ఏపీ రాజకీయం ఇంత ఈజీగా చల్లారేలా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చి జగన్‌కు అధికారం కట్టబెట్టిన జనం.. ఐదేళ్లు తిరిగేసరికి సంచలన తీర్పు ఇచ్చారు. వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది జగన్ పార్టీ. గెలిచిన 11మంది ఎమ్మెల్యేల్లో చివరి వరకు ఉండేది ఎవరు అంటే.. ధీమాగా ఒక్క పేరు కూడా చెప్పలేని పరిస్థితి. పార్టీలో సీన్ జగన్‌కు కూడా అర్థమైందనుకుంటా.. పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోతానన్నా ఆపేది లేదు అంటూ చేతులెత్తేశారు. వైసీపీ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉన్న పరిస్థితులు కనిపిస్తున్న వేళ.. జగన్ పార్టీ ప్లేస్ కోసం ఏపీసీసీ చీఫ్ షర్మిల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో హస్తం పార్టీ గల్లంతు అవుతుంది అనుకుంటున్న సమయంలో.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇదే జోష్‌లో ఏపీలోనూ సత్తా చాటాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ పెద్దలు.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక వైఎస్‌కు అసలైన వారసురాలిని తానే అంటూ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల.. ఏపీలో వైసీపీ ప్లేసును కబ్జా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు కనిపిస్తున్నారు.
దీనికోసం తన తండ్రి 75వ జయంతి వేడుకలను అవకాశంగా మార్చుకుంటున్నారు షర్మిల. వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీలో ఉన్న నేతలను మళ్లీ కాంగ్రెస్ గూటికి తీసుకురావాలన్నదే ప్రధాన అజెండాగా కనిపిస్తోంది. దీనికోసం వైఎస్ 75వ జయంతి వేడుకల్ని విజయవాడలో నిర్వహిస్తూ చీఫ్ గెస్టులుగా రాహుల్, సోనియా, ప్రియాంకను ఆహ్వానిస్తున్నారు. అంతేకాదు ఇదే వేదికపై కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి ఉండేందుకు తల్లి విజయమ్మను కూడా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఐతే విజయమ్మ వస్తారా లేదా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. షర్మిల అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. కాంగ్రెస్‌కు కాస్తో కూస్తో మైలేజ్ పెరిగే చాన్స్ ఉందని పొలిటికల ఎనలిస్టులు అంటున్నారు. ఎలాగూ వైసీపీ పార్టీని ఆదరించే వారు లేరు. ప్రభుత్వంలో ఉండగా జరిగిన అవకతవకలు.. గతంలో ఉన్న కేసులు తిరగతోడితే జగన్ ఇరుకున పడే అవకాశం ఉంది. మొన్నటి ఎన్నికల్లో జగన్ ఓటమిని కోరుకున్న షర్మిల.. రాబోయే ఎన్నికల్లో తాను అధ్యక్షురాలిగా ఉన్న పార్టీని బలమైన ప్రత్యర్ధిగా నిలబెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుంది.. షర్మిల ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది చూడాలి మరి.