AP Elections Heat : అధికార పార్టీ ఎంతడిగితే అంత మందు… టీడీపీ, వైసీపీ నేతల పరేషాన్ !

ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. చాలా నియోజకవర్గాల్లో అధికార - ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశారు.

ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. చాలా నియోజకవర్గాల్లో అధికార – ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశారు. నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ రాకపోవడంతో ఇంకా ఊపందుకోలేదుగానీ… పూర్తి స్థాయిలో గేరప్‌ అయి ఉన్నాయి అన్ని పార్టీలు. అంత వరకు బాగానే ఉన్నా… విపక్షాలను ఇప్పుడో సమస్య టెన్షన్‌ పెడుతోందట. అదే మందు. ఎలక్షన్‌ అంటే మందు ఏరులైపారక తప్పని పరిస్థితి. ఈ సీజన్‌ని ఆసరా చేసుకుని మందులో మునకలేసే వాళ్లు ఉంటారంటే అతిశయోక్తి కాదు. మందు, ముక్క, లెక్క… ఈ మూడు లేకుండా ఎలక్షనీరింగ్‌ చేయడం సాధ్యమయ్యేపని కాదన్నది బహిరంగంగా అందరూ చెప్పుకునే మాటే. ఎన్నికల్లో మ్యాన్ పవన్.. మజిల్ పవర్.. మనీ పవరే కాదు.. లిక్కర్ పవర్ కూడా కీలకమే. మిగతా అన్ని రకాల పవర్స్‌ ఏదోలా సమకూర్చుకుంటున్న ప్రతిపక్షాలకు మద్యం దగ్గరికి వచ్చేసరికి మింగుడు పడటం లేదట. ఇంకా చెప్పాలంటే చేతులెత్తేయాల్సిన పరిస్థితి అంటున్నారు.

దీనికి ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులే కారణమంటున్నారు పరిశీలకులు. ఏపీలోని మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వం చేతుల్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2వేల934 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. అలాగే 810కు పైగా బార్లు ఉన్నాయి. ఇవి కాకుండా.. 500కు పైగా టూరిజం శాఖ పరిధిలోని వాకిన్ స్టోర్స్ ఉన్నాయి. అయితే వీటి నుంచి ఎన్నికల కోసం మద్యం తీసుకోవడం చాలా కష్టం. గతంలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మద్యం దుకాణాలు ఉండేవి. అప్పుడు ఎవరి అవసరాలకు తగ్గట్టు వారిసి సప్లై ఉండేది. కానీ ఇప్పుడు అన్నీ మద్యం షాపులు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. దీంతో మద్యం దుకాణాలకు ముందుగా చెల్లింపులు చేసుకుని స్టాక్‌ తెప్పించుకోవడం చాలా కష్టమన్న వాదన బలంగా ఉంది.

ఆ విషయంలో అధికార పార్టీ సభ్యులకు వెసులుబాటు ఎక్కువ ఉంటుందని, ఇంకా మాట్లాడుకుంటే.. వాళ్ళకసలు అది ఇబ్బందే కాదని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. ముందు ముందు రాబోయే మందు కష్టాల్ని తల్చుకుంటే అంతా అగమ్యగోచరంగా ఉందంటున్నారు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు. మద్యం దుకాణాలు.. ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి కాబట్టి.. అధికార పార్టీ సభ్యులకు అవసరానికి మించి అందుబాటులో ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో మా సంగతేంటన్న ఆందోళన ఆందోళన టీడీపీ-జనసేన (TDP-Jana Sena) వర్గాల్లో కన్పిస్తోందట.ఈ క్రమంలో పొరుగు రాష్ట్రాల నుంచి మందు తెప్పించుకునే దిశగా కొందరు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ (Telangana), కర్ణాటక (Karnataka) నుంచి మద్యం తెప్పించుకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఒకవేళ ఆ విధంగా ప్రయత్నించినా.. ఇతర రాష్ట్రాల నుంచి లోడ్లకు లోడ్లు తెప్పించడం, వాటిని చెక్ పోస్టులు దాటించడం అంత ఈజీ మేటర్‌ కాదంటున్నారు.

దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఉన్నట్టు తెలిసింది. కావాల్సినంత మందు పంచకుంటే… ఆ ప్రభావం ఎన్నికల్లో వ్యతిరేక ప్రభావం చూపుతుందేమోనని తెగ టెన్షన్‌ పడుతున్నారట విపక్ష అభ్యర్థులు. కుర్రోళ్ళకి బళ్లల్లో పెట్రోల్ పోయకుండా, మందు బాటిల్‌ ఇవ్వకుండా ఎన్నికల నిర్వహణ కష్టమన్న పరిస్థితి వచ్చేసింది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు మద్యం అందుబాటులో లేకపోవడంతో నానా తిప్పలు పడుతున్నారట.

ఈ క్రమంలోనే టీడీపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో మద్యం ప్రభావం తగ్గించాలంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పోలింగ్‌ బూత్‌లోకి వెళ్ళే ముందు ప్రతి ఓటరుకు బ్రీత్ ఎనాలసిస్ టెస్టులు చేయాలని.. సూచించారు పిటిషనర్. ఇదేదో నిజంగానే అమలు చేస్తే బాగుంటుంది కదా అని సరదాగా అంటున్నారు టీడీపీ (TDP) నేతలు. మీ కష్టాలు పగోళ్ళకి కూడా రాకూడదురా నాయనా అన్న సెటైర్స్‌ కూడా పడుతున్నాయి. ప్రతిపక్షాల మందు కష్టాలు ఎలా తీరతాయో చూడాలి మరి