Pawan Kalyan : ఏపీ సర్కార్‌లో పవన్ మాటే వేదం.. సేనానికి ఎదురుచెప్పని చంద్రబాబు..

ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కల్యాణ్‌ చాలా కీలకం. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసు అన్నట్లు.. సీట్లు త్యాగం చేసి మరీ.. ఒక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా పక్కకు వెళ్లకుండా చూశారు.

 

 

ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కల్యాణ్‌ చాలా కీలకం. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలుసు అన్నట్లు.. సీట్లు త్యాగం చేసి మరీ.. ఒక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా పక్కకు వెళ్లకుండా చూశారు. తక్కువ సీట్లు తీసుకున్నారని.. ఎన్ని అవమానాలు ఎదురైనా.. ఎన్ని విమర్శలు వినిపించినా… ఎక్కడా వెనక్కి తగ్గలేదు.. తప్పటడుగు వేయలేదు పవన్‌. కట్ చేస్తే.. 164 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చింది. పోటీ చేసిన 21 స్థానాల్లో విక్టరీ కొట్టేసి జనసేన.. 100 శాతం స్ట్రైక్‌ రేట్ సాధించింది. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు అందుకున్నారు. తన మార్క్ పాలనతో జనాలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వంలో పవన్ మాటే వేదంగా మారినట్లు కనిపిస్తోంది. పవన్‌కు చంద్రబాబు ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు. ప్రభుత్వ ప్రతీ కార్యక్రమంలో… ప్రతీ పదవిలో.. పవన్‌కు, జనసేనకు పెద్దపీట వేస్తున్నారు చంద్రబాబు. పవన్‌కు ఇచ్చే ప్రాధాన్యత విషయంలో ఏ చిన్న పొరపాటు కూడా జరగొద్దని.. పార్టీ శ్రేణులకు గట్టిగానే చెప్పారట చంద్రబాబు.

పవన్ విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా ఊరుకునేది లేదు అని లోకేశ్‌కు కూడా గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. గౌరవంలోనే కాకుండా.. ప‌ద‌వుల పంప‌కంలోనూ త‌న పార్టీ ప్రాధాన్యాల‌ను కూడా ప‌క్కనపెట్టి మరీ.. ప‌వ‌న్‌కు, ఆయన పార్టీకి ఎక్కువ‌ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ప‌వ‌న్‌కు ఉపముఖ్యమంత్రి ప‌ద‌వి ఇవ్వడంతోపాటు.. జనసేనకు చెందిన మ‌రో ఇద్దరు కీల‌క నేత‌ల‌కు మంచి శాఖ‌ల‌తో కూడిన మంత్రి ప‌ద‌వులు అప్పగించారు. మంత్రి పదవుల విషయంలో పవన్ ఎవరి పేరు చెప్తే వాళ్లకే కేటాయించారు. అనగాని సత్యప్రసాద్‌ టీడీపీ నేత అయినా.. పవన్ ఖాతాలోనే మంత్రి పదవి వచ్చింది.

ఇది చాలదా.. సేనానికి చంద్రబాబు ఏ రేంజ్‌ ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పడానికి ! ఇక ఈ మధ్య శాస‌న మండ‌లిలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయ్. ఐతే ఈ పదవుల కోసం టీడీపీ త‌ర‌ఫున ఎంతోమంది నాయ‌కులు ఎదురు చూస్తున్నా.. చంద్రబాబు ఒకటి మాత్రమే తీసుకొని మ‌రొక‌టి జ‌న‌సేన‌కు కేటాయించారు. నిజానికి ఈ రెండు స్థానాలు ఈసారికి మనమే తీసుకుందామని.. చాలామంది కీల‌క నాయ‌కులు చంద్రబాబుకు ప్రతిపాదించారు. ఐనా సరే.. జనసేనకు ఇచ్చి తీరాల్సిందేనని.. ఒక్క స్థానానికే పరిమితం అయ్యారు చంద్రబాబు.

దీంతో ఒక ఎమ్మెల్సీ పదవి.. జనసేన పార్టీ పీఆర్వో హరిప్రసాద్ దక్కించుకున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత‌ కీలకమైన అదనపు అడ్వకేట్ జనరల్ పదవిని కూడా జనసేన పార్టీకి కేటాయించారు. అడ్వకేట్‌ జనరల్‌గా ద‌మ్మాలపాటి శ్రీనివాస్‌కు అవకాసం ఇచ్చిన చంద్రబాబు.. ఆయన తర్వాత రెండో కీల‌క స్థాన‌మైన AAG ప‌ద‌విని మాత్రం జ‌న‌సేన‌కు ఇచ్చేశారు. జ‌న‌సేన పార్టీ లీగ‌ల్ వ్యవ‌హారాల స‌ల‌హాదారుగా ఉన్న సాంబశివప్రతాప్‌ను ఏఏజీగా నియ‌మిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా పదవులు మాత్రమే కాదు.. ప్రాధాన్యతల విషయంలోనూ.. జనసేనకు, పవన్‌కు ఏ లోటు జరగకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. ఈ మధ్యే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది.

ఏపీ నుంచి చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, కందుల దుర్గేష్ హాజరయ్యారు. నిజానికి ఈ మీటింగ్‌కు మొదట ఆర్థికమంత్రి పయ్యావులను అనుకున్నా.. చివరలో ఆయనను డ్రాప్‌ చేయించినట్లు తెలుస్తోంది. పవన్ ప్రతినిధులుగా అనగాని, కందుల దుర్గేష్‌ హాజరయ్యారు. ఇక ఐఏఎస్, ఐపీఎస్ నియామకాలు, బదిలీలలోనూ పవన్ చెప్పిన వాళ్లకే ఇచ్చారు. ఈ విషయంలో కొందరికి అభ్యంతరాలు ఉన్నా.. ప్రస్తుతానికి పవన్ మాటకి విలువ ఇస్తున్నారు. చంద్రబాబు తీరుపై కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌కు ఇంతలా పెద్దపీట వేయడం వెనక రకరకాల వ్యూహాలు కనిపిస్తున్నాయ్. నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది అంటే.. అది కచ్చితంగా పవన్ వల్లే ! కాపు సామాజికవర్గం అంతా.. కూటమి వైపే మద్దతుగా నిలిచింది.

దీంతో అఖండ విజయం సాధ్యమైంది. పవన్‌ కల్యాణ్‌ విడిగా పోటీ చేసినా.. విభేదించినా.. టీడీపీ సీన్ ఇంకోలా ఉండేదన్నది ప్రతీ ఒక్కరు అంగీకరించాల్సి విషయం. అందుకే పవన్‌తో కానీ, కాపులతో కానీ.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానికోసం లోకేశ్‌ విషయంలోనూ ఖరాఖండీగానే ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. వైసీపీ ఓటు బ్యాంక్ అలానే ఉంది. కూటమికి జనసేన ఓటు బ్యాంక్‌.. అదీ ముఖ్యంగా కాపు ఓటు బ్యాంక్‌ ఫుల్‌గా యాడ్ అవడంతోనే.. ఈ విజయం సాధ్యమైంది. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే పవన్‌ మాటకు, నిర్ణయానికి కనీసం ఎదురు చెప్పే ప్రయత్నం చేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. పవన్‌కు ఏ చిన్న లోటు జరిగినా.. కాపు సామాజికవర్గం అంతా వ్యతిరేకం అయ్యే చాన్స్ ఉంటుంది. అందుకే చంద్రబాబు ఆచీతూచీ అడుగులు వేస్తున్నారనిపిస్తోంది. పవన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రొజెక్ట్ చేయడం ద్వారా.. జనసేన కార్యకర్తలను, కాపు సామాజికవర్గాన్ని సంతృప్తి పరిచే అవకాశం ఉంటుంది. ఇది రాబోయే రోజుల్లో మరింత ప్లస్ అవుతుందనే వ్యూహంతోనే చంద్రబాబు తీరు కనిపిస్తుందన్నది మరికొందరి మాట. ఏమైనా ఏపీ సర్కార్‌లో పవన్ పెత్తనం చూసి.. జనసైనికులు మాత్రం మస్త్ ఖుషీలో ఉన్నారు.