కేఎస్.జవహర్… (KS. Jawahar) మాజీ మంత్రి. ఇప్పుడాయన పేరు చెబితేనే అంతెత్తున ఎగిరిపడుతోందట ఏపీలోని కొవ్వూరు టీడీపీ కేడర్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఆయనకు కొవ్వూరు టిక్కెట్ ఇవ్వొద్దని కుండబద్దలు కొట్టేస్తున్నారట. ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ(TDP) మూడు ముక్కలుగా విడిపోయింది. ఎన్నికలు దగ్గరపడుతున్నా… విభేదాలు మాత్రం తగ్గడం లేదు. పార్టీతో సంబంధం లేకుండా జవహర్ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పార్టీలోని ఓ సామాజిక వర్గం నేతలు.
జవహర్ మంత్రిగా ఉన్నప్పుడు పడ్డ అసమ్మతి బీజాలు ఇప్పుడు ఊడలు దిగాయి. 2019 ఎన్నికల్లో కూడా ఆయనకు టిక్కెట్ ఇవ్వవద్దంటూ అధిష్టానం మీద వత్తిడి తెచ్చారు స్థానిక నాయకులు. దీంతో తన స్వగ్రామమైన కృష్ణాజిల్లా తిరువూరుకు పంపారు. అక్కడ కూడా ఓడిపోవడంతో తిరిగి కొవ్వూరు మీదే దృష్టి పెట్టారు మాజీ మంత్రి. నియోజకవర్గంలోని వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని జవహర్‌ను రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడిగా నియమించింది పార్టీ. అలాగే కొవ్వూరులో విభేదాల పరిష్కారానికి ద్విసభ్య కమిటీని నియమించింది. దీంతో జవహర్ ప్రమేయం లేకుండానే ద్విసభ్య కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ కమిటీలోని సభ్యులు కూడా ఎడమొహం, పెడమొహంగా ఉండటం కేడర్‌కు మరింత ఆందోళన కలిగిస్తోంది.
కొవ్వూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. నాయకుల వర్గ విభేదాల వల్లే 2019 ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయింది. తరువాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో స్థానిక టీడీపీ నాయకులు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీతో లోపాయికార ఒప్పందంతో… ఏడు కౌన్సిలర్ పదవులను ఏకగ్రీవం చేసి చైర్మన్ పదవిని వైసీపీకి కట్టబెట్టారనే ఆరోపణలున్నాయి. దాంతో పార్టీ పగ్గాలు తమకు అప్పగించి ఉంటే… మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ పీఠాలను గెలిచేవారమని ప్రచారం చేస్తున్నారు జవహర్ వర్గీయులు.
ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా… టీడీపీలో విభేదాలు చల్లారడం లేదు. అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి .
తాజాగా కొవ్వూరులోని మాజీ మంత్రి వ్యతిరేక వర్గం అంతా రహస్యంగా సమావేశమై జవహర్ వైఖరిని తీవ్రంగా నిరసించింది. అదే సమయంలో ఆయనకు టికెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసినట్టు తెలిసింది. ఇటీవల నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలకు జవహర్ దూరంగా ఉండటాన్ని కూడా తప్పుపడుతున్నారట ఆయన వ్యతిరేక వర్గీయులు. అదే సమయంలో జవహర్… తన బర్త్‌డే వేడుకలను నియోజకవర్గంలో పెద్దఎత్తున జరుపుకోవడంపై ప్రత్యర్థి వర్గం గుర్రుగా ఉందట. కొన్ని గ్రామాల్లో జవహర్ ఫ్లెక్సీలు కట్టడాన్ని స్థానిక టిడిపి నేతలు వ్యతిరేకించారు.
ఈ పరిణామాలతో ఈసారి జవహర్‌కు టిక్కెట్ రాకుండా ఓ సామాజిక వర్గం నేతలు పైరవీలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు టిక్కెట్ ఇస్తారని అంటున్నారు. అదే నిజమైతే జవహర్‌ను గోపాలపురానికి పంపే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు జనసేన కొవ్వూరు ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో పొత్తులో భాగంగా ఈ టిక్కెట్‌ను జనసేనకు ఇస్తారా లేక టీడీపీనే పోటీ చేస్తుందా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే కొవ్వూరు టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది.