జనసేనతో టీడీపీతో పొత్తును పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ కే పరిమితం చేయాలని అనుకుంటున్నారా ? తెలంగాణలో కొండగట్టు పర్యటనకు వచ్చిన సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే అదే అర్థమవుతోంది. తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసే వెళతాయని చెప్పారు. తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీతో కలిస్తే… మొదటికే మోసం వస్తుందని పవన్ గ్రహించారా అన్న చర్చనడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కలసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. ఇటు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూడా కలసి పోటీ చేశాయి.
ఆ ఎన్నికల్లో జనసేనకు డిపాజిట్లు రాలేదు. దాంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగి 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది. బీజేపీతో బంధం తెలంగాణలో ఇంకా కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ మళ్ళీ తేల్చి చెప్పేశారు. జనసేన ఎఫెక్ట్ తెలంగాణలో ఉంటుందని కొండగట్టుకు వెళ్ళేముందు చెప్పారు. నెక్ట్స్ ఇక్కడ GHMCతో పాటు…స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2020లో జరిగిన ఎన్నికల్లోనే జనసేన పోటీ చేయాల్సి ఉంది. పోటీలో ఉంటామని మొదట పవన్ కల్యాణ్ ప్రకటన కూడా చేశారు. కానీ బీజేపీతో పొత్తు ఉండటం వల్ల బరి నుంచి తప్పుకున్నారు. అయితే జనసేనకు హైదరాబాద్ లో మంచి క్రేజ్ ఉంది. తెలంగాణ యూత్ తో పాటు… ఆంధ్ర ఓటర్లు కూడా ఉండటంతో ఆ పార్టీ కార్పొరేటర్లను గెలుచుకునే ఛాన్సుంది. బీఆర్ఎస్ ఇప్పట్లో పుంజుకునే ఛాన్స్ లేకపోవడం… ఇప్పటికే సిటీలో బీజేపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉండటంతో… బీజేపీ, జనసేన కలిస్తే… కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇవ్వొచ్చు. అందుకే పవన్ ముందే సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో టీడీపీ సంగతి ఏంటి ? టీడీపీతో బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తాయా అంటే… ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన పార్టీగా టీడీపీకి ముద్ర ఉంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే… బీజేపీ ఉనికికే ప్రమాదం అంటున్నారు. అందుకే జనసేనతో తప్ప టీడీపీ తెలంగాణలో పొత్తు ఉండే ఛాన్స్ లేదంటున్నారు బీజేపీ లీడర్లు.