ప్రధాని నరేంద్రమోడీ కేబినెట్ లో టీడీపీకి రెండు పదవులు దక్కాయి. ఇందులో కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు… డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి కేంద్రమంత్రిగా అవకాశం దక్కింది. గుంటూరు పార్లమెంట్ సభ్యుడైన పెమ్మసాని… మొదటిసారి టీడీపీ ఎంపీగా గెలిచారు. ఎన్నికల ముందే రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని… ఎవరూ ఊహించని విధంగా కేంద్ర మంత్రి పదవితో జాక్ పాట్ కొట్టారు. ఆయన విదేశాల్లో వ్యాపార రంగంలో స్థిరపడ్డారు.
దేశంలోనే అత్యంత సంపన్నమైన ఎంపీగా గుర్తింపు పొందారు. తన ఆస్తుల విలువ 5 వేల 700 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్ లో డిక్లేర్ చేశారు పెమ్మసాని చంద్రశేఖర్. కేబినెట్ మంత్రులందరిలోకెల్లా పెమ్మసాని రిచ్చెస్ట్ మినిస్టర్ అవనున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆయన… 1993-94 ఎంసెట్ పరీక్షల్లో మెడిసన్ లో 27 వ ర్యాంక్ సాధించారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో మెడిసన్ చదివారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళారు. పెన్సిల్వేనియాలోని గీసింగర్ మెడికల్ సెంటర్ లో ఎండీ చేశారు. యూఎస్ లోని జాన్ యూనివర్సిటీలో ఐదేళ్ళ పాటు టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేశారు. పెమ్మసాని ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నారైలకు ఉచిత వైద్య సేవలకు అందించారు.
వైద్య బీమా లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రవాస భారతీయలకు అండగా నిలిచారు పెమ్మసాని చంద్రశేఖర్. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు టీడీపీ లీడర్. అయితే చంద్రబాబు యూఎస్ వెళ్ళినప్పుడు పరిచయం ఏర్పడింది. అలా రాజకీయాలపై ఇంట్రెస్ట్ పెంచుకొని టీడీపీలో జాయిన్ అయ్యారు. 2014 నుంచీ ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై కొట్టడంతో చంద్రశేఖర్ కు అవకాశం దక్కింది. బిజినెస్ మ్యాన్ కావడంతో… ఏపీకి పరిశ్రమలు తీసుకురావడంలో ఉపయోగపడతారని పెమ్మసానికి అవకాశం కల్పించారు చంద్రబాబునాయుడు.