Andhra Pradesh Free bus : ఫ్రీ బస్‌ పథకంపై కీలక నిర్ణయం.. ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారంటే..

ఏపీ ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తెచ్చిన హామీల్లో మహిళలకు ఫ్రీ బస్‌ పథకం కూడా ఒకటి. నిజానికి ప్రభుత్వంపై ఎంతో భారం పడే ఈ పథకం ఏపీ ప్రభుత్వానికి ఓ సవాల్‌ అనే చప్పాలి.

ఏపీ ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తెచ్చిన హామీల్లో మహిళలకు ఫ్రీ బస్‌ పథకం కూడా ఒకటి. నిజానికి ప్రభుత్వంపై ఎంతో భారం పడే ఈ పథకం ఏపీ ప్రభుత్వానికి ఓ సవాల్‌ అనే చప్పాలి. కానీ ఇచ్చిన హామీ ప్రకారం ఫ్రీ బస్‌ పథకాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు కసరత్తు మొదలపెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఆర్టీసీ అధికారులు రిపోర్ట్‌ కూడా తయారు చేశారు. ఈ పథకం వల్ల APSRTCకి నెలకు 250 కోట్ల వరకు భారం పడుతుందని అంచనాకు వచ్చారు.

ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తుండటంతో అక్కడి పరిస్థితులను కూడా పరిశీలించారు. ఏయే బస్సుల్లో ప్రయాణం ఉచితం, ప్రభుత్వం నుంచి చెల్లింపులు ఎలా తదితర వివరాలను అధ్యయనం చేశారు. ఆర్టీసీ, రవాశా శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై కీలక చర్చ జరగనుంది.

దీంతో అధికారులు ముందుగా నివేదికను రూపొందించారు. ఆర్టీసీలో రోజుకు సగటున 36 నుంచి 37 లక్షల మంది ప్రయాణిస్తుండగా.. వీరిలో 40 శాతం మంది మహిళలని అంచనా. అంటే దాదాపు 15 లక్షల మందికి ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌‌లు.. హైదరాబాద్‌‌లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ ఉచిత ప్రయాణం అమలవుతోంది. కర్ణాటకలోనూ దాదాపు ఇలాగే ఉంది. తమిళనాడు విషయానికి వస్తే చెన్నై, కోయంబత్తూరు నగరాల్లోని సిటీ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులతో పాటు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో మహిళలకు ఫ్రీ బస్సు పథకం కల్పించేందుకు వీలుంది.

ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటకల్లో జీరో టికెట్‌ జారీ చేస్తున్నారు. ఇది జీరో టిక్కెట్ అయినా.. టిక్కెట్‌లు ఇచ్చే మిషన్‌లో మాత్రం అసలు ఛార్జీ నమోదవుతుంది. మహిళలకు జారీచేసే జీరో టిక్కెట్ల మొత్తం విలువను అధికారులు లెక్కించి.. రీయింబర్స్‌ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతుంటారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ, కర్ణాటకల్లో ఆక్యూపెన్సీ భారీగా పెరిగినట్టు గుర్తించారు. అక్కడ గతంలో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 65 నుంచి 70 శాతం ఉండగా.. ఈ పథకం వచ్చిన తర్వాత 95 శాతానికి చేరింది. ప్రస్తుతం APSRTCలో ఆక్యుపెన్సీ 69 నుంచి 70 శాతం మధ్య ఉండగా.. ఫ్రీ బస్సు అమలైతే 95 శాతానికి చేరుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ రెండు రాష్ట్రాల్లో విధానాలను అమలుచేస్తే.. ఆర్టీసీకి నెలకు 250 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. టికెట్ల, స్టూడెంట్, సీజనల్‌ పాస్‌ల రూపంలో ప్రతి నెలా ఆర్టీసీకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. టికెట్ల ద్వారా నెలకు సగటున 500 కోట్లు రాబడి వస్తుండగా, ఇందులో 220 కోట్ల వరకు డీజిల్‌ కోసం ఖర్చు చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వమే చెల్లిస్తున్నందున.. రాబడిలో నెలకు సగటున 125 కోట్లు అంటే 25% ప్రభుత్వానికి చేరుతుంది. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఈ మొత్తంలో నెలకు 25% ప్రభుత్వం వదులుకోవాలి. తిరిగి 125 కోట్ల వరకు ఆర్టీసీకే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.