ప్రభుత్వంలో హోంశాఖకు.. ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. డిప్యూటీ సీఎం ఉన్నా.. హోంశాఖ మంత్రిదే ప్రభుత్వంలో సెకండ్ ప్లేస్. చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రులకు శాఖలు కేటాయించారు. అందరూ అవాక్కయ్యేలా వంగలపూడి అనితకు హోం శాఖను కేటాయించారు చంద్రబాబు. ఆమెకు హోం శాఖను కేటాయించడంపై రాజకీయవర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అసలు ఆమెకే ఎందుకు హోం శాఖ.. చంద్రబాబు వ్యూహం ఏంటి.. ఈ నిర్ణయం వెనక ఎలాంటి స్ట్రాటజీ ఉంది అనే డిస్కషన్ జరుగుతోంది.
చంద్రబాబు నిర్ణయం వెనక భారీ వ్యూహం ఉంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. టీడీపీలో మహిళా నేతలు చాలా మందే ఉన్నా.. వారిలో ఫైర్ బ్రాండ్ల్ మాత్రం కొద్దిమందే. అలాంటి ఫైర్‌బ్రాండ్ లిస్ట్‌లో టాప్‌లో ఉంటారు అనిత. వైసీపీ సర్కార్ హయాంలో మంత్రులంతా కలిసి మాటల దాడికి దిగినప్పుడు.. సింగం సింగిల్ అనే రేంజ్‌లో వాళ్లకు కౌంటర్లు ఇచ్చారు అనిత. జగన్ నుంచి రోజా వరకు.. ఎవరికి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి.. ఎంత రేంజ్ ఆన్సర్ ఇవ్వాలో.. పక్కాగా లెక్కేసినట్లు కౌంటర్లు ఇచ్చేవారు. ఆ తెగువే.. ఇప్పుడు అనితను హోంమంత్రిని చేసిందనే చర్చ జరుగుతోంది.
దీనికితోడు గత సర్కార్ హయాంలో జగన్ కేబినెట్‌లో హోం శాఖ మంత్రులుగా మేకతోటి సుచరిత, తానేటి వనిత పని చేశారు. అదే పంథాలో అనితకు ఇప్పుడు చంద్రబాబు చాన్స్ ఇచ్చారు అన్నది మరికొందరు అంటున్న మాట. తానేటి వనిత, మేకతోటి సుచరిత అనితది ఒకే సామాజికవర్గం. ఈ కారణంతోనే అనితను హోంశాఖ మంత్రిగా సెలక్ట్ చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 2019 ఎన్నికల్లో కొవ్వూరు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అనిత.. తానేటి వనిత చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇదంతా ఎలా ఉన్నా.. టీడీపీ అధికారంలోకి వస్తే.. తమ పనితనం ఎలా ఉంటుందో ఏడాది కింద అనిత మాట్లాడిన మాటలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయ్. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. వైసీపీ చేసిన ఆరోపణలకు పక్కాగా లెక్కలు సరి చూసేందుకే అనితకు ఈ శాఖను కేటాయించారనే చర్చ కూడా జరుగుతోంది.