AP Politics : ఇదేంది ఇది… భార్య ఓ పార్టీ… భర్త మరో పార్టీ… ఆ ఇంట్లో విచిత్ర రాజకీయం !

విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైసీపీ (YCP)లో విచిత్రమైన రాజకీయం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మధ్య వర్గ పోరు తారా స్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని ఎమ్మెల్సీ పట్టు పట్టినా... వైసీపీ అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో రఘురాజు భార్య సుధారాణి (Sudharani), ఆయన అనుచరులు టీడీపీకి టచ్‌లోకి వెళ్ళారు. రఘురాజు వెరైటీగా తాను వైసీపీలో ఉంటూ... భార్యను, అనుచరుల్ని టీడీపీలోకి పంపే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదెక్కడి విడ్డూరంరా.. బాబూ... అని నోళ్ళు నొక్కుకుంటున్నారు ఈ వ్యవహారం చూస్తున్నవారు.

విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైసీపీ (YCP)లో విచిత్రమైన రాజకీయం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మధ్య వర్గ పోరు తారా స్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని ఎమ్మెల్సీ పట్టు పట్టినా… వైసీపీ అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో రఘురాజు భార్య సుధారాణి (Sudharani), ఆయన అనుచరులు టీడీపీకి టచ్‌లోకి వెళ్ళారు. రఘురాజు వెరైటీగా తాను వైసీపీలో ఉంటూ… భార్యను, అనుచరుల్ని టీడీపీలోకి పంపే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదెక్కడి విడ్డూరంరా.. బాబూ… అని నోళ్ళు నొక్కుకుంటున్నారు ఈ వ్యవహారం చూస్తున్నవారు.

తండ్రీ కొడుకులు వేరువేరు పార్టీల్లో ఉండటం చూశాంకానీ…ఒకే ఇంట్లో ఉండే భార్యా భర్తలు ఇలా ప్రత్యర్థి పార్టీల్లో ఉండి ఏం సందేశం పంపాలనుకుంటున్నారన్న చర్చ సైతం జరుగుతోంది. ఇటు ఎస్‌.కోట టీడీపీ (TDP) కేడర్‌ సైతం రఘురాజు అనుచరులు, సుధారాణి రాకను వ్యతిరేకిస్తున్నారట. వాస్తవానికి రఘురాజుకి పార్టీలు మారడం, నమ్మిన వారిని నట్టేట ముంచడం కొత్తేమీ కాదన్నది లోకల్‌ టాక్‌. ఏ పార్టీలో ఉన్నా పవర్ పాలిటిక్స్ (Power politics) చేయడం ఆయనకు పరిపాటి అంటున్నారు. రఘు రాజుకి 2009 లో కాంగ్రెస్ (Congress) టికెట్ ప్రకటించి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వెనక్కి తీసుకుంది. దీంతో రెబల్‌గా పోటీ చేసి కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాడనే ఆరోపణలున్నాయి. 2014 లో కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా మనోడి పనితనం వల్లే ఓడిపోయారన్న అభిప్రాయం ఉంది. ఓడిన వెంటనే కాంగ్రెస్ కండువా మార్చేసి బీజేపీ (BJP) లోకి జంప్ అయ్యారాయన. పోనీ… అక్కడన్నా నిలకడగా ఉన్నాడా…అదీ లేదు. కాషాయ కండువాను విసిరేసి చల్లగా ఫ్యాన్‌ కిందికి చేరిపోయారు. అందుకోసం అప్పట్లో గట్టిగానే ముట్టిందని చెప్పుకుంటారు స్థానికులు.

ఇక 2019 ఎన్నికల్లో కడుబండి శ్రీనివాసరావుకు సహకరించాలని పార్టీ ఆదేశించడంతో పోటీకి దూరంగా ఉండి కడుబండికి సహకరించారు రఘురాజు. అప్పుడు కూడా తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తేనే… అంటూ కండిషన్ పెట్టినట్టు తెలిసింది. మొత్తంగా ఇటు శృంగవరపుకోట లోనూ, అటు రాష్ట్రంలోనూ వైసీపీ అధికారంలోకి రావడంతో రఘురాజుకు కూడా ఎమ్మెల్సీ పదవి దక్కింది. రఘురాజుకు తన గురువు, మంత్రి బొత్సా ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో పదవి కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదంటారు. పదవి వచ్చిన మొదటి ఏడాది బాగానే ఉన్నా.. తర్వాత ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు, రఘురాజు కు మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. రఘు రాజు సూచించిన కొన్ని పనులను ఎమ్మెల్యే చేయడం లేదని, అందుకే ఆయనకు వ్యతిరేకంగా పావులు కదపడం మొదలు పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. చివరికి కడుబండిని మార్చాలని, లేదంటే ఓడిస్తామంటున్నారని రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయి.

ఇది కూడా బ్లాక్ మెయిల్ రాజకీయమేనని చెబుతోంది పార్టీ కేడర్‌. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేసి పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారట రఘురాజు. ఇలాంటి వ్యవహారాలతో పార్టీలో ఆయన పలుచన అయ్యారన్న అభిప్రాయం బలంగా ఉంది. చివరికి ఎవరూ తన మాట పట్టించుకోలేదన్న అసహనంతో ఒక అడుగు ముందుకు వేసి తాను వైసీపీలోనే కొనసాగుతూ తన భార్య సుధారాణిని, అనుచర గణాన్ని టీడీపీలోకి పంపారని, ఇది కూడా ఒక రకంగా వైసీపీని బెదిరించడమేనన్న టాక్‌ నియోజకవర్గంలో ఉంది. ఈ పరిణామంతో ఒక్క సారిగా శృంగవరపుకోట వైసీపీలో రాజకీయం హీటెక్కింది. అయితే రఘు రాజు వర్గం పార్టీని వీడటమే మంచిదని, ఆయన కూడా వెళ్ళిపోతే ఇంకా మంచిదని అంటున్నారు స్థానిక వైసీపీ నాయకులు. అలాంటి వాళ్ళు పార్టీలో ఉంటేనే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందన్న చర్చ నడుస్తోంది.

పార్టీ కోసం కాకుండా సొంత ప్యాకేజీలు, పవర్ కోసం రాజకీయాలు చేసే రఘురాజు తమకు అవసరం లేదంటున్నారు నియోజకవర్గ వైసీపీ నాయకులు. మరోవైపు టీడీపీ శ్రేణుల్లో కూడా అదే తరహా చర్చ జరుగుతోంది. రఘురాజు వ్యవహార శైలి సరిగా ఉండదని, ఎక్కడ ఉన్నా తలనొప్పేనని,అలాంటి వ్యక్తి టీడీపీలోకి వచ్చినా తమకే ఇబ్బందన్న చర్చ జరుగుతోంది సైకిల్‌ పార్టీలో. ఈ భార్యాభర్తల కుమ్మక్కు రాజకీయాన్ని రెండు పార్టీల అధినాయకత్వాలు ఎలా డీల్‌ చేస్తాయోనన్న ఆసక్తి స్థానికంగా పెరుగుతోంది.