ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) కీలకంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓటుకి ఇప్పుడు గండం పొంచి ఉంది. విజయవాడ (Vijayawada) జనసేన కార్యాలయం కేరాఫ్ అడ్రస్ గా పేర్కొంటూ పవన్ కళ్యాణ్ తన ఓటు రిజిస్టర్ చేయించుకున్నారు. అయితే దీనిని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ముందు ఛాలెంజ్ చేసింది వైసీపీ. పవన్ కళ్యాణ్ మంగళగిరిలో గానీ.. బెజవాడలో కానీ శాశ్వత నివాసి కాదనీ.. ఆయన వృత్తి కూడా ఈ ప్రాంతంలో లేదని అభ్యంతరం తెలిపింది వైసీపీ. పార్టీ ఆఫీసు ఇల్లు ఎలా అవుతుంది అంటూ తన ఫిర్యాదులో ప్రశ్నించింది. దాంతో పవన్ ఓటును రద్దుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పవన్ కల్యాణ్ నాన్ లోకల్ అంటూ ఎప్పటి నుంచో కామెంట్ చేస్తున్నారు వైసీపీ మంత్రులు. ఆయనకు ఏపీలో ఓటు కూడా లేదని కామెంట్ చేస్తున్నారు. దాంతో విజయవాడలోని జనసేన ఆఫీస్ ను కేరాఫ్ అడ్రెస్ గా పేర్కొంటూ పవన్ కల్యాణ్ తన ఓటును రిజిస్టర్ చేశారు. కానీ ఇప్పుడు దీనిపైనే వైసీపీ ఎన్నికల కమిషన్ కు కంప్లయింట్ చేసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆర్డనరీ రెసిడెన్స్ తోనే ఓటు నమోదుకు వీలు ఉంటుంది. అంటే హైకోర్టు తీర్పు ప్రకారం రోజూ రాత్రి నిద్రపోయే నివాసం.. పవన్ ఇక్కడ నివాసం ఉండటం లేదు.. ఎలా ఓటు హక్కు ఇస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది.
నాగబాబు ఓటు కూడా ఇలాంటి వివాదంతో రద్దయింది. నాగబాబు హైదరాబాదుతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని వడ్డేశ్వరంలో.. రెండు చోట్ల ఓటు రిజిస్టర్ చేయించారంటూ వార్తలు వచ్చాయి. దానికి నాగబాబు వివరణ ఇచ్చారు. తాను గానీ.. తన కుటుంబ సభ్యులు గానీ హైదరాబాదులో ఓటు వేయలేదన్నారు. పైగా నాగేంద్రబాబు పేర్కొన్న వడ్డేశ్వరంలో ఆయన ఉండటం లేదన్న అభ్యంతరం వ్యక్తం కావడంతో.. సంతృప్తి చెందని అధికారులు.. ఆంధ్రాలో నాగబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆరుగురు ఓట్ల అప్లికేషన్లు తిరస్కరించారు. ఇప్పుడు నాగబాబు హైదరాబాదులో తన ఓటును పూర్తిగా రద్దు చేసుకొని.. ఆంధ్రాలో ఒక నివాసం చిరునామాతో మళ్లీ ఓటు రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నారు.
పార్టీ ఆఫీస్.. నివాసం ఉండని చిరునామాతో పవన్ కళ్యాణ్ ఓటు నమోదు చేయించుకోవడం వివాదస్పదం అయింది. వైసీపీ అభ్యంతరాలను ఈసీ లెక్కలోకి తీసుకొని.. ఆయన ఓటును కూడా రద్దు చేస్తే.. అప్పుడు పవన్ కల్యాణ్ ఏదైనా ఇంటిని ఏపీలో అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇంటి అడ్రస్ తో కొత్తగా ఓటును మళ్ళీ రిజిస్టర్ చేయించుకోవాల్సి వస్తుంది.