YCP PALACES : అప్పనంగా కొట్టేశారు.. వైసీపీ రాజమహళ్ళకి కోట్లు ఖర్చు

ఏపీ మాజీ సీఎం జగన్ కి బెంగళూరులో ఒకటి... హైదరాబాద్ లో ఇంకోటి... తాడేపల్లిలో మరోటి... ఇలా మూడు చోట్ల విశాలమైన రాజప్రాసాదాలు ఉన్నాయి. ఇవి చాలవన్నట్టు వైసీపీ ఆఫీసులను కూడా ఇలాంటి రాజప్రాసాదాలను కట్టిస్తున్నారు.

 

ఏపీ మాజీ సీఎం జగన్ కి బెంగళూరులో ఒకటి… హైదరాబాద్ లో ఇంకోటి… తాడేపల్లిలో మరోటి… ఇలా మూడు చోట్ల విశాలమైన రాజప్రాసాదాలు ఉన్నాయి. ఇవి చాలవన్నట్టు వైసీపీ ఆఫీసులను కూడా ఇలాంటి రాజప్రాసాదాలను కట్టిస్తున్నారు. ఏపీలో 26 జిల్లాల్లో కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ భవంతులు చూసి జనం ఆశ్చర్య పోతున్నారు. జగన్ హయాంలో తమ పార్టీ ఆఫీసుల కోసమని 33 యేళ్ళ పాటు ప్రభుత్వ భూముల్ని ఏడాదికి ఎకరానికి వెయ్యి రూపాయలకే లీజుకు తీసుకున్నారు. 30యేళ్ళు అధికారంలో ఉంటాం… ఆ మాత్రం రాజమహల్స్ ఉంటే తప్పేంటి… అని సమర్థించుకుంటున్నారు వైసీపీ లీడర్లు. ఈ 26 ప్రాంతాల్లో కట్టిన వైసీపీ మహల్స్ కి చెందిన ప్రభుత్వ భూమి చాలా ఖరీదైనది. కారు చౌకగా కొట్టేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 42 యేళ్ళు అనుభవం ఉన్న టీడీపీకి కనీసం 4 జిల్లాల్లో కూడా ఇలాంటి ఆఫీసులు కట్టుకోలేకపోయింది.

ఏపీలోని పుట్టపర్తిలో ఎయిర్ పోర్ట్ ఎదురుగా ఏ అనుమతులు తీసుకోకుండా కడుతున్న వైసీపీ ప్యాలెస్ ఇది. ఇక్కడ 20 కోట్ల ప్రభుత్వ భూమిని ఆ పార్టీకి అప్పనంగా ఇచ్చేశారు. 2 ఎకరాల్లో ప్యాలెస్ నిర్మాణం జరిగింది. ఇది నెల్లూరు జిల్లాలో కడుతున్న మరో ప్యాలెస్. గతంలో టీడీపీ ప్రభుత్వం పేదల టిడ్కో ఇళ్ళ కోసం ఇచ్చిన స్థలాన్ని కొట్టేసింది వైసీపీ. 10 కోట్ల విలువైన స్థలాన్ని ఏడాదికి ఎకరానికి వెయ్యి రూపాయల రెంట్ కి 33 యేళ్ళకి రాయించేసుకున్నారు. అనంతపురంలోని HLP కాలనీలో ఇరిగేషన్ భూమిని… ఆ శాఖ అనుమతి లేకుండా వైసీపీకి ఇచ్చేశారు. అక్కడ రాజమహల్ నిర్మాణం జరుగుతోంది. రాజమండ్రిలో 2ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ మహల్… రోడ్లు భవనాల శాఖకు చెందినది. 2023 మేలో చదును చేసి పనులు ప్రారంభించారు. దీనికి కూడా ఎలాంటి అనుమతుల్లేవు. శ్రీకాకుళం జిల్లాలో పెద్దపాడులో ఒకటిన్నర ఎకరాల్లో నేషనల్ హైవేకి పక్కనే వైసీపీ రాజభవనం కడుతున్నారు.

ఇది మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటికి దగ్గర్లోనే ఉంది. 2 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఇది. అప్పనంగా కొట్టేశారు. ఇక నెల్లూరు అర్భన్ పరిధిలో వెంకటేశ్వరపురం దగ్గర్లో టిడ్కో ఇళ్ళ నిర్మాణానికి గతంలో టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూమిని వైసీపీ ఆఫీసుకు ఇచ్చేశారు. పేదల ఇళ్ళ కంటే జగనన్న ప్యాలెస్ ఎక్కువగా అన్నట్టుంది పరిస్థితి. ఇక్కడి భూమి విలువ 10 కోట్ల రూపాయలు ఉంటుంది. కృష్ణా జిల్లాకు సంబంధించిన వైసీపీ ఆఫీసును మచిలీపట్నంలో నిర్మిస్తున్నారు. అత్యంత రద్దీగా ఉండే జిల్లా కోర్టు సెంటర్ లో 60 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని వైసీపీ కబ్జా పెట్టేసింది. 2 ఎకరాల స్థలంలో వైసీపీ రాజమహల్ ఆల్రెడీ కట్టేశారు కూడా.

అనకాపల్లిలో గతంలో కాపు భవనానికి కేటాయించిన స్థలంలో వైసీపీ బిల్డింగ్ నిర్మించారు. ఈ భూమి విలువ 15 కోట్ల రూపాయలు. స్థానికులు, కాపు నేతలు ఎంత వ్యతిరేకించినా డోన్ట్ కేర్ అంటూ వైసీపీ ఆఫీసు బిల్డింగ్ కట్టేశారు. దీనికి కూడా ఎలాంటి అనుమతులు లేవు. విశాఖలో వైసీపీ భవనానికి కేటాయించిన భూమి విలువ చెబితే కళ్ళు తిరుగుతయ్. ఇక్కడ 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని వైసీపీ కబ్జాపెట్టేసింది. ఎండాడలో ఉన్న ఈ బిల్డింగ్ కి వెళ్ళేందుకు వీలుగా లా కాలేజీ రోడ్డును 80 అడుగుల నుంచి వంద అడుగులకు విస్తరించారు.
ఇలా జిల్లాల్లో ఎక్కడ చూసినా రాజప్రాసాదాల్లాంటి భవనాలు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

రుషికొండలో తన కుటుంబం కోసం 450 కోట్లతో బిల్డింగ్ కట్టించుకున్న జగన్… పార్టీ ఆఫీసులకు కూడా ప్రభుత్వ భూమిని తేరగా కొట్టేసి భవనాలు నిర్మిస్తున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దేశంలోనే బీజేపీ, కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలు కూడా ఇంత ఖరీదైన భవనాలను నిర్మించుకోలేదని అంటున్నారు. ఒక ప్రాంతీయ పార్టీకి ఇంత విలువైన స్థలాలు… రాజమహళ్ళు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. పైగా పేదలకు ఇళ్ళు కట్టించే స్థలాలను కూడా జగన్ లాగేసుకొని… వైసీపీ ఆఫీసులకు కేటాయించడంపై మండిపడుతున్నారు.