ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఈ వారంలోనే వైఎస్ షర్మిలకు (YS Sharmila) అప్పగించబోతోంది AICC. రాహుల్ న్యాయ్ యాత్రలో పాల్గొనడానికి మణిపూర్ కి వెళ్ళిన షర్మిలతో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి K.C. వేణుగోపాల్ (KC Venugopal) మాట్లాడినట్టు సమాచారం. ఏపీ అసెంబ్లీలో (AP Assembly Elections) 10యేళ్ళుగా కాంగ్రెస్ కి ఉనికి లేకుండా పోయింది. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 15 శాతం ఓట్లయినా తెచ్చుకోవాలని AICC భావిస్తోంది. అందులో భాగంగానే షర్మిలకు బాధ్యతలు అప్పగించబోతోంది.
మణిపూర్ లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో (Rahul Nyaya Yatra) పాల్గొన్న వైఎస్ షర్మిలకు AICC గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా ఆమెకు AP PCC బాధ్యతలు అప్పగించబోతోంది. ఈ విషయంపై ఖర్గే, వేణుగోపాల్ కలసి షర్మిలతో చర్చించినట్టు సమాచారం. ఈనెల 17న కాంగ్రెస్ సీనియర్ నేత మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలో అమరావతిలో ఏపీ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ జరగబోతోంది. ఈలోగానే షర్మిలకు బాధ్యతలు అప్పగిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఏపీలో 15 నుంచి 20శాతం ఓట్లు తెచ్చుకోవాలని AICC టార్గెట్ గా పెట్టుకుంది. అధికారంలోకి రాకపోయినా…ఆ రాష్ట్రంలో కింగ్ మేకర్ కావాలన్నది లక్ష్యం.
షర్మిల చేరికతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుందని భావిస్తున్నారు. దివంగత సీఎం వైఎస్సార్ ను చూపించి.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు షర్మిల కూడా అదే పద్దతి ఫాలో అవుతారు. వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పులు, చేర్పులతో కొందరు సిట్టింగ్స్ అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళల్లో కొందరు జనసేన, టీడీపీలోకి వెళ్తున్నారు. ఇంకొందరు కాంగ్రెస్ లో చేరతారనీ.. దాంతో ఆయా నియోజకవర్గాల్లో ఎంతో కొంత కాంగ్రెస్ ప్రభావం చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే.. షర్మిలతోనే నడుస్తానని చెప్పారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తుందా.. చేస్తే ఏ నియోజకవర్గ ఎంచుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
లోక్ సభ ఎన్నికల లోపు షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీగా పంపుతారని మొదట వార్తలు వచ్చాయి. కానీ ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో పోరాటానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కూడా పాలేరు నుంచే పోటీ చేయాలని అనుకున్నారు. ఇప్పుడు సేఫ్ సీట్ ఖమ్మం ఎంపీగా నిలబడే ఛాన్సుందని కొందరు పరిశీలకులు చెబుతున్నా.. అందుకు TS కాంగ్రెస్ లీడర్లు ఒప్పుకునే అవకాశం లేదు. అందువల్ల ఏపీలో రాజంపేట ఎంపీ లేదా కడప, కమలాపురం, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడో ఒక చోట పోటీ చేయొచ్చని చెబుతున్నారు. వైఎస్సార్ కుమార్తెగా షర్మిలకు ఆ ఏరియాలో మంచి సపోర్ట్ ఉంటుందని అంటున్నారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా వైఎస్ సన్నిహితులు, అభిమానులు ఉన్నారు. అందుకే అక్కడ ఆమె గెలుపు ఈజీ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అంతేకాదు.. షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టాక.. కడప జిల్లాలోని వైఎస్ ఫాలోవర్స్ అయిన వైసీపీ, ఇతర పార్టీల్లో ఉన్న నేతలు చాలామంది కాంగ్రెస్ లో చేరతారని AICC పెద్దలు అనుకుంటున్నారు. మరి కడపలో వైఎస్ జగన్ .. తన చెల్లెలు షర్మిలకు ఎలా పోటీ ఇస్తారన్నది చూడాలి.