AP REAL ESTATE : ఏపీలో రియల్ బూమ్.. కరుగుతున్న ఫిక్సిడ్ డిపాజిట్లు

ఆంధ్రప్రదేశ్ లో రియల్ బూమ్ పుంజుకుంటోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో రియల్ ఎస్టేట్ లో కదలికి వచ్చింది. గత ఐదేళ్ళుగా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో అర్థం కాక చాలా మంది తమ డబ్బుల్ని బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రియల్ బూమ్ పుంజుకుంటోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో రియల్ ఎస్టేట్ లో కదలికి వచ్చింది. గత ఐదేళ్ళుగా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో అర్థం కాక చాలా మంది తమ డబ్బుల్ని బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకున్నారు. ఇప్పుడు క్లారిటీ రావడంతో మెల్లగా తమ క్యాష్ విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు క్యూకడుతున్నారు.

2014లో ఏపీలో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించాక రియల్ ఎస్టేట్ రంగం జెట్ స్పీడ్ లో దూసుకెళ్ళింది. హైదరాబాద్ నుంచి ఉద్యోగులు భారీగా విజయవాడకు తరలి రావడంతో కృష్ణా, గుంటూరు జిల్లాలో పెట్టుబడులు అమాంతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ రంగం గుంటూరు జిల్లా తాడేపల్లి దాకా విస్తరించింది. 2014 మొదట్లో తాడేపల్లి ఏరియాలో గజం భూమి 10 నుంచి 15 వేలు ఉంటే… రాజధాని ప్రకటించాక 2019 నాటికి అది 50 వేల రూపాయలకు చేరింది. ఉండవల్లి, మంగళగిరి, నంబూరు, కాజా ఇలా నేషనల్ హైవే చుట్టూ రియల్ ఎస్టేట్ రంగం విస్తరించింది. విజయవాడలోనూ ఆ ఐదేళ్ళల్లో భారీగా ఇళ్ళ నిర్మాణాలు జరిగాయి.

ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక… రియల్ ఎస్టేట్ బిజినెస్ తలకిందులైంది. జగన్ ప్రభుత్వం ఇసుక తవ్వకాలు నిలిపేయడంతో… నిర్మాణ రంగం కుదేలైంది. అమరావతి, విజయవాడ చుట్టు పక్కల అప్పటికే నిర్మాణాలు చేస్తున్న వాటిని కూడా సగంలో వదిలేశారు. చిన్న చిన్న రియల్టర్లు అయితే వడ్డీలు కట్టుకోలేక…కట్టిన ఇళ్ళను అమ్ముకోడానికి కొనేవాళ్ళు లేక నిండా మునిగిపోయారు. కొందరు బిల్డర్లు అయినకాడికి అమ్మేసుకొని నష్టాలతోనే బయటపడ్డారు. అధికార పార్టీ పెద్దలకు కమీషన్లు ఇచ్చుకోలేక కొందరు రియల్టర్లు ఏపీ నుంచి బిచాణా ఎత్తేశారు.

ఇప్పుడు చంద్రబాబు రాకతో మళ్ళీ రియల్ ఎస్టేట్ బూమ్ అందుకుంది. దాంతో నాలుగైదు రోజులుగా బ్యాంకుల్లో పెద్ద ఎత్తున ఫిక్సిడ్ డిపాజిట్లను రద్దు చేసుకుంటున్నారు. లక్షలు, కోట్లల్లో డిపాజిట్లు చేసిన వాళ్ళంతా… భూమిపై పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ కంటే… భూములు, ఇళ్ళపై పెట్టుబడి పెడితే ఎక్కువ ఆదాయం, వడ్డీ అభిస్తుందని భావిస్తున్నారు. విజయవాడలో ఏడాదికి 100 కోట్ల టర్నోవర్ ఉన్న 4 బ్రాంచుల్లో ఖాతాదారుల ఫిక్సిడ్ డిపాజిట్లు కరిగిపోతున్నాయి. దాంతో తమ బ్యాంకుల లాభాలపై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు మేనేజర్లు. మళ్ళీ ఆ ప్రాఫిట్స్ అందుకోవాలంటే ఆర్నెల్లు పడుతుందని చెబుతున్నారు. ఏపీలో రియల్ బూమ్ ఎఫెక్ట్ ఇటు హైదరాబాద్ పైనా కనిపిస్తోంది. ఇన్నాళ్ళు సిటీ చుట్టుపక్కల వెంచర్లు వేస్తున్న రియల్టర్ కూడా ఇప్పుడు అమరావతికి క్యూ కడుతున్నారు. గత 10, 15 రోజులుగా రియల్ ఎస్టేట్ లో కోట్ల రూపాయల్లో లావాదేవీలు నడుస్తున్నట్టు చెబుతున్నారు.