ఏపీ ఎన్నికల సందర్భంగా మాచర్లలో ఈవీఎం ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ భవితవ్యానికి ఫుల్ స్టాప్ పడినట్టే. ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా చెప్పేశారు. వీడియో ఫుటేజ్ తో క్లియర్ గా పట్టుబడ్డ పిన్నెల్లిపై మూడు చట్టాల ప్రకారం 10 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ సెక్షన్ల కింద అభియోగాలు రుజువైతే పిన్నెల్లికి ఏడేళ్ళ జైలు శిక్ష తప్పదు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెతికి పట్టుకునేందుకు పల్నాడు పోలీసులు తెలంగాణతో పాటు తమిళనాడులో కూడా వెతుకుతున్నారు. ఆయన్ని అరెస్ట్ చేశాక… కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తారు. పిన్నెల్లిపై అభియోగాలు రుజువైతే జైలు శిక్ష పడుతుంది. ఇలాంటి కేసుల్లో రెండు నుంచి ఏడేళ్ళదాకా శిక్షలు పడే అవకాశముంది. అయితే శిక్ష రెండేళ్ళకు మించితే మాత్రం… పిన్నెల్లిపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుంది. అంటే ఆయన మాచర్ల ఎమ్మెల్యేగా ఎన్నికైనా అనర్హత మాత్రం తప్పదు. అలా జరిగితే మాచర్ల నియోజకవర్గంలో ఉపఎన్నిక నిర్వహించే అవకాశాలున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే ఛాన్స్ కూడా ఎన్నికల కమిషన్ కు ఉంది. టీడీపీ నేతలు ఇప్పటికే ఈసీతో పాటు, డీజీపీకి కూడా ఇదే విషయంపై ఫిర్యాదు చేశాయి. పిన్నెల్లి అరాచకం వీడియో ఫుటేజ్ సహా బయపడటంతో… ఈ వ్యవహారంలో వైసీపీ అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తోంది.