BOGUS SURVEYS : రోజుకో నకిలీ సర్వే …. బెట్టింగ్ మాఫియా సృష్టేనా?

ఏపీ (AP) లో పోలింగ్ అయిపోయిన రెండో క్షణం అసలైన అంకం మొదలైంది. ఇది చాలామంది సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు. పోలింగ్ (polling) రోజు కొందరు పదో పరకో తీసుకొని ఓటేస్తారు. ఇంకొందరు నిజాయితీగా ఓటేసి వస్తారు.

ఏపీ (AP) లో పోలింగ్ అయిపోయిన రెండో క్షణం అసలైన అంకం మొదలైంది. ఇది చాలామంది సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు. పోలింగ్ (polling) రోజు కొందరు పదో పరకో తీసుకొని ఓటేస్తారు. ఇంకొందరు నిజాయితీగా ఓటేసి వస్తారు. కానీ వీళ్ళు ఎవరికీ తెలియని వేల కోట్ల బెట్టింగ్ సామ్రాజ్యం… ఎన్నికలకు సమాంతరంగా నడుస్తోంది. రిక్షా పుల్లర్ దగ్గర నుంచి… మంత్రులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు చివరికి కాలేజీ కుర్రాళ్ళు… ఒకరేంటి లక్షల మంది ఈ బెట్టింగ్ ఊబిలో కూరుకు పోయారు.

పది మంది బాగుపడితే 90 మంది బెట్టింగ్ వల్ల నాశనం అవుతుంటారు. ఇప్పుడు ఏపీలో ఎన్నికల (AP Elections) బెట్టింగ్ జోరు భీకరంగా నడుస్తోంది. నానాటికి జనంలో పెరుగుతున్న పందేల పిచ్చిని క్యాష్ చేసుకోవడానికి ముంబై సత్తా మార్కెట్ నుంచి చిన్నచిన్న గ్రామాల వరకు బెట్టింగ్ మాఫియా విస్తరించింది. అందుకే బెట్టింగ్ ముఠాలే రకరకాల సర్వేలు చేస్తూ…సర్వేలు సృష్టిస్తూ జనాన్ని ఆకర్షిస్తూ…. అటు, ఇటు, ఆపార్టీకి… ఈపార్టీకి జనంతో బెట్టింగులు వేయిస్తున్నాయి. దుర్మార్గం ఏంటంటే ఈ బెట్టింగ్ మాఫియావెనుక రాజకీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎన్నికల్లో పెట్టిన డబ్బుని మొత్తం వెనక్కి తెచ్చుకోవడానికి రాజకీయ నాయకులు, చోటా మోటా లీడర్లు బెట్టింగ్ మాఫియాని నడుపుతున్నారు. అందుకోసం రకరకాల సర్వేలను వాళ్ళే సృష్టిస్తున్నారు. అందుకే ఏపీలో నాయకులే మా పార్టీ గెలుస్తుంది అంటే… మా పార్టీ గెలుస్తుందని సర్వేలు విడుదల చేస్తున్నారు. ఒక్కో సర్వే ఒక్కో రకంగా చెప్తోంది. ఒక సర్వే వైసిపి 110 సీట్లతో గెలుస్తుందని కుండ బద్దలు కొట్టినట్లు ప్రకటించింది. మరో సర్వే ఆరు నూరైనా టీడీపీ సారధ్యంలోని NDA అధికారంలోకి వస్తుందని అంటోంది. చివరికి సామాన్య జనం ఒక్కొక్కరు ఒక్కొక్క సర్వేని నమ్మి డబ్బులు పెట్టి, వేల రూపాయలు అప్పులు చేసి… బెట్టింగులు కట్టి కుప్పకూలిపోవడానికి సిద్ధమవుతున్నారు.

