ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) కు… ఆయన చెల్లెలు షర్మిల (Sharmila) మరో గట్టి షాక్ ఇవ్వబోతున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేయబోతోంది. కడపలో వైఎస్సార్ పార్టీ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డికి (Avinash Reddy)వ్యతిరేకంగా షర్మిల నిలబడుతున్నారు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని ఓడించాలని షర్మిల డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. AICC పెద్దల ఆదేశాలు, ఒత్తిడితో ఈ పోటీకి దిగుతున్నట్టు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ (Andhra Pradesh Congress) అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన షర్మిల… అన్న జగన్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. జగన్ ఓటమి కోసం పోరాడుతున్న ఆమె ఎన్నో సంచలనాలు బయటపెడుతున్నారు. జగన్ పాలనను, ఆయన వ్యక్తిత్వాన్ని బజారుకీడుస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సోదరుడు అవినాష్ రెడ్డిపైనే కడప ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు షర్మిల. జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డి నిందితుడు. ఆయనకు మళ్ళీ వైసీపీ టిక్కెట్ ఇవ్వరని అనుకున్నారు. కానీ జగన్ మళ్ళా ఛాన్స్ ఇవ్వడంతో… వైఎస్ కుటుంబంతో పాటు వైఎస్సార్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. అవినాష్ కి టిక్కెట్ ఇవ్వడాన్ని… వివేకానందరెడ్డి కూతురు సునీతతో పాటు షర్మిల కూడా తప్పుబట్టారు.
జగన్ ను దెబ్బకొట్టడానికి కడప ఎంపీగా షర్మిలను నిలబెట్టాలని AICC పెద్దలు డిసైడ్ చేశారు. షర్మిలను వైజాగ్ ఎంపీగా నిలబెడతారని మొదట్లో టాక్ వచ్చింది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం… వివేకానంద రెడ్డి హత్య తరువాత జగన్ పై కడప జిల్లాలో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని నిర్ణయించింది. ఈ స్థానంలో వివేకా భార్య సౌభాగ్యమ్మ లేదా కూతురు సునీతను దించుతారని భావించారు. కానీ వీళ్ళెవరూ కాకుండా షర్మిల పోటీ చేస్తే … వైఎస్ కుటుంబంపై ఉన్న సానుభూతి, అవినాష్ రెడ్డిపై వ్యతిరేకతతో గ్యారంటీగా ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉంటుందని భావించింది AICC. కడపలో అవినాష్ వర్సెస్ షర్మిల పోటీ చేస్తే పెద్ద సమరమే జరిగే అవకాశం ఉంది. ఏపీలో హాట్ సీట్ గా మారనుంది.