సినిమాలకు, రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో అదీ మరీ ఎక్కువ. సినిమావాళ్లు రాజకీయాలు చేయడం చేయడం.. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయడం ఇక్కడ కామన్. ఐతే ఇప్పుడీ చర్చ ఎందుకంటే.. వరుస విజయాల వినాయక్ అని.. వరుస సక్సెస్‌లతో ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన వీవీ వినాయక్… పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారనే ప్రచారం.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతోంది. మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికల జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయ్. పార్టీలు కూడా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయ్. అదేదో షెడ్యూల్ వచ్చేసింది అనే రేంజ్‌లో స్ట్రాటజీలు సిద్ధం చేసుతున్నాయ్.
అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, మేనిఫెస్టో సహా అన్ని అంశాలపై పార్టీలు ఫోకస్ పెట్టాయ్. ఇలాంటి తరుణంలో.. డైరెక్టర్ వీవీ వినాయక్ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయ్. వీవీ వినాయక్ సొంతూరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తాడిపూడి. ఈ మధ్యే ఆయన సొంతూరుకు వచ్చారు. ఆయనకు సర్పంచి నామా శ్రీనివాసు, జడ్పీ వైస్ ఛైర్మన్ శ్రీలేఖ, వైసీపీ నేతలంతా ఘన స్వాగతం పలికారు. తాడిపూడి పక్కనే ఉన్న ఏలూరు జిల్లాలోని మహాలక్ష్మిపేటలో జరిగే గొంతెలమ్మ పండగకు వీవీ వినాయక్ వచ్చారు. ఐతే ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీకి సిద్ధం అవుతున్నట్లు.. ఈ విషయం మీదే నేతలతో చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది.
ఐతే వీవీ వినాయక్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాకినాడ, ఏలూరు లోకసభ నియోజకవర్గాల్లో.. ఎంపీగా నిల్చుంటారనే టాక్ వినిపిస్తోంది. దానికోసమే ఆయన పర్యటనకు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. ప్రస్తుతం వీవీ వినాయక్ చేతిలో పెద్దగా సినిమాలు లేవ్. పైగా ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ మధ్యే ఛత్రపతి పేరుతో హిందీలో సినిమా చేసినా.. డిజాస్టర్‌గానే మిగిలింది. తెలుగులోనూ పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇలాంటి సమయంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయం అంటూ ప్రచారం జరుగుతోంది. ఐతే ఇందులో వాస్తవం ఎంత అన్నది మాత్రం క్లారిటీ లేదు.