ఏపీలో పల్నాడు సీట్లలో పోటీపై టీడీపీ (TDP) వ్యూహం మార్చింది. గడిచిన 20 ఏళ్ళ నుంచి పార్టీ జెండా ఎగరని నియోజకవర్గాల విషయంలో ఈసారి స్కెచ్ డిఫరెంట్‌గా వేస్తోంది. వైసీపీ కంచుకోటల్లో… సైకిల్ సవారీకి కొత్త ప్లాన్స్ రెడీ అవుతున్నాయి.
పల్నాడు… పౌరుషాల పురిటి గడ్డ. ఫ్యాక్షన్ చరిత్రతో కలగలిసిన రాజకీయం ఇక్కడ ఇప్పటికీ నడుస్తోంది. పల్నాడు పరిధిలోని ఏడు అసెంబ్లీ (AP Assembly Elections) సెగ్మెంట్లల్లో కొన్ని టీడీపీకి కంచు కోటలుగా ఉంటే.. ఇంకొన్ని వైసీపీ (YCP)కి బలమైన సెగ్మెంట్స్. అయితే గత ఎన్నికల్లో మాత్రం మొత్తం ఏడు సెగ్మెంట్లతో పాటు.. నరసరావుపేట ఎంపీ స్థానం కూడా వైసీపీ వశమైంది. దీంతో ఈసారి కూడా పట్టు నిలబెట్టుకునేందుకు వైసీపీ ఎంతగా ప్రయత్నాలు చేస్తుందో.. టీడీపీ కూడా అంతకు మించి కసరత్తు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయవర్గాలు. అయితే టీడీపీ గతానికి భిన్నంగా కొత్త ఈక్వేషన్లను తెర మీదకు తెచ్చి పట్టు బిగించేందుకు స్కెచ్ రెడీ చేస్తోందట. వినుకొండ, పెదకూరపాడు, గురజాల, చిలకలూరిపేట (Chilakaluripet), సత్తెనపల్లి నియోజకవర్గాల్లో మధ్యలో టీడీపీ గెలిచినా.. మాచర్ల, నరసరావుపేట సెగ్మెంట్స్ మాత్రం దాదాపు 20 ఏళ్ళ నుంచి టీడీపీ చేతిలో లేవు.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా.. ఈ రెండు సెగ్మెంట్స్‌లో పార్టీని బలోపేతం చేయడంపై ఎలాంటి శ్రద్ధ పెట్టలేదన్న విమర్శలు అధినాయకత్వం మీద ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారట పార్టీ పెద్దలు. పల్నాడులోని ఏడు సెగ్మెంట్లు.. ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న టార్గెట్‌తో కొత్త ఈక్వేషన్లు తెర మీదకు తెస్తోందట. నరసరావు పేట ఎంపీగా ఇప్పటికే తన ముద్ర వేయగలిగిన లావు శ్రీకృష్ణ దేవరాయలుకు తిరిగి అదే సీటు ఇవ్వాలనుకుంటోందట. ఇక మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డికి టిక్కెట్ కేటాయించింది. ఇన్నేళ్ళు ప్రతి ఎన్నికల సందర్భంలో జూలకంటి బ్రహ్మారెడ్డికి టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ రావడం.. చివరి నిమిషంలో ఆయన పేరు వెనక్కు వెళ్లడం జరిగేది. ఆర్థికంగా జూలకంటి బలంగా లేరు కాబట్టి ఆయన్ను పక్కన పెట్టేది టీడీపీ అధినాయకత్వం. కానీ ఇప్పుడు మాత్రం ఆ లింక్ లేకుండా.. ఆయనకే టిక్కెట్ అనే విషయాన్ని ముందుగానే క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఎన్నికల సమయం వచ్చేసరికి.. ప్రత్యర్థి అన్ని రకాలుగా బలంగా ఉన్నా.. బ్రహ్మారెడ్డి గట్టి పోటీ ఇవ్వగలుగుతారన్న ధీమా పార్టీ వర్గాల్లో పెరుగుతోందట.
ఇక నరసరావుపేట సెగ్మెంట్‌లో యాదవ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని పార్టీలో చేర్చుకుని అవకాశం ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. సత్తెనపల్లి, నరసరావుపేట, మాచర్ల, గురజాల వంటి సెగ్మెంట్లల్లో యాదవ సామాజిక వర్గానికి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో నరసరావుపేట అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడం ద్వారా ఆ సెగ్మెంటుతో పాటు.. ఇతర సెగ్మెంట్లల్లో కూడా ప్రభావం చూపుతుందనేది టీడీపీ అంచనా అట. ఇక సత్తెనపల్లిలో కన్నాను తెర మీదకు తెచ్చారు. ఇక్కడ కన్నాకు పక్కలో బల్లెంలా కోడెల శివరాం తయారయ్యారు. శివరాంకు నచ్చచెప్పి.. అడ్డు తప్పించే చర్యలపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అప్పటికీ మాట వినకుంటే కఠిన నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడకూడదనే భావన పార్టీ అధినాయకత్వంలో ఉన్నట్టు సమాచారం. అలాగే గురజాల సెగ్మెంట్లో ఇప్పటికీ వైసీపీతో పోల్చుకుంటే టీడీపీ వెనుకబడి ఉందనే చర్చ జరుగుతోంది.
ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయనున్న యరపతినేని మరింత కష్టపడితే గ్యాప్ తగ్గొచ్చని భావిస్తోంది పార్టీ నాయకత్వం. పెదకూరపాడు సెగ్మెంటును సెట్ చేసే పని కూడా మొదలైందట. ఇక్కడి నుంచి ఇన్ఛార్జ్ కొమ్మాలపాటి శ్రీధర్ టిక్కెట్ ఆశిస్తున్నా.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేమనే సంకేతాలను ఇప్పటికే ఇచ్చినట్టుగా కన్పిస్తోంది. ఇక్కడి నుంచి భాష్యం ప్రవీణ్‌కు టిక్కెట్ దక్కవచ్చంటున్నారు. అయితే కొమ్మాలపాటి సాయం లేకుండా భాష్యం ప్రవీణ్ గట్టెక్కడం కష్టమనే చర్చ కూడా జరుగుతున్న క్రమంలో దీన్ని ఏ విధంగా సెట్ చేయాలనే అంశంపై టీడీపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోందట. ప్రస్తుతం కొమ్మాలపాటి అలిగి పార్టీకి దూరంగా ఉండాలనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. అయితే ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నం గట్టిగా జరుగుతోందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుకు భాష్యం ప్రవీణ్‌కు బంధుత్వం ఉంది. ఆ యాంగిల్‌ని కూడా టచ్ చేస్తూ సమీకరణల్ని సెట్ చేయాలనుకుంటున్నారట టీడీపీ పెద్దలు. ఈ సెగ్మెంటులో పార్టీ అంతా ఏకతాటి మీద ఉంటే గెలుపు ఈజీ అన్న భావన పార్టీ వర్గాల్లో ఉంది.
ఇక చిలకలూరిపేట, వినుకొండ పార్టీకి పెద్దగా ప్రాబ్లం లేని సెగ్మెంట్లే. ఇక్కడ టీడీపీకి పట్టుంది. పత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజనేయులు పోటీ చేస్తున్నారు. వీరిద్దరికి స్థానిక కేడర్లో కానీ.. లీడర్లల్లో కానీ మంచి పేరుంది.. గత ఎన్నికల్లో ఈ రెండు స్థానాలను చేజార్చుకున్నా.. ఈసారి దక్కించుకుంటామనే ధీమా పార్టీ వర్గాల్లో కన్పిస్తోంది. ఈ విధంగా పల్నాడు ప్రాంతంపై టీడీపీ పూర్తి స్థాయి ఫోకస్ పెట్టిందట. పక్కా ప్రణాళికతో స్వీప్ చేయాలనేది పార్టీ వ్యూహంగా చెబుతున్నారు నాయకులు. అయితే ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుంది? పై స్థాయి ప్లానింగ్‌కు లోకల్ సహకారం ఎంతవరకు ఉంటుందన్నది చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు.