RAMOJI : అక్షర శిల్పి రామోజీ రావు..అస్తమయం

ఈనాడు సంస్థల యజమాని రామోజీరావు కన్ను మూశారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు రామోజీ రావు మృతి చెందారు.

 

 

 

ఈనాడు సంస్థల యజమాని రామోజీరావు కన్ను మూశారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు రామోజీ రావు మృతి చెందారు. ఈనెల 5న ఆయన గుండె సంబంధిత సమస్యలతో హాస్పిటల్ లో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీ రావుకి డాక్టర్లు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారాయన. ఇటీవలే గుండె సమస్యకు స్టంట్ కూడా వేశారు. రామోజీ రావు ప్రస్తుత 88 యేళ్ళు. వయసు రీత్యా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రామోజీ రావు పార్థీవ దేహాన్ని ఫిల్మ్ సిటీకి తరలించారు.

కృష్ణా జిల్లాలో 1936 నవంబర్ 16న జన్మించిన రామోజీ రావు… తనకు పరిచయస్తుడు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడైన తహశిల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగాన్ని గురించి నేర్చుకోవాలని ఆశించారు. చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా చేరారు. మూడేళ్ళ పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ కి తిరిగివచ్చారు. రామోజీరావు 1962 అక్టోబరులో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు. ఇదే అతని జీవితంలో మొదటి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ కూడా స్టార్ట్ చేశారు. 1967-1969 మధ్యకాలంలో ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారాన్ని సాగించారు. 1969లో రామోజీరావు ప్రారంభించిన వ్యవసాయ సమాచారంలో మొదటి పత్రికగా అన్నదాతను ప్రారంభించారు. ఆ తర్వాత 1970లో ఇమేజెస్ అవుట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ స్టార్ట్ చేశారు.

దీని బాధ్యతలు అతని భార్య రమాదేవి చూసుకున్నారు. 1971 నుంచి 1974 మధ్య కాలంలో డాల్ఫిన్ హోటల్స్, ఈనాడు దినపత్రికను రామోజీరావు ప్రారంభించారు. రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. ఈ ఫిల్మ్ సిటీతో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు రామోజీ రావు. 2016లో పద్మవిభూషణ్ తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.. రామోజీ గ్రూపు క్రింద ఉన్న సంస్థల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు దిన పత్రిక, ఈటీవి, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి షోరూములు ముఖ్యమైనవి.