దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు జూలై 8 నాటికి విస్తరించాల్సి ఉండగా.. ఈ సంవత్సరం మాత్రం కొంచం ముందుగానే జూలై 2నాటికే విస్తరించాయని ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం దీంతో ఏపీలో మాత్రం కొంచం ఉపసమనం లభించింది అని చెప్పవచ్చు.. వాతావరణం చల్లగా ఉంటుంది కానీ.. వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉండదు.. మరో వైపు ఏపీ, యానాం మీదుగా దిగువ ట్రోపోస్పిరిక్ నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయని తెలిపారు. ఏపీలో రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం, తూ.గో., ప.గో., కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్థిరమైన ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. పశ్చిమ తెలంగాణలో సాయంత్రం 5 గంటల తర్వాత జల్లులు కురుస్తాయి. తెలంగాణలో ద్రోణి ప్రభావంతో ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇంకా కేరళ, లక్షద్వీప్, కోస్టల్ కర్నాటక, కొంకణ్, గోవా, గుజరాత్‌లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదవనుంది. మధ్య మహారాష్ట్ర, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, కర్ణాటకలో తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం వుంది. రానున్న ఐదు రోజుల్లో మరఠ్వాడా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
ఈ రాష్ట్రాల్లో వర్షపాతం..
జూలై 4 నుంచి 6 వరకు జమ్మూకశ్మీర్, లడఖ్, గిల్ గిట్, బాల్టిస్థాన్, ముజఫరాబాద్, జూలై 2 నుంచి 6 వరకు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, జూలై 3 వరకు పశ్చిమ రాజస్థాన్, జూలై 2 నుంచి 4 వరకు మధ్యప్రదేశ్, జూలై 3న ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై 6 వరకు ఉత్తరాఖండ్, జూలై 3న పంజాబ్, హర్యానా, జూలై 6 వరకు పశ్చిమ ఉత్తరప్రదేశ్, జూలై 5, 6 తేదీల్లో తూర్పు ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇదిలావుంటే.. జూన్ 11 నుండి జూన్ 27 వరకు దేశంలో 16 రోజులపాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 165.3 మిమీ కాగా.. 147.2 మిమీ వర్షపాతం నమోదైంది.