జైలుకొచ్చే ఏ ఖైదీకి అయినా నాలుగు మంచి బుద్ధులు చెప్పి పంపాలి సిబ్బంది. అతడిలో మార్పు తెప్పించి.. బయట మంచి మార్గంలో బతకమని ప్రోత్సహించాలి. కానీ దొంగతనం మీద జైలుకొచ్చిన ఓ వ్యక్తి దగ్గరే డబ్బులు నొక్కేశారు ఏపీలోని రాజమండ్రి జైలు సిబ్బంది. ఖైదీ దగ్గరే డబ్బులు తీసుకోవడం ఇప్పుడు ఏపీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
రాజమండ్రి (Rajahmundry) సెంట్రల్ జైలు (Central Jail) నుంచి ఈమధ్య విడుదలైన ఖైదీ శ్రీనివాస్. విజయనగరం జిల్లా ఎస్ కోటకు చెందిన శ్రీనివాస్(Srinivas).. మూడు నెలల క్రితం దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. తర్వాత రిమాండ్ పై రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ సమయంలో అతని దగ్గర 860 రూపాయలు ఉన్నాయట. వాటిని జైలు సిబ్బంది తీసుకొని.. రికార్డుల్లో రాసుకున్నారు. జనరల్ గా జైలు లోపలికి వెళ్ళే ముందు.. ఖైదీ దగ్గర ఉన్న వస్తువులు, డబ్బులను అక్కడి సిబ్బంది స్వాధీనం చేసుకుంటారు. మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు వాటిని తిరిగి ఇచ్చేస్తారు. కానీ తన దగ్గర తీసుకున్న 860 రూపాయలు తిరిగి ఇవ్వట్లేదని రాజమండ్రి సెంట్రల్ జైలు ముందే నిరసన దిగాడు శ్రీనివాస్
శ్రీనివాస్ రిలీజ్ అయి 3 నెలలు అయింది. అయినా తన 860 రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదంటూ ప్లకార్డులతో జైలు ముందు ఆందోళన చేపట్టాడు. ఓ పవిత్రమైన న్యాయమా.. దైవ సమానమైన న్యాయమా.. ఈ పేదవాడికి న్యాయం చేయండి అంటూ జైలు బయట నిరసన తెలుపుతున్నాడు. డబ్బులు ఎంతైనా కావొచ్చు.. అతనికి ఇవ్వడం న్యాయమే అయినప్పుడు జైలు సిబ్బంది ఆ డబ్బులు ఇవ్వకపోగా.. శ్రీనివాస్‌ను బలవంతంగా కొట్టుకుంటూ మళ్ళీ జైల్లోకి తీసుకెళ్ళారు. బెయిల్ పై బయటకు వచ్చిన వ్యక్తిని.. జైలు సిబ్బంది మళ్ళీ లోపల పెట్టడం సంచలనంగా మారింది. అతనిపై కేసు లేకుండా జైల్లోకి తీసుకెళ్ళడం ఏంటని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. రాజమండ్రి జైలు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జనం.