్నీ వెర్షన్ పెన్. దీని కాస్ట్ రెండున్నర లక్షల దాకా ఉంటుందని అంటున్నారు. అన్న చిరంజీవి భార్య ముచ్చటపడి కొడుకు లాంటి మరిదికి కొనిపెట్టిన పెన్ను అది. అందుకే దాన్నే తన మొదటి సంతకానికి పవన్ కల్యాణ్ ఉపయోగించాలని కూడా మెగా అభిమానులు కోరుతున్నారు.