ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం తర్వాత… ఎక్కువ చర్చ జరిగింది ఉండి గురించే ! అప్పటికే ప్రకటించిన అభ్యర్థిని పక్కన పెట్టి మరీ.. రఘురామకు చంద్రబాబు అవకాశం ఇవ్వడం.. టీడీపీ రెబెల్ అభ్యర్థి శివరామరాజు పోటీ చేయడం.. ఆయనకు వైసీపీ (YCP) సపోర్ట్ ఇచ్చిందనే ప్రచారం జరగడంతో.. ఉండిలో ఫలితం ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి కనిపించింది. ఐతే వార్ వన్ సైడ్ అన్నట్లు రఘురామ.. ఈజీ విక్టరీ కొట్టేశారు. భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఇప్పుడు ఏపీలో కూటమి సర్కార్ (AP Alliance) కొలువుదీరింది. రఘురామకు (Raghurama) హోం శాఖ (Home Department) ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. అదే నిజం అయితే.. రాజకీయం మరో రేంజ్ ఉండే చాన్స్ ఉంది. రఘురామకు హోం అనే ప్రచారంతో.. టైగర్‌కు టైమొచ్చింది అంటూ.. రఘురామ అభిమానులు సోషల్ మీడియాలో హడావుడి మొదలుపెట్టేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ.. ఆ తర్వాత ఆ పార్టీకి ఎదురు తిరిగారు. సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ సాధించారు. ఐతే వైసీపీ మీద, జగన్ మీద పీకల దాకా పగ పెంచుకున్న రఘురామ.. కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అయ్యారు.
వైసీపీ ప్రభుత్వం (YCP Govt) లో తనపై తప్పుడు కేసు బనాయించి హింసించారంటూ.. మాజీ సీఎం జగన్, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌తో పాటు ఇతర అధికారులపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్ సర్కార్‌లో తనపై సీఐడీ అధికారులు దాడి చేశారని.. రఘురామ గతంలో చాలాసార్లు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా రిలీజ్ చేసారు. తనపై హత్యాయత్నంతో పాటు కస్టడీలో తనను తీవ్రంగా హింసించారంటూ ఫిర్యాదులో తెలిపారు. సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ అప్పట్లో ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిరిగినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఐతే ఇప్పుడు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. కేంద్ర పెద్దలతోనూ తనకు సత్సంబంధాలు ఉన్నాయని రఘురామ చెప్పుకుంటారు. దీంతో తన పగ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని రఘురామ భావిస్తున్నారు.