BHIMAVARAM : భీమవరంలో రాజకీయం అంత ఆషామాషీ కాదు.. గురు

భీమవరంలో రాజకీయం అంత ఆషామాషీ కాదు. ఇక్కడ ఎంత పెద్ద సంస్థ వచ్చి సర్వేలు చేసినా... జనం నాడిని మాత్రం పట్టుకోలేవు. అక్కడ రాజకీయం చేయాలన్నా...విజయం సాధించాలన్నా...ఓ యుద్దం చేసినట్టే కష్టపడాలి.

భీమవరంలో రాజకీయం అంత ఆషామాషీ కాదు. ఇక్కడ ఎంత పెద్ద సంస్థ వచ్చి సర్వేలు చేసినా… జనం నాడిని మాత్రం పట్టుకోలేవు. అక్కడ రాజకీయం చేయాలన్నా…విజయం సాధించాలన్నా…ఓ యుద్దం చేసినట్టే కష్టపడాలి. కత్తుల కంటే పదునైన విమర్శలు, ప్రతివిమర్శలతో సిద్ధం కావాల్సిందే. భీమవరంలో ఇద్దరు అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో…ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు ? సిట్టింగ్ ఎమ్మెల్యేకు జై కొడతారా ? మాజీ ఎమ్మెల్యేకు పట్టం కడతారా అనేది భీమవరం పవర్ ఫైట్ లో చూద్దాం.

భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం… భౌగోళికంగానే కాదు…రాజకీయంగానూ చాలా హాట్. గత ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలను విపరీతంగా ఆకట్టుకుంది భీమవరం. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడి రాజకీయాలు విభిన్నమే. కాపు, క్షత్రియ సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరులో…వార్ వన్‌సైడ్ కాకుండా చేస్తాయి. 2019 ఎన్నికలు తప్ప ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో…టీడీపీ, కాంగ్రెస్ పోటాపోటీగా తలపడ్డాయి. అయితే హస్తం పార్టీపై టీడీపీదే పైచేయి. గత ఎన్నికల్లో జరిగిన పరిణామాలు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా పాలిటిక్స్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరిని అటెన్షన్‌లోకి తీసుకొచ్చాయనే చెప్పాలి.

2019 ఎన్నికల్లో గ్రంధి శ్రీనివాస్‌ వైసీపీ నుంచి, పవన్‌ కల్యాణ్ జనసేన తరపున, టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు పోటీ చేశారు. పవన్‌ కల్యాణ్‌పై గ్రంధి శ్రీనివాస్‌ 8వేల ఓట్ల మెజార్టీ సాధించి…రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 54వేలకు పైగా ఓట్లు సాధించిన టీడీపీ…మూడోస్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో ప్రచారం నుంచి వ్యూహా ప్రతివ్యూహాలు అందర్నీ ఆకట్టుకుంటూ వచ్చాయి. వైసీపీ విజయం సాధిస్తుందా.. పవన్ గెలుస్తాడా అనే టెన్షన్ చివరిదాకా కొనసాగింది. పోలింగ్ పూర్తయి, కౌంటింగ్ దగ్గరపడినా భీమవరంలో ఏం జరుగుతందనేది ఎవరూ ఊహించలేకపోయారు. కౌంటింగ్‌లో అప్పటి దాకా ముందున్న పవన్…ఒక్కసారిగా వెనకబడటంతో వైసీపీ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే పరాభవం ఎదురైంది.

భీమవరంలో పవన్‌పై గెలిచిన శ్రీనివాస్… మరింత బలమైన నేతగా ఇప్పుడు బరిలోకి దిగారు. మొదట పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీచేస్తారని వార్తలు వచ్చాయి. ఆయన పిఠాపురానికి షిఫ్ట్ కావడంతో భీమవరంలో జనసేన తరపున పులపర్తి రామాంజనేయులు… గ్రంధి శ్రీనివాస్‌తో తలపడుతున్నారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓటమిని మరిపించేలా జనసేన విక్టరీ ఉంటుందా అనేది సస్పెన్స్ గా మారింది. దీంతో లెక్కలేనంత పొలిటికల్ హీట్ ఇప్పుడు భీమవరంలో కంటిన్యూ అవుతోంది.

నేతల బలాబలాలు చూస్తే వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ 2004-2009 మధ్య భీమవరం ఎమ్మెల్యేగా పనిచేసారు.. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడినా…2019లో పవన్ కళ్యాణ్ పై గ్రంధి కొట్టిన విక్టరీ…ఇప్పటికీ భీమవరం పొలిటికల్ హిస్టరీలో స్పెషల్ టాపిక్ అయింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులు ఈసారి జనసేన తరపున పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఇద్దరి మధ్య ఫేస్ టు ఫేస్ ఫైట్ ఉండటంతో ఈసారి భీమవరం సీటు హాట్ సీటుగా మారింది. గ్రంధి శ్రీనివాస్‌, పులపర్తి రామాంజనేయులు…ముచ్చటగా మూడోసారి తలపడుతున్నారు. ఇప్పుడు జనసేన తరపున పోటీలో ఉన్న రామాంజనేయులు…మొదటిసారి కాంగ్రెస్‌ నుంచి, రెండోసారి టీడీపీ తరపున విజయం సాధించారు. బీమవరంలో 1983 నుంచి ఇప్పటి వరకు పది సార్లు ఎన్నికలు జరిగితే…ఆరు సార్లు టీడీపీ, మూడు సార్లు కాంగ్రెస్‌, ఒకసారి వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు.

భీమవరంలో 2 లక్షల 46వేల మంది ఓటర్లు ఉన్నారు. సామాజికవర్గాల పరంగా చూస్తే కాపు, క్షత్రియ సామాజికవర్గాలదే డామినేషన్. ఓట్ల పరంగా కాపులదే పైచేయి అయినా…క్షత్రియ సామాజిక వర్గాన్ని తక్కువగా అంచనా వేయలేం. సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, పులపర్తి రామాంజనేయులు…ఇద్దరు కాపులే. దీంతో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది. గత ఎన్నికల్లో వైసీపీకి కాస్త వ్యతిరేకంగా ఉన్న క్షత్రియ ఓట్లన్ని జనసేన తరపున పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌కు పడ్డాయి. కాపులతోపాటు ఇతర సామాజిక ఓట్లను గ్రంధి తనవైపు తిప్పుకోగలిగారు. దాంతో ఈసారి జరిగే స్ట్రైట్ ఫైట్‌లో ఎవరెంత ప్రభావితం చూపిస్తారన్నది సస్పెన్స్ గా మారింది.

భీమవరంలో గడిచిన ఐదేళ్ళుగా…చేసిన అభివృద్ది పనులు, ప్రభుత్వ సంక్షేమ పధకాలు, జనానికి అందుబాటులో ఉండే తత్వం, అందర్నీ కలుపుకుని వెళ్లే స్వభావం గ్రంధి శ్రీనివాస్‌ సొంతం. మంత్రి పదవి ఇస్తానన్నా కాదనుకుని జిల్లా కేంద్రం కోసం పట్టు బట్టి అనుకున్నది సాధించారు. భీమవరంను జిల్లా కేంద్రం చేయడంతో అన్ని వర్గాల్లోనూ ఆదరణ పెరిగింది. పేదల ఇళ్లు, గ్రామాలను కలిపే బ్రిడ్జీల నిర్మాణం, తాగునీటి సమస్యల పరిష్కారం, ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి జనాన్ని గట్టెక్కించే రైల్వే అండర్ పాస్‌లు నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు. పులపర్తి రామాంజనేయులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సామాన్యులకు అందుబాటులో లేరనీ… పేదల ఇళ్ల స్థలాల పేరుతో భూసేకరణ చేసి…తర్వాత వాటిని తన సొంత ఆస్తులుగా మార్చుకున్నారని గ్రంధి విమర్శిస్తున్నారు.

పులపర్తి రామాంజనేయులు కాంగ్రెస్, టీడీపీ తర్వాత ముచ్చటగా మూడోపార్టీ జనసేన నుంచి భీమవరంలో పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు పడిన ఓట్లన్నీ పడితే…విజయం దక్కుతుందనే ధీమాలో ఉన్నారు పులపర్తి. వ్యక్తిగతంగా సౌ‌మ్యుడిగా పేరున్న పులపర్తి రామాంజనేయులు… పవన్ కల్యాణ్‌ స్థానంలో పోటీ చేస్తుండటంతో ఆయనపై అంచనాలు భారీగా ఉన్నాయి. గత ఎన్నికల్లో పవన్ ఓటమిని మర్చిపోయేలా జనసేన విజయం సాధించాలనే పట్టుదలతో జనసైనికులు ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని…భీమవరంలో కూటమే విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వైసీపీ…మరోవైపు జనసేన…ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో 2014 సీన్ రిపీట్ అవుతుందా ? లేక సెంటిమెంట్‌ను జనసేన బ్రేక్ చేస్తుందా ? ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. అప్పటి వరకు భీమవరంలో హైఓల్టేజ్‌ పాలిటిక్స్ కొనసాగుతూనే ఉంటాయి.