YCP Resurveys : వైసీపీలో రీ-సర్వేల టెన్షన్… కొత్త ఇంఛార్జులకి టిక్కెట్లు ఇస్తారా ?

అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తున్న వైసీపీ… వరుస లిస్టులను విడుదల చేస్తోంది. లోకల్, క్యాస్ట్‌, కాంబినేషన్... ఇలా రకరకాల ఈక్వేషన్స్ తో వడపోతలు నడుస్తున్నాయి. సమన్వయకర్తల మార్పు జరుగుతోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా మార్పులు జరిగాయి. సర్వేల ఆధారంగానే ముందు కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసినా... కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో పుంజు కోలేకపోయారన్న అభిప్రాయం అధిష్టానం పెద్దల్లో పెరుగుతోందట.

అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తున్న వైసీపీ… వరుస లిస్టులను విడుదల చేస్తోంది. లోకల్, క్యాస్ట్‌, కాంబినేషన్… ఇలా రకరకాల ఈక్వేషన్స్ తో వడపోతలు నడుస్తున్నాయి. సమన్వయకర్తల మార్పు జరుగుతోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా మార్పులు జరిగాయి. సర్వేల ఆధారంగానే ముందు కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసినా… కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో పుంజు కోలేకపోయారన్న అభిప్రాయం అధిష్టానం పెద్దల్లో పెరుగుతోందట. ఈ క్రమంలో రీ సర్వేలు జరుగుతుండగా… చివరకు రేసులో మిగిలేది ఎవరు… మార్పుల మంత్రంలో కనుమరుగు అయ్యేది ఎవరన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది.

అరకులో ముందు ఎంపీ మాధవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన అధిష్ఠానం.. స్థానిక వ్యతిరేకత కారణంగా పునరాలోచన చేసింది. ఆమెకు బదులు కొత్త సమన్వయకర్తగా రేగం మత్స్యలింగంకు ఛాన్స్ ఇచ్చింది. ఈ మార్పులు తర్వాత మరికొన్ని నియోజకవర్గాల్లో రీ సర్వే జరుగుతుండగా కేడర్‌లో పట్టు, జనం ఆదరణతో పాటు అంగ, అర్ధబలం ఆధారంగా మరోసారి మార్పులు ఉండవచ్చంటున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును ఈసారి ఓడించి తీరాలని పట్టుదలగా ఉందట వైసీపీ అధినాయకత్వం. 2019 ఎన్నికల్లో ఇక్కడ యాదవ సామాజిక వర్గానికి చెందిన అక్కరమాని విజయ నిర్మలను పోటీకి పెట్టింది. ఆ ఎన్నికల్లో జనసేన ప్రభావంతో వైసీపీ ఓట్లు చీలిపోగా… వెలగపూడి సుమారు 26వేల ఓట్లతో గెలిచారు. వైసీపీ, జనసేన అభ్యర్థులు ఇద్దరు యాదవ సామాజిక వర్గానికే చెందిన వారు కావడంతో… అక్కరమానికి పడాల్సిన ఓట్లు చీలిపోయాయన్నది విశ్లేషణ.

ఆ ఎన్నికలో ఓటమి తర్వాత ఆమెను కీలకమైన విశాఖ పట్టణం మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్ పర్సన్ గా నియమించి.. నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగించింది వైసీపీ. అందుకు తగ్గట్టుగానే… దూకుడుగా వ్యవహరిస్తూ… అక్కరమాని వర్గం టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ… తాజా మార్పు చేర్పుల్లో భాగంగా ఈ సీటును ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఇచ్చింది పార్టీ హై కమాండ్‌. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడిని అదే కులానికి చెందిన అభ్యర్థితో కొట్టాలన్న క్రమంలోనే ఎంవీవీ తూర్పు తెర మీదికి వచ్చారు. పాద యాత్రలు, పండుగలు, పబ్బాలకు ప్రజల అవసరాల పేరుతో డబ్బు కుమ్మరిస్తూ నియోజకవర్గం మీద తన ముద్ర వేసే ప్రయత్నంలో ఉన్నారు ఎంవీవీ..

ఇంత చేసినా తూర్పులో ఆయనకు ఆశించిన మైలేజ్ రావడం లేదనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది. అదే సమయంలో అక్కరమానిని తప్పించడంతో యాదవ సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యత దక్కలేదన్న అభిప్రాయం కూడా పెరుగుతోందట. ఆ ప్రభావం తూర్పుతో పాటు భీమిలి, గాజువాక, విశాఖ ఉత్తరం నియోజకవర్గాల మీద పడుతుందన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఎంపీ సీటు సైతం ప్రభావితం అవుతుందన్న భయాలు పెరుగుతున్నాయి వైసీపీలో. ఈ క్రమంలో రీ సర్వేలు జరుగుతున్నాయన్న వార్తలతో అక్కరమాని వర్గంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు గాజువాక నియోజకవర్గంలో పరిణామాలు తూర్పులో సమీకరణలను మార్చే అవకాశం ఉందన్న లెక్కలు పెరుగుతున్నాయి.

గాజువాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని ఫస్ట్ లిస్టులోనే మార్చేసింది పార్టీ. కార్పొరేటర్ ఉరుకూటి చందును నియమించి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో గాజువాకలో జరిగిన విస్తృత స్థాయి సమావేశం రసాభాసగా మారిపోగా…ఎమ్మెల్యే నాగిరెడ్డి, కో ఆర్డినేటర్ చందు మధ్య సమన్వయం సాధ్యం కాలేదు. సమన్వయకర్తలు అయినంత మాత్రాన ఎమ్మెల్యే టిక్కెట్ వచ్చినట్టు కాదని బహిరంగ వేదికలపై అంటున్నారు ఎమ్మెల్యే. దీనిని బట్టి చూస్తే గాజువాకలో నాగిరెడ్డి కి సీటు లేదనేది ఎంత నిజమో… చందు అభ్యర్థి కాడు అనేది అంతే నిజం అనే చర్చ జరుగుతోంది. అటు టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిత్వం కాపు లేదా యాదవ సామాజిక వర్గానికి ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఇక్కడ వైసీపీ కూడా కాపు అభ్యర్థికి ఛాన్స్ ఇవ్వవొచ్చు.

ఈ మార్పులు అనివార్యం అయితే తూర్పు సీటులో చేంజ్ రావడం తప్పదని… అక్కడ యాదవులకు ఇవ్వాల్సి వస్తే… అక్కరమాని కుటుంబం లేదా బలమైన యాదవ నాయకత్వాన్ని బరిలో దింపే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా ఈ రెండు నియోజకవర్గాల్లో రీ సర్వేల వ్యవహారం వైసీపీలో ఉత్కంఠ రేపుతోంది. చివరికి అభ్యర్థులుగా ఎవరు తేలతారో చూడాలి.