జనసేన (Janasena) అధినేత పవన్ (Pawan Kalyan).. పిఠాపురం (Pithapuram)లో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. ఉగాది పండుగను వేదపండితుల మధ్య జరుపుకున్నారు. పంచాగ శ్రవణం సహా అన్ని పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్.. అక్కడే ఇల్లు తీసుకున్నారు. పవన్ గెలిస్తే అందుబాటులో ఉండరు అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఇక పిఠాపురం నుంచి ప్రచారం మొదలుపెట్టిన మొదటిరోజే.. స్థానికంగా ఓ ఇల్లు తీసుకుని ఇక్కడే ఉంటానని పవన్ ప్రకటించారు.
ఇందులో భాగంగానే చేబ్రోలులో కొత్తగా నిర్మించిన ఓ ఇంటిని చశూశారు. కొత్త ఇంటిని తన అవసరాలకు అనుగుణంగా మార్చుకున్న పవన్.. పక్కనే పంటపొలాల్లో హెలీప్యాడ్ నిర్మాణం కూడా జరిపించారు. ప్రస్తుతం గృహప్రవేశం చేసిన ఇల్లు.. పవన్ అద్దెకు తీసుకున్నదే ! గొల్లప్రోలు మండలం చేబ్రోలులో.. పవన్ ఇల్లు ఉంది. ఓదూరి నాగేశ్వరరావు అనే రైతు.. పవన్ కోసం మూడు అంతస్తుల బిల్డింగ్ నిర్మించి ఇచ్చాడు. నాగేశ్వరరావు.. బేసిక్‌గా పవన్‌కు వీర ఫ్యాన్. దీంతో ఆ ఇంటికి ఎలాంటి అద్దె తీసుకోవడం లేదు. డాక్యుమెంటేషన్ కోసం కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారని తెలుస్తోంది.
పిఠాపురంలో సొంత ఇల్లు నిర్మించుకునేంత వరకు.. పవన్ అక్కడే ఉండబోతున్నారు. పార్టీ కార్యక్రమాలకు అనుగుణంగా ఉండేలా.. కార్యకర్తలు ఎంతమంది వచ్చినా.. భోజనాల నుంచి ప్రతీ వసతి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఆ ఇంటిని నిర్మించారు. ఐతే అభిమాన నాయకుడు, హీరో కోసం.. ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాదు.. కేవలం ఒక్క రూపాయి మాత్రమే అద్దె తీసుకున్న రైతు నాగేశ్వరరావు మీద.. అభిమానులు, జనసేన కార్యకర్తలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇక అటు హెలిప్యాడ్‌తో పాటు.. అన్ని రకాల రక్షణ వ్యవస్థలను పవన్ కొత్త ఇంటి చుట్టూ ఏర్పాటు చేశారు.