మాజీ మంత్రి పేర్ని నానీ సిఎం చంద్రబాబు లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైఎస్ మృతి చెందిన తర్వాత జగన్ కాంగ్రెస్ విధానానికి ఎదురు తిరిగారని… కాంగ్రెస్ విధానాల నుంచి స్వేచ్చగా బ్రతకాలని జగన్ కాంగ్రెస్ సంకెళ్లు తెంచుకున్నారని కాని… సిఎం చంద్రబాబు మాత్రం చీకట్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తారు అని మండిపడ్డారు. జగన్ వ్యక్తిత్వ హననం చేయని రోజూ లేదని… ప్రతీ రోజు చంద్రబాబు చేస్తూనే ఉన్నారన్నారు. పనామా లీక్స్, పారడైస్ పెపర్స్ అంటూ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా జగన్ ను ప్రజలు సీఎం చేశారని పేర్కొన్నారు పేర్ని.
జగన్ కు 40శాతం ఓటింగ్ రావటంతో దాన్ని ఎలాగైనా చంపాలని విషం చిమ్ముతున్నారన్నారు. చంద్రబాబు అండ్ బ్యాచ్ రాక్షసులు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ ప్రభుత్వం విద్యుత్ విషయంలో SEKI తో ఒప్పందం చేసుకున్నామన్న ఆయన… అదానీ తో మేం ఒప్పందాలు చేసుకోలేదు అని స్పష్టం చేసారు. అమెరికా పోలీసులు అరెస్టు చేస్తే కేంద్రంలో అప్పట్లో ఉన్న మంత్రిని, సెకి చైర్మన్ ను తీసుకు వెళ్తారు తప్ప జగన్ కు ఏం సంబంధం ? అని నిలదీశారు. చంద్రబాబు ఎప్పుడో ఇంటర్నేషనల్ లెవెల్ అవినీతి చేశారన్నారు.
సింగపూర్ హోటల్స్ వ్యవహారం గుర్తు తెలియదా అని నిలదీశారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అరెస్టు కూడా అయ్యారని గుర్తులేదా అని ప్రశ్నించారు. అదానీ జగన్ సమయంలో పెట్టుబడి పెడితే విష ప్రచారం చేసారని మండిపడుతున్నారు. చంద్రబాబు సమయంలో అదానీ పెట్టుబడి పెడితే మాత్రం మంచిది అన్నట్టు ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్రం పంపిన ప్రతిపాదనలకు విద్యుత్ చార్జీలపై వైసీపీ ప్రభుత్వం అంగీకరిస్తే కూడా విమర్శలు చేస్తున్నారని విద్యుత్ చార్జీలు తగ్గిస్తా అని ఓట్లు అడిగి 17 వేల కోట్లు విద్యుత్ చార్జీలు పెంచారని మండిపడ్డారు. 4సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు వల్ల రాష్ట్రానికి అప్పులు మిగిలాయని పేర్ని ఆరోపించారు.