నిజానికి బెట్టింగులు కూడా నిర్వహిస్తోంది రాజకీయ పార్టీలు (Political parties), పొలిటికల్ లీడర్లే. మొన్నటి ఎలక్షన్ లో పోగొట్టుకున్న డబ్బులు మొత్తం మళ్లీ వెనక్కి తెచ్చుకోవడానికి పొలిటికల్ లీడర్లే కొన్ని బోగస్ సర్వేలు సృష్టించి… వాటిని టీవీ ఛానళ్ళలోనూ… యూట్యూబ్ ఛానల్స్ లోనూ డబ్బులు ఇచ్చి ప్రసారం చేయించి… జనంతో బెట్టింగ్స్ వేయిస్తున్నారు. జూన్ 1 సాయంత్రం 6 వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్, సర్వేలు ప్రసారం చేయకూడదు. ప్రకటించకూడదు. కానీ ఈ నియమాలన్నీ పేపర్లు, శాటిలైట్ చానల్స్, యూట్యూబ్ ఛానల్స్ తుంగలో తొక్కేసేయ్. కొందరు పరోక్షంగా ఆ పార్టీ గెలుస్తుందని ఈ పార్టీ ఓడిపోతుందని చెప్పేస్తుంటే. మరికొందరు వి డోంట్ కేర్ అని బహిరంగంగానే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేశారు. దీనికి ప్రధాన కారణం ఈ సర్వే రిపోర్టులను చూపించి… బెట్టింగులు వేయించటమే. కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు, చానల్స్ పేరిట సర్వేలు ముద్రించి వాటినే వాట్సాప్ ల్లో సర్క్యులేట్ చేస్తూ బెట్టింగులు కాయిస్తున్నారు. బెట్టింగ్ మాఫియా ఆడుతున్న ఈ దుర్మార్గపు ఆటలో మోసపోయిన వాళ్లు జూన్ 4 తర్వాత అన్యాయంగా రోడ్డున పడిపోతారు. కొందరు బలవంతపు చావులను కూడా ఆశ్రయిస్తారు. అసలు సర్వే అంటే ఏంటో, శాంపిల్ సైజు ఎంత తీసుకోవాలో… రెండున్నర లక్షలు మంది ఓటర్లు ఉన్న ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వే ఎలా చేయాలో… ఎలాంటి ఓనమాలు తెలియని వాళ్ళు కూడా సర్వే చేశాం.. ఫలానా పార్టీ ఇన్ని సీట్లతో గెలుస్తోంది అని ఒక లెటర్ హెడ్ మీద ప్రింట్ చేసి వాట్సప్ లో వదిలేస్తున్నారు.

అది నిజమని నమ్మి చాలామంది దారుణంగా మోసపోతున్నారు. జూన్ ఒకటి సాయంత్రం చాలా మీడియా సంస్థలు ఇవ్వబోతున్న సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ కూడా ఇలాంటివే. ఇవి బెట్టింగ్స్ ని టార్గెట్ చేసుకుని తయారు చేసినవే. వీటి వెనక పక్కాగా పొలిటికల్ పార్టీలు, రాజకీయ నాయకులే ఉన్నారు. ఎన్నికలు అయిపోయాక రిజల్ట్స్ వచ్చే లోపు 20 రోజుల్లో నడిచే వేల కోట్ల వ్యాపారం ఇది. సర్వేలు సృష్టించి వాటి మాయలో జనాన్ని, పాలిటిక్స్ అంటే పడి చచ్చే కుర్ర కారును ముంచేసే కుట్ర చేస్తున్నాయి ఈ బెట్టింగ్ ముఠాలు. కొందరు రాష్ట్రస్థాయి నాయకులు కూడా తమ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని, ఈ ప్రాంతంలో అన్ని సీట్లు గెలవబోతున్నామనీ… ఆ ప్రాంతంలో ఇన్ని సీట్లు గెలవబోతున్నామనీ ముందే ప్రెస్ మీట్ లు పెట్టి ప్రకటించడం వెనక ఉన్న అసలు కుట్ర ఇదే.

ఆ నాయకుల మాటలు నమ్మి… బెట్టింగు రాయుళ్లు చాలామంది ఆస్తులు అమ్మి, పొలాలు తాకట్టు పెట్టి, చివరికి పెళ్ళాం మెడలో పుస్తెలు కూడా అమ్మి బెట్టింగ్స్ లో పెడుతున్నారు. లోక్ సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) సందర్భంగా కనీసంలో కనీసం 4 వేల కోట్ల రూపాయల బెట్టింగులు చేతులు మారతాయి. ఈ బోగస్ సర్వేలను నమ్మి… బెట్టింగులు పెట్టి ఆడ మగతో పాటు కుర్ర కారు కూడా బ్రష్టు పట్టిపోయే పరిస్థితి వచ్చింది. అందువల్ల ఈ నకిలీ సర్వేలు నమ్మి, లేదా రేపు జూన్ ఒకటి సాయంత్రం చానల్స్ లో, పత్రికల్లో ఎగ్జిట్ పోల్స్ చూసి వాటి ఆధారంగా, వాటిని నమ్మి డబ్బులు పెట్టి బెట్టింగులు వేశారా… మీ జీవితాలు సంక నాకపోయినట్లే. ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లే, నిన్న మొన్నటి వరకు బరిలో ఉన్న పార్టీలే, లీడర్లే తిరిగి సర్వేల పేరుతో జనాన్ని మోసం చేసి, బెట్టింగులు కాయించి దోచుకోబోతున్నారన్న విషయాన్ని గుర్తించండి.