ఏపీలో ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ దిగిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యింది. కొత్త రాజధాని, కొత్త పథకాలు, కొత్త పద్ధతులు, కొత్త మంత్రులు. ఇవన్నీ అందరూ మాట్లాడుకుంటుంటే.. మందు బాబుల ఆరాటం మాత్రం వేరేగా ఉంది. ఇప్పటి నుంచైనా ఏపీలో కింగ్‌ఫిషర్, బడ్‌వైసర్ బీర్లు దొరుకుతాయా అని. 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం విషయంలో చాలా కీలకమైన మార్పులు చేశారు జగన్. మద్యపాన నిషేదం చేస్తామని చెప్పి ఉన్న బ్రాండ్లు తీసేసి కొత్త బ్రాండ్లు తీసుకువచ్చారు. అవి కూడా సామాన్యులు కొనలేని స్థాయిలో రేట్లు ఏర్పాటు చేశారు.
దీంతో మందుబాబుల పరిస్థితి ఎడారిలో పడ్డట్టు ఐపోయింది. మంచి బ్రాండ్లు ఎక్కువ డబ్బులకు కొనలేక కల్తీ మందు తాగి చాలా మంది చనిపోయారు కూడా. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ మందు గురించి చాలా చర్చ కూడా జరిగింది. మందు బ్రాండ్ల పేర్లు.. వాటికోసం మందుబాబులు పడుతున్న అవస్తలు వైరల్ అయ్యాయి. ఏపీలో అధికారంలోకి వస్తే పాత బ్రాండ్లు పాత ధరలకే అందిస్తామంటూ కూటమి నేతలు హామీ ఇచ్చారు. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చారు. దీంతో మా పొలంలో మొలకలొచ్చాయ్ అంటున్నారు మందుబాబు.
ఇప్పడు ఏపీలో కూడా కింగ్‌ఫిషర్, బడ్‌వైసర్ బీర్లు దొరుకుతాయంటూ రెండు బీర్లను వైరల్ చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ వెళ్తే ఫారిన్ వెళ్లినట్టు అన్ని బ్రాండ్లు దొరికేవని.. ఇప్పటి నుంచి మా ఊర్లో మేమే మంచి బ్రాండ్లు తాగుతామంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. భూం భూం బాధ తప్పింది.. కింగుల్లా కింగ్‌ఫిషర్ వేస్తాం అంంటూ కొటేషన్లు కూడా చెప్తున్నారు. అభివృద్ధి ఉద్యోగాల గురించి అంతా బాధ పడుతుంటే.. మందుబాబుల ఆరాటం మాత్రం ఇది. వాళ్లు ఎంతగానో ఎదురుచూస్తున్న బీర్లు, బ్రాండ్లు పాత రేట్లకే ఏపీలో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాయో చూడాలి మరి.