YS Jagan Delhi Politics : ఢిల్లీలో ఊహించని మద్దతు… జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా?

ఏపీలో వైసిపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, వరస హత్యలను జాతీయస్థాయిలో అందరి దృష్టిలో పెట్టేందుకు ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ చేసిన నిరసన దీక్ష అనూహ్యంగా సక్సెస్ అయింది.

ఏపీలో వైసిపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, వరస హత్యలను జాతీయస్థాయిలో అందరి దృష్టిలో పెట్టేందుకు ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ చేసిన నిరసన దీక్ష అనూహ్యంగా సక్సెస్ అయింది. అన్నిటికీ మించి ఇండియా కూటమిలో కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీల మద్దతు జగన్ దీక్షకు లభించింది. ఇండియా కూటమిలో జాతీయ నాయకులు వైసీపీకి సంఘీభావం ప్రకటించడం చూస్తే భవిష్యత్తులో జగన్ ఇండియా కూటమి వైపు వెళ్తారా అనే సందేహం రాక మానదు.

వైసీపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ… పార్టీ అధినేత జగన్ చేసిన దీక్ష కు జాతీయస్థాయిలో పెద్దగా స్పందన రాకపోవచ్చని అందరూ ఊహించారు. ముఖ్యంగా టిడిపి ఈ విషయంలో జగన్ ని తక్కువ అంచనా వేసింది. కానీ ఊహించని విధంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టగలిగారు జగన్. వైసిపి చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి నేతల మద్దతు ప్రకటించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ధర్నాలో సమాజ్ వాది పార్టీ, తృణమూల్, శివసేన, అన్నాడీఎంకే సిపిఎం , ఆప్ తో పాటు మరికొన్ని పార్టీల నేతలు పాల్గొని వైసీపీకి మద్దతు పలికారు. ఉద్ధవ్ శివసేన ఎంపీలు ప్రియాంక చతుర్వేది, సంజయ్ రౌత్, అన్నా డీఎంకే ఎంపీ తంబి దొరై, టీఎంసీ ఎంపీ నదీ ముల్హక్, సమాజ్ వాది పార్టీ ఎంపీ గోపాల్ యాదవ్, ముస్లిం లీగ్ ఎంపీ మహబ్ తదితరులు జగన్కు మద్దతుగా నిలిచారు.

జగన్ పోరాటానికి ఇండియా కూటమి మద్దతు ఉంటుందని వాళ్ళు చెప్పడం మరింత ఆసక్తిగా మారింది. అయితే కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం జగన్ ధర్నాకు దూరంగా ఉంది. వాస్తవానికి జగన్ ఏ కూటమికి దగ్గరగా లేడు. ఎప్పుడూ ఒంటరిగానే పోటీ చేస్తూ వచ్చాడు. అయితే గడిచిన 5 ఏళ్లలో బిజెపికి సన్నిహితంగా వ్యవహరిస్తూ, పార్లమెంట్లో అవసరమైనప్పుడల్లా అన్ని బిల్లులకు సపోర్ట్ ఇచ్చాడు. ఇటీవల స్పీకర్ ఎన్నిక సమయంలోను ఎన్డీఏ కి మద్దతు ఇచ్చింది వైసిపి. కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టిన దగ్గర నుంచి ఏనాడు ఆ పార్టీకి దగ్గర అవ్వాలని జగన్ ప్రయత్నించలేదు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి గా పోటీ చేసినప్పుడు మాత్రం, ప్రణబ్ తో ఉన్న వ్యక్తిగత సంబంధాలు రీత్యా ఆయనకు మద్దతు పలికింది వైసిపి. నేరుగా సంబంధాలు లేకపోయినా, ఎన్డీఏ లో భాగం కాకపోయినా ఇన్ని రోజులు బిజెపితో స్నేహంగా ఉండటమే కాక, అవసరమైన ప్రతిసారి పార్లమెంట్లో మద్దతు ఇస్తూనే వచ్చింది వైసిపి.

ఇప్పుడు మాత్రం జగన్ ధర్నాకి బిజెపి తో పాటు ఎన్డీఏ స్వామి పక్షాలన్నీ దూరంగా ఉన్నాయి. ఇండియా కూటమిలో కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు జగన్కు మద్దతు పలికాయి. దీనిపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో జగన్ ఇండియా కూటమిలో చేరే అవకాశం ఉందా అనే కోణంలో పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. జగన్ ఇండియా కూటమికి రావడానికి కాంగ్రెస్ అంగీకరించకపోయినా … మిగిలిన పార్టీలన్నీ కాంగ్రెస్ ను ఒత్తిడి చేసే అవకాశం ఉంది. నిజానికి ఏపీలో జగన్ చెల్లెలు షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఎన్నికల్లో గెలవకపోయినా షర్మిల వ్యక్తిగత పోరాటంతో జగన్ ని దారుణంగా దెబ్బతీశారు. ఎన్నికల అయిన తర్వాత కూడా జగన్ని మాటలతో చీల్చి చెండాడుతున్నారు. రేపు జగన్ ఇండియా కుటుంబంలో కలిస్తే షర్మిల జగన్ కలిసి పని చేస్తారా? అది సాధ్యమేనా? అనే చర్చ కూడా మొదలైపోయింది. బిజెపి జగన్నీ దూరం పెడుతున్నప్పుడు. ఒక కూటమి సహకారం కోసం ఇష్టం ఉన్నా లేకపోయినా జగన్ ఇండియా కూటమికి దగ్గర కాక తప్పదు.

2029లో కేంద్రంలో నాలుగోసారి బిజెపి, మోడీ అధికారంలోకి రావడం చాలా కష్టం. 2024 లోనే అతి కష్టం మీద బిజెపి గట్టెక్కింది. 2029లో నాలుగోసారి అంటే అంత సులువు కాకపోవచ్చు. కాంగ్రెస్ కి, ఇండియా కూటమి పార్టీలకు 2024లో అవకాశాలు మెరుగయ్యే ఛాన్స్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పటినుంచి ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా అనే అనుమానం రాక మానదు. ఎలాగూ ఐదేళ్లు అధికారం లేకుండా ఉండాల్సిందే.2029లో తిరిగి పవర్ లోకి వచ్చి ఇండియా కూటమి లోపల నుంచి గాని, లేదా బయటనుంచి గాని సహకరిస్తూ రాజకీయ మనుగడ కాపాడుకోవడమే జగన్ ముందున్న ఆప్షన్. దానికి ఢిల్లీ ధర్నాతో పునాది పడినట్లు అయింది. అంతేకాదు మరోరకంగా బిజెపికి జగన్ వైపు నుంచి ఇది ఒక చిన్న సైజు వార్నింగ్ కూడా. భవిష్యత్తులో బిజెపి, ఎన్డీఏ జగన్ కు ఏ రకమైన సహకారం ఇవ్వకుండా, మళ్లీ కేసులన్నిటిని తిరగతోడితేజగన్ కు మరో ఆప్షన్ ఉండదు. ఇండియా కూటమికి దగ్గరగా వెళ్లి రాజకీయం చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితులన్నీ గమనిస్తూ ఖాళీగా చేతులు కట్టుకొని ఏమీ ఉండడు. జగన్ పై ఉన్న కేసులన్నీ తిరగ తోడాలనికేంద్రంపై ఒత్తిడి తేక మానడు. అదే జరిగితే జగన్ తన భేషజాలను అన్ని పక్కన పెట్టి ఇండియా కూటమితో పరోక్షంగానో ప్రత్యక్షంగానో కలిసి పని చేయాల్సిందే.