ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట… అక్కడే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని గతంలో చెప్పుకునేవారు. కానీ 2019 నుంచి ఉత్తరాంధ్రలో టీడీపీ గ్రాఫ్ మెల్లగా తగ్గుతోంది. గతంలో వైసీపీ మొత్తం 34 అసెంబ్లీ స్థానాల్ 28 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఫ్యాన్ గాలి బాగానే వీచింది.
ఉత్తరాంధ్రలో నాలుగేళ్ళయినా టీడీపీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదని అంటున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 34 సీట్లల్లో తొమ్మిది అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లను బీజేపీ, జనసేన పార్టీలకు ఇచ్చేసింది తెలుగుదేశం. ఈ నియోజకవర్గాల్లో టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ ఎన్నికల్లో రెబల్స్ గా దిగుతామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇదే టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ టిక్కెట్ కోసం పట్టుబడుతున్నారు. ఇక్కడ మామిడి గోవిందరావుకి అధిష్టానం టిక్కెట్ ఇచ్చింది. కలమట మాత్రం తనకే టిక్కెట్ కావాలంటూ ప్రతి రోజూ బలప్రదర్శనకు దిగుతున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో అధిష్టానం మాట్లాడింది. కానీ తమకు టిక్కెట్ ఇవ్వకపోతే నామినేషన్ వేయాలని గుండ కుటుంబం గట్టిగా డిసైడ్ అయింది. పాలకొండలోనూ రెబల్స్ పోరు తప్పట్లేదు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గజపతి నగరం సీటుపై టీడీపీ నేతల మధ్య అస్సలు రాజీ కుదరడం లేదు. ఇక్కడ కొండపల్లి అప్పలనాయుడు, కొండపల్లి శ్రీనివాస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. శ్రీనివాస్ కి టిక్కెట్ ఇవ్వడాన్ని అప్పలనాయుడు వర్గం ఒప్పుకోవట్లేదు.
విజయనగరం అసెంబ్లీ సీటును ఆశిస్తున్న టీడీపీ మహిళా నాయకురాలు మీసాల గీత కూడా రెబల్ గా పోటీకి డిసైడ్ అయ్యారు. తూర్పు కాపులు, బీసీలు ఎక్కువగా ఉన్న ఈ సీటును తమకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నిస్తోంది గీత వర్గం. నెల్లిమర్ల టిక్కెట్ జనసేనకు వెళ్ళింది. దాంతో ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు రెబల్స్ గా పోటీకి సిద్ధమవుతున్నారు. ఎస్ కోటలో ఎన్నారై గొంప కృష్ణ రెబల్ గా పోటీ చేస్తానని ప్రకటించారు కూడా. తాను గెలిచి చూపించి… తర్వాత టీడీపీలో చేరతానని చెబుతున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాల్లో మాడుగుల టిక్కెట్ ఎన్నారై పైలా ప్రసాద్ కు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు రెబల్ గా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. అరకు, పాడురు నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు టీడీపీ రెబల్ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నట్టు సమాచారం. పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అరకు నుంచి దొన్నుదొర, సివేరి అబ్రహం రెబల్స్ గా పోటీ చేసే సూచనలు ఉన్నాయి.
ఉత్తరాంధ్రలో టీడీపీకి మళ్ళీ పాత వైభవం వస్తుందా అంటే డౌటే. మూడో వంతు సీట్లు జనసేన, బీజేపీకి వెళ్ళిపోవడం, టీడీపీ అభ్యర్థుల ఎంపికలో తప్పులు లాంటి అంశాలు సైకిల్ స్పీడ్ కు బ్రేకులు వేస్తాయని అంటున్నారు. ఈ ఏడాది జనవరి దాకా ఇక్కడ టీడీపీ గ్రాఫ్ బాగానే ఉన్నా… పొత్తులు, రెబల్స్ తోనే అన్ని చోట్లా పరిస్థితి తలకిందులు అయ్యేలా ఉంది. రెబల్స్ ని టీడీపీ హైకమాండ్ బుజ్జగించి… మీకు ఏదో ఒక పదవి ఇస్తామని చెబుతున్నా… హామీలను తమ్ముళ్ళు నమ్మడం లేదు. చివరి నిమిషం దాకా టీడీపీ టిక్కెట్ కోసం ట్రై చేసి రాకపోతే రెబల్ గా పోటీకి సిద్ధమవుతున్నారు.