ఇజ్జత్‌ కా సవాల్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక..

  • Written By:
  • Updated On - August 10, 2024 / 02:25 PM IST

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయం తిరుగుతోంది. అసెంబ్లవీ ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలిపోరు కావడంతో… అధికార, విపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అభ్యర్ధి ఎంపిక దగ్గర నుంచి ఓటింగ్ వరకు చిన్నపాటి పొరపాటు కూడా జరగొద్దని పకడ్భందీగా వ్యవహరిస్తున్నాయ్. ఆగస్ట్‌ 30న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 13 వరకు నామినేషన్లు దాఖలకు గడువు వుంది. సెప్టెంబర్ 3తేదీన ఫలితాలు విడుదల అవుతాయి. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. షెడ్యూల్ విడదలయ్యే వరకు సో…సో…గానే వున్న పరిణామాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కారణం… వైసీపీ విసిరిన ఫస్ట్ పంచ్. అభ్యర్ధి ఎవరు అనే మీమాంశలో పార్టీ శ్రేణులు ఉండే… హైకమాండ్ ఊహించని నిర్ణయం తీసుకుంది. పార్టీ నేతల అభిప్రాయాల మేరకు మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసింది. దీంతో స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ ఆసక్తికరంగా మారింది. అటు, కూటమి ధీటైన అభ్యర్ధిని సిద్ధం చేయడంతో ఎన్నికల వేడి రోజురోజుకీ రాజుకుంటోంది. ఎమ్మెల్సీ సీటు ఖాళీ అవ్వడం వెనుక కీలకమైన రాజకీయ పరిణామం జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్ధానాలకు 2021డిసెంబరులో ఎన్నికలు జరిగాయి. వైసీపీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్, వరుదు కల్యాణి ఎన్నికయ్యారు. ఐతే సార్వత్రిక ఎన్నికల్లో వంశీకృష్ణ టికెట్ ఆశించగా.. చాన్స్‌ దక్కలేదు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి… జనసేనలో చేరారు. పార్టీ ఫిరాయింపుల కింద వంశీకృష్ణ శ్రీనివాస్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మండలి చైర్మన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో వంశీని అనర్హుడిగా ప్రకటించారు. ఆ స్థానం కోసం ఇప్పుడు ఎన్నికలు జరగుతుండగా…. అధికార, విపక్షాల్లో ఎవరు గెలిచినా 2027డిసెంబర్ వరకు పదవీకాలం ఉంటుంది. మూడేళ్ కాలపరిమితి కలిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా పోటీ పెరిగిపోయింది. ఒకవైపు, బొత్స అభ్యర్ధిత్వం
ఖరారు కావడతో… ఆయన విస్త్రతమైన ప్రచారం చేస్తున్నారు. కూటమి మాత్రం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటోంది. ఏకాభిప్రాయం సాధించడం ద్వారా బలమైన అభ్యర్ధిని బరిలోకి దించాలని చూస్తోంది. ఈ కసరత్తు వెనుక రెండు ముఖ్య కారణాలు వున్నాయి. ఒకటి వైసీపీ అభ్యర్ధి బొత్స కావడం…. రెండు ఓట్ల సంఖ్య ప్రతిపక్షంతో పోలిస్తే దాదాపు నాలుగోవంతు మాత్రమే వుండటం. దీంతో ఎన్నికల్లో బలాబలాలు చర్చనీయాంశంగానే మారాయి.

విశాఖ స్ధానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ ఓటర్లు 838మంది. వీరిలో MPTCలు 636., జెడ్పీటీసీలు36., జీవీఎంసీ కార్పోరేటర్లు97. నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్ల సంఖ్య 53, ఎక్స్అఫీషియో సభ్యులు 16. ఈ మేరకు ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది ఎన్నికల సంఘం. మరో మూడు ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో విజయం ఇరుపార్టీలకు ఇజ్జత్‌ కా సవాల్‌గా మారింది. బొత్సను ఢీకొట్టేందుకు బలమైన అభ్యర్థిని ఎంచుకోవడం.. ఇప్పుడు టీడీపీ ముందున్న అసలు ఛాలెంజ్‌. ఆ దిశగా విస్తృతమైన కసరత్తు జరిగింది. చర్చోపచర్చల తర్వాత మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యన్నారాయణ పేరు దాదాపు ఖరారైందని పార్టీ వర్గాలు చెప్తున్నాయ్. పీలాను పోటీ పెట్టడం వెనక రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. ఆర్ధికంగా బలవంతుడు కావడం. రెండు బీసీ ఫ్యాక్టర్. బొత్స సత్యన్నారయణ పోటీ చేయడం ద్వారా తూర్పు కాపు సామాజికవర్గం ఓటర్లను ఆకర్షించడం సాధ్యం అవుతుందని వైసీపీ భావించింది. దానికి తగినట్లే కాపు నేతలంతా ప్రచారం చేస్తున్నారు. బొత్సను గెలిపించుకోవడం అనివార్యం అనే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. దీనిని బ్రేక్ చేసేందుకు బీసీ అస్త్రం ప్రయోగించాలని నిర్ణయించింది కూటమి. అందులోనూ గవర సామాజికవర్గానికి చాన్స్ ఇవ్వడం ద్వారా.. టీడీపీలో ఈ దఫా అనకాపల్లి జిల్లాకు ప్రాధాన్యత దక్కలేదనే లోటును పూడ్చాలనేది ప్రయత్నం. ఇంకా కొన్ని పేర్లు పరిశీలనకు వస్తున్నా.. ముఖ్య నాయకత్వం అంతా పీలా అభ్యర్ధిత్వానికి మొగ్గు చూపినట్టు తెలిసింది. దీంతో బొత్సను ఢీకొట్టేందుకు పీలా గోవింద్ పోటీ చేయడం దాదాపు ఖరారైనట్టేనని కూటమి వర్గాలు ప్రచారం చేస్తున్నాయ్. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ బలాబలాలు చుట్టూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎక్స్ అఫీషియోలు మినహాయించగా మిగిలిన స్ధానాలలో మెజార్టీ ఓటర్లు వైసీపీకే వున్నారు. ఆ బలం 80శాతం వరకు ఉంటుందని నోటిఫికేషన్ ముందు వరకు కనిపించింది. వైసీపీకి 625వరకు వుండగా మిగిలిన ఓట్లు కూటమి పార్టీలవి. ఈ లెక్కన సునాయాసంగా గెలవడం వైసీపీకి సాధ్యమే. అయితే తెలుగుదేశం కూటమి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలవడం టీడీపీకి అత్యవసరం.

వైసీపీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని.. త్వరలోమరిన్ని చేరికలు ఉంటాయని అధికార పార్టీ చెప్తోంది. దీంతో వైసీపీ అలర్ట్ అయింది. జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉపఎన్నికను జగన్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అభ్యర్థి ప్రకటన నుంచి ప్రతీ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేశారు. వైసీపీ ఓటర్లు కూటమి వైపు చూడకుండా.. క్యాంప్‌కు తరలించడంలో చాకచక్యంగా వ్యవహరించారు. ఓటర్లలో కొందరిని బెంగుళూరు.. మరికొందరిని హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహాలపై రోజూ నేతలకు జగన్‌ సూచనలు ఇస్తున్నారు. ఇక అటు టీడీపీ కూడా ఇదే రేంజ్‌లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీకి 13మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల బలం ఉంది. వైసీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉన్నారు. రెండు పార్టీలు అసంతృప్త ఓటర్లపైనే ఫోకస్ చేయడంతో… ఎవరి బలం ఎంత అనేది అంచనాకు రావడం కష్టంగానే ఉంది. ఇక బైపోల్ బాధ్యతను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో… మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, గొట్టిపాటి రవికుమార్‌తో పాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. వీరంతా విశాఖలోనే ఉండి ఈ 20రోజులు పనిచేయాలని ఆదేశించారు. జిల్లాకు చెందిన మంత్రి అనిత కూడా ఈ ఎన్నిక బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఇక్కడకు వచ్చే మంత్రులు ప్రాంతాల వారీగా బాధ్యతలు తీసుకొని పనిచేయనున్నట్టు సమాచారం. నియోజకవర్గాల వారీగా మంత్రులు ఇంచార్జిలుగా నియమించి ఎన్నికల వ్యూహాలను రూపొందించగా.. జీవీఎంసీ మొత్తం అచ్చెన్నాయుడు చూసుకుంటారని విశ్వసనీయంగా తెలిసింది. పాడేరు, అరకులోయ నియోజకవర్గాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యుల బాధ్యతను ఎంపీ సీఎం రమేశ్‌కు కేటాయిస్తారని ప్రచారం. అటు, వైసీపీ మాజీమంత్రులు, ముఖ్యనేతలను జిల్లాకు పంపించింది. మండలాలవారీగా ఇంచార్జీలను నియమించి ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలిసింది. ఎమ్మెల్సీ గెలుపుపై కూటమి కాన్ఫిడెంట్‌గా ఉంది. చంద్రబాబు, పవన్ ఓకే అని గేట్లు తెరిస్తే… వైసీపీ ఖాళీ అయిపోవడం ఖాయం అంటున్నారు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్.

ఆత్మ ప్రభోదమా….. రాజకీయ జీవితమా… ఇదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల ముందున్న చా లెంజ్. అధికార పార్టీని కాదని పోరాడితే ఎదురయ్యే పరిణామాలు వాళ్లకు తెలుసు. రాజకీయంగా ఎదుగుదలకు కారణం అయిన పార్టీకి అన్యాయం చేయడం కష్టమైన పనే. దీంతో ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుతం నెంబర్ గేమ్ నడుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఆకర్షించేందుకు కూటమి ప్రయత్నిస్తుంటే…. ఉన్నవాళ్లు చేజారిపోకుండా చూసుకునేందుకు వైసీపీ టెన్షన్ పడుతోంది. దీంతో టీడీపీ, వైసీపీల మధ్య డైలా గ్ వార్ నడుస్తోంది. ప్రలోభాలకు గురిచేసి ఫలితం దక్కించుకోవాలని టీడీపీ చూస్తుందనే అంశం ప్రధానంగా ప్రచారాస్త్రంగా మలుచుకుంది వైసీపీ. అసలు సంఖ్యాబలం లేకుండా పోటీ చేయడం అంటే… అడ్డదారుల్లో గెలిచేందుకు జరుగుతున్న ఆలోచనలో భాగమేనని వైసీపీ ఆరోపిస్తోంది. 4వందల ఓట్ల వ్యత్యాసం ఉన్నప్పుడు.. ఎలా గెలుస్తామని పోటీకి దిగారో కూటమి చెప్పాలని డిమాండ్ చేస్తోంది. వైసీపీ విమర్శలపై ఎదురుదాడి చేస్తోంది అధికార పార్టీ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సొంత బలంతో గెలిచిన సీట్లు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. కేవలం, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకగ్రీవాల పేరుతో రాజకీయం చేశారని మండిపడ్డారు మాజీమంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటాశ్రీనివాస్. మొత్తం మీద స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికలు విశాఖ జిల్లాలో వేడిని పెంచేయగా…. గెలిచేది ఎవరు…? అనేది ఉత్కంఠగా మారింది